రాజధానిలో శ్రీవారి ఆలయం.. రెండో దశ పనులతో కొత్త అందాలు

నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాజధాని పనులతో సమాంతరంగా శ్రీవారి ఆలయ అభివృద్ధి జరగాలని కోరుకున్నారు.;

Update: 2025-11-26 17:01 GMT

రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా తొలిసారిగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆలయం విస్తరణకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబు 3.0 పాలనలో పూర్తయిన ఈ ఆలయాన్ని నాలుగు విడతులుగా పూర్తిస్థాయిలో విస్తరించాలని నిర్ణయించారు. అయితే గత ప్రభుత్వంలో ఆలయ విస్తరణ పనులను విస్మరించడంతో రాజధానిలోని టీటీడీ ఆలయం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే చంద్రబాబు గత పాలనలోనే ఆలయాన్ని తొలి విడతలో నిర్మించి శ్రీవారిని ప్రతిష్ఠించడంతో ప్రస్తుతం రోజూ పూజలు జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి దర్శనానికి వచ్చే భక్తులు.. వెంకటపాలెం వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో రెండో విడత పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్దమయ్యారు.




 


నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు రాజధాని పనులతో సమాంతరంగా శ్రీవారి ఆలయ అభివృద్ధి జరగాలని కోరుకున్నారు. దీంతో టీటీడీ నుంచి రూ.260 కోట్ల రూపాయలను విడుదల చేయించారు. ఈ నిధులతో రెండు దశల్లో శ్రీవారి ఆలయాన్ని విస్తరించనున్నారు. ఈ పనులకు గురువారం ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. మొదటి దశలో రూ.140 కోట్ల వ్యయంతో వివిధ పనుల్ని చేపడతామని టీటీడీ అధికారులు తెలిపారు. రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించనున్నారు. ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. వీటి నిర్మాణాలకు రూ.48 కోట్లు ఖర్చు కానుంది.




 


ఇక రెండోదశ పనులను రూ.120 కోట్లతో చేపట్టనున్నారు. శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు-సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం మొదటి విడత పూర్తైన నేపథ్యంలో రేపు శంకుస్థాపన అనంతరం రెండు, మూడవ విడత పనులు చేపట్టనున్నారు. 4వ విడత పనుల్ని కూడా త్వరలోనే చేపట్టి టెండర్లు పిలుస్తారు.

ఆలయ విస్తరణకు వైసీపీ గ్రహణం

తిరుమల తరహలో రాజధాని అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా నది తీరాన అత్యద్భుతంగా వేంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి 25.417 ఎకరాలు కేటాయించి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక గత పాలకులు ఆలయ విస్తీర్ణాన్ని కుదించారు. కేటాయించిన భూమిలోనూ కోత పెట్టడంతో పాటు విస్తరణ పనులు రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది.

Tags:    

Similar News