పైపుల దగ్ధంపై సిట్! వరుస ఘటనలతో సర్కార్ షాకింగ్ డెసిషన్?
రాజధాని ప్రాంతమైన రాయపూడిలో సోమవారం పైపులు కాలిపోగా, అదే రోజున దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కు అనకాపల్లి జిల్లాలో భూమిపూజ జరిగింది.;
రాజధాని అమరావతి పనుల కోసం తీసుకువచ్చిన హెచ్.పీ.వీ. పైపులు వరుసగా కాలిపోవడంపై ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. అమరావతిపై కుట్రతో ఎవరైనా కావాలనే పైపులకు మంటలు పెడుతున్నారా? అని ప్రభుత్వం సందేహిస్తోంది. ఒకే నెలలో రెండు సార్లు కోట్ల విలువైన పైపులు కాలిపోవడమే అంతుచిక్కడం లేదని అంటున్నారు. దీనిపై ప్రత్యేక విచారణ జరిపేందుకు సిట్ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాత్రి రాజధాని పరిధిలో రాయపూడి వద్ద మేఘా ఇంజనీరింగ్ వర్క్ సైటులో పైపులు కాలిపోయాయి. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ విచారణకు ఆదేశించింది.
రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో నిర్మాణ పనుల కోసం తీసుకువచ్చిన పైపులు వరుసగా తగలబడుతున్నాయి. అర్ధరాత్రి పూట, జన సంచారం లేని సమయాల్లో ఈ మంటలు వ్యాపిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. కోట్ల రూపాయల విలువైన పైపులు ఏ కారణం లేకుండా కాలి బూడిదవడమే సందేహాలకు కారణమవుతోందని అంటున్నారు. మార్చి 11న ఒక సారి తాజాగా మరోసారి రాజధాని నిర్మాణంలో వాడుతున్న H.P.V. పైపులు కాలిపోయాయి. ఈ ఘటనను పరిశీలిస్తే ప్రమాదం అనిపించడం లేదని రైతులు చెబుతున్నారు.
రాజధాని నిర్మాణ పనులు చూసి ఓర్వలేక కుట్రతోనే మంటలు రగిలిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు సందేహిస్తున్నాయి. హోంమంత్రి అనిత కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ పైపులు కాలిన ఘటనకు కారణాలు ఏంటో తేల్చాలని పోలీసులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నంలోనే పైపులకు గుర్తు తెలియని వ్యక్తులు మంటలు పెట్టి ఉంటారని మంత్రి అనిత వ్యాఖ్యానించారు. రాజధానిపై కుట్రలు చేస్తున్నారని, ఎవరినీ ఉపేక్షించేది లేదని హోంమంత్రి హెచ్చరించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
రాజధాని ప్రాంతమైన రాయపూడిలో సోమవారం పైపులు కాలిపోగా, అదే రోజున దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ కు అనకాపల్లి జిల్లాలో భూమిపూజ జరిగింది. ఇది ప్రచారం జరగకుండా ఉండేందుకు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పైపులకు అగ్గి పెట్టారా? అన్న అనుమానం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు కూడా ప్రధాని మోదీ పర్యటన సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాజధానిలో అగ్గి రగిల్చారని చెబుతున్నారు. ఆ సమయంలో కేసు నమోదుచేసిన పోలీసులు సీరియస్ గా వ్యవహరించలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ నెల 11న కాలిపోయిన పైపుల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం చూపించారని మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే దుండగులు చెలరేగిపోతున్నారని భావించాల్సివస్తోందని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి వాడుతున్న పైపులు స్వయంచాలకంగా కాలిపోవని నిపుణులు చెబుతున్నారు. ఎండలకు పైపులు కాలిపోయే పరిస్థితి అసలే లేదని అంటున్నారు. అత్యంత ధృడమైన ఈ పైపులను మండించాలంటే సుమారు 340 డిగ్రీల నుండి 400 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుందని చెబుతున్నారు. ఇంత తీవ్రమైన ఎండలు ఉండవని, కానీ పైపులు ఉత్తిత్తినే కాలిపోతున్నాయని అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఎండలకు పచ్చగడ్డి ఎండి ప్రమాదానికి కారణమవుతుందా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైనా నిప్పు వేయకుండా ఎండు గడ్డి కూడా కాలే పరిస్థితి ఉండదని అంటున్నారు. కుట్ర లేదంటే నిర్లక్ష్యంగా ఎవరైనా నిప్పుతో ఉన్న సిగరెట్, బీడీ వంటివి పడేసినా అగ్ని కీలలు రాజుకునే ప్రమాదం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.