రాజధానికి చట్టబద్ధత: మిగిలిపోయిన ప్రశ్నలు.. !
కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో దీనిపై పెద్దగా చర్చోపచర్చలు.. సాగదీతలు ఏమీ లేకుండానే అ న్నీ అనుకున్నట్టే జరిగిపోయింది.;
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. లాంఛనప్రాయంగానే పూర్తయింది. కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో దీనిపై పెద్దగా చర్చోపచర్చలు.. సాగదీతలు ఏమీ లేకుండానే అ న్నీ అనుకున్నట్టే జరిగిపోయింది. మొత్తంగానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సంతకంతో రాజధానికి చట్ట బద్ధత వచ్చేస్తుంది. చంద్రబాబు చెబుతున్నట్టుగా దీనిని భవిష్యత్తులో ఎవరూ కదిలించలేకపోనూ వచ్చు. అంతేకాదు.. అమరావతికి ఇక, చెక్కు చెదరని కీర్తి కూడా లభించవచ్చు. సందేహం లేదు.
అయితే.. చట్టబద్ధతకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అలానే ఉన్నాయి. వాటిని కూడా క్లారిటీ ఇచ్చి.. సమాధానం చెబితే బాగుంటుందన్న చర్చ సాగుతోంది. ప్రధానంగా రాజధాని చట్టబద్ధత విషయంలో ఎంత మేరకు భూమి తీసుకుంటున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ``సీఆర్ డీఏ నోటిఫై చేసిన భూమి.. అమరావతిగా గుర్తించబడుతుంది.`` అని పేర్కొన్నారు. ఇది ఒక అంతులేని ప్రహసనం. ఎంత వరకు భూసమీకరణ చేస్తారు? అనేది ప్రశ్న. ఇప్పటికి రెండు దశల్లో తీసుకునే భూమిపైనా స్పష్టత లేదు.
2) రాజధాని రైతులు .. సమీకరణ ద్వారా ఇచ్చిన భూముల స్థానంలో వారికి ఇస్తున్న ప్రయోజనాలు.. ఇవ్వాల్సిన ప్రయోజనాలను చేర్చలేదు. ఇదే విషయాన్ని పార్లమెంటులో యూపీకి చెందిన ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలు లేకుండా బిల్లు రూపొందించారు.. అన్న ఆయన ప్రశ్నకు.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ముక్తసరి సమాధానం చెప్పారు. రైతులకు అన్ని మేళ్లు చేసేశామన్నారు. కానీ.. వాస్తవం క్షేత్రస్థాయిలో వేరేగా ఉంది.
ఇప్పటికి రైతులకు ఇవ్వాల్సిన భూములను(అభివృద్ధి చేసి ఇవ్వాలి) ఇప్పటికీ చూపించలేదు. పైగా.. రాజధాని మధ్యలో కొందరు భూములు ఇవ్వలేదు. వారి నుంచి సేకరణ ద్వారా తీసుకుంటామన్నారు. దీనికి కూడా స్పష్టత లేదు. ఈ అంశం.. రేపు మళ్లీ ప్రభుత్వం కనుక మారితే.. రైతులకు గుదిబండగా మారుతుంది. వచ్చేప్రభుత్వం రాజధానిని మార్చలేక పోవచ్చు.. కానీ.. రైతులకు ప్రయోజనం విషయంలో ఎలాంటి అడుగు ముందుకు పడదు.
ఇక, రాజధానిలో నవ నగరాలు అని ఆది నుంచి ప్రభుత్వం చెబుతోంది. కానీ, తాజా బిల్లులో వాటి ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. కేవలం `ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులోని సెక్షన్ 5లో ఉన్న 2ఏ సబ్ సెక్షన్‌కు మాత్రమే సవరణ. ఆ స్థానంలో ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుంది.` అని మాత్రమే పేర్కొన్నారు. తద్వారా రాజధాని సమగ్రస్వరూపాన్ని బిల్లులో చేర్చలేదు. ఇది భవిష్యత్తులో రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు సాగుతాయన్న ప్రశ్నను మిగిల్చింది.
ఏతా వాతా ఎలా చూసినా.. ఈబిల్లు రాజధానిని మార్చకుండా చేయగలదేమో కానీ.. రైతుల సమస్యలు, నవనగరాల నిర్మాణం, అమరావతి స్వరూపాన్ని పటిష్టం చేయలేక పోయింది. రేపు ప్రభుత్వం మారితే..(జగన్ చెబుతున్నట్టు) అమరావతి నగరాన్ని కుదించే అవకాశం లేకపోలేదని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే.. పరిధిని నిర్ణయించలేదు. సీఆర్‌డీయే పరిధిలో ఉన్నది అమరావతి అన్నారు. రేపు ఈ పరిధిని కుదించరన్న గ్యారెంటీ ఏమీలేదని అంటున్నారు పరిశీలకులు. సో.. ఈ ప్రశ్నలను చంద్రబాబు పరిశీలించాల్సిన అవసరం ఉంది.