'అమ‌రావ‌తి' చ‌రిత్రాత్మ‌కం.. వ్య‌తిరేకించేవారికే న‌ష్టం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

లోక్‌సభలో అమరావతికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లు ఆమోదం పొంద‌డం ప‌ట్ల ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.;

Update: 2026-04-02 04:39 GMT

లోక్‌సభలో అమరావతికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లు ఆమోదం పొంద‌డం ప‌ట్ల ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇదో చ‌రిత్రాత్మ‌క సంద‌ర్భ‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్ర‌జ‌లు సంతోషించే శుభ సంద‌ర్భ‌మ‌ని తెలిపారు. అమ‌రావ‌తిని ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌తిరేకించిన వారు.. ఇక‌నైనా స్వాగ‌తించాల‌ని ప‌రోక్షంగా ఆయ‌న వైసీపీ నాయ‌కుల‌కు సూచించారు. ఒక‌వేళ ఇంకా వ్య‌తిరేకిస్తూ పోతే.. అది వారికే మ‌రింత న‌ష్ట‌మ‌ని హెచ్చ‌రించారు.

''ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం. అమరావతిని మన రాష్ట్రానికి ఏకైక, శాశ్వత రాజధానిగా ప్రకటించే అమరావతి చ‌ట్ట‌బ‌ద్ధ‌త బిల్లు లోక్‌స‌భ‌లో ఆమోదం పొందడం, మన ప్రజల సంకల్పానికి, పట్టుదలకు, ఆకాంక్షలకు నిదర్శనంగా నిలుస్తుంది.'' అని పేర్కొన్నారు. 33 వేల‌ ఎకరాలకు పైగా భూమిని దానం చేసి, సాటిలేని త్యాగం చేసిన అమరావతి ప్రాంత రైతులకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. రైతుల‌ విశ్వాసం, వారు చేసిన త్యాగం.. తరతరాలుగా గుర్తుండిపోతుంద‌న్నారు. అలాగే, అమరావతికి పునాది వేసిన సీఎం చంద్ర‌బాబు నిబద్ధత, దూరదృష్టి రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంద‌ని పేర్కొన్నారు.

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌డంలోనూ.. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డంలోనూ నిరంతరం మద్దతు ఇస్తున్న ప్ర‌ధాని మోడీకి కూడా కృత‌జ్ఞ‌తలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వపు తిరోగమన, ఏకపక్ష నిర్ణయాలు, రైతుల పోరాటాలు, మహిళల ఆవేదన, యువత ఎదుర్కొంటున్న అనిశ్చిత భవిష్యత్తు వంటి సవాళ్ల నడుమ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్భుతమైన స్పష్టతను, ధైర్యాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా, వారు పురోగతిని, స్థిరత్వాన్ని, తమ ఆకాంక్షలకు అనుగుణమైన భవిష్యత్తును ఎంచుకున్నారని కొనియాడారు.

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలలోనే కాకుండా, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులలో కూడా బలమైన, నూతన విశ్వాసం చిగురించిందని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. అమరావతి ఇకపై కేవలం రాజధానిగా మాత్రమే కాకుండా, ఆశాకిరణంగా, దృఢసంకల్పంగా, సామూహిక సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ''స్వర్ణ ఆంధ్ర 2047 దార్శనికతను సాకారం చేయడంలో అమరావతి కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ప్రధాని మోదీ `వికసిత భారత్ 2047` దార్శనికతకు గణనీయంగా దోహదపడుతుంది.'' అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News