అమరావతి కోసం మోడీ బోలెడు మోసుకొస్తున్నారా ?

ఇక అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో రూపు దిద్దుకోవడానికి రంగం మొత్తం సిద్ధం అయింది. అమరావతి దశ తిరిగింది అనడానికి అనేక శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి.;

Update: 2025-04-18 22:30 GMT

అమరావతి అన్నది ఏపీకి రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది. ఈ రాజధాని కేవలం ఏపీకే కాదు ప్రపంచ రాజధానిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. ఆయన తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారు. అమరావతిని వరల్డ్ డెస్టినీ గా మార్చాలని చూస్తున్నారు. అదే కనుక జరిగితే ఏపీ కంటే సంపన్న రాష్ట్రం భవిష్యత్తులో మరోటి ఉండబోతోదని మేధావులు కూడా అంటున్నారు.

ఇక అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో రూపు దిద్దుకోవడానికి రంగం మొత్తం సిద్ధం అయింది. అమరావతి దశ తిరిగింది అనడానికి అనేక శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాలుగవ సారి ఏపీకి సీఎం కావడం అతి పెద్ద శుభం అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా గడచిన కాలానికి భిన్నంగా ఈసారి ఏపీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఏపీకి ఆయన తనదైన శైలిలో ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నారు. అమరావతి రాజధానికి సంబంధించి కూడా కేంద్రం కొంత గ్రాంట్ ఇవ్వడమే కాకుండా తాను గ్యారంటీగా ఉండి ప్రపంచ బ్యాక్ నుంచి రుణాన్ని కూడా వచ్చేలా చూసింది.

అలాగే ఏపీ ప్రభుత్వం వివిధ ఏజేన్సీల ద్వారా రుణం పొందేందుకు కూడా సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు మే 2న అమరావతికి వచ్చి పునర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నరేంద్ర మోడీ ఏమైనా వరాలు ప్రకటిస్తారా అన్న చర్చ సాగుతోంది. దేశ ప్రధాని వస్తున్న సందర్భం అందునా పదకొండేళ్ళుగా రాజధాని లేని ఏపీకి ఊరటను ఇచ్చేలా మోడీ నుంచి కీలక ప్రకటనలు ఉండొచ్చు అని అంటున్నారు.

కేంద్రంలోని ఎండీయే ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రాణ వాయువుగా ఉంటున్నారు. అంతే కాదు పూర్తి స్థాయిలో తెలుగుదేశం సహకరిస్తోంది. కేవలం ఏపీ అభివృద్ధినే తెలుగుదేశం కోరుకుంటోంది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఏపీ పట్ల పూర్తి సానుకూలత చూపించవచ్చు అని అంటున్నారు.

గతసారి అంటే 2015 అక్టోబర్ 22న విజయదశమి రోజున ఏపీకి వచ్చి అమరావతి రాజధానికి నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో శంకుస్థాపన చేశారు. అయితే ఆనాడు చెంబుడు నీరు, మట్టి ఇచ్చి పోయారు అన్న విమర్శలు ఈ రోజుకీ విపక్షాలు చేస్తారు. అయితే అమరావతి రాజధాని కోసం కేంద్రం గ్రాంట్స్ ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతూంటారు. కానీ ఈ ప్రచారం మాత్రం ఈ రోజుకీ బీజేపీని గుక్కతిప్పుకోలేని విధంగా ఉంది.

దాంతో నరేంద్ర మోడీ ఈసారి అలాంటి విమర్శలకు చెక్ పెట్టేలా ఏపీకి ఆనందం కలిగించేలా అమరావతి రాజధానికి మరింత బలం చేకూరేలా కీలకమైన ప్రకటనలు చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే గతానికి భిన్నంగా మోడీ చంద్రబాబుల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతోంది. ఈ సమయంలో ఏపీకి వస్తున్న మోడీ ఢిల్లీ నుంచి బోలెడు వరాలు మోసుకుని వస్తున్నారు అని ఆశించవచ్చా అంటే ఆశించవచ్చు అన్న జవాబు వస్తోంది. చూడాలి మరి మే 2న మోడీ ఏమి మాట్లాడుతారో, ఏ వరాల మూటను విప్పుతారో.

Tags:    

Similar News