అమరావతికి బెంగళూరు కంటే పెద్ద ఎయిర్ పోర్టు అవసరమా?

ఇలాంటి వేళ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటల్ని విన్నప్పుడు.. భారీ ఎయిర్ పోర్టు అవసరం ఎంతన్న విషయం అర్థమవుతుంది.;

Update: 2025-05-24 09:27 GMT

మనిషి జీవితంలో కొన్ని విషయాల్లో భారీగా ఉండాలని కోరుకుంటాం. కానీ.. కొన్నింటికి మాత్రం భారీతనం అస్సలు అవసరం లేదనుకుంటాం. ఇప్పుడు అలాంటి ప్రచారమే ఏపీకి సంబంధించి.. మరీ ముఖ్యంగా అమరావతి విషయంలో తరచూ చోటు చేసుకోవటం కనిపిస్తోంది. అమరావతిలో నిర్మించే ఎయిర్ పోర్టు బెంగళూరు కంటే పెద్దదిగా ఉండాలని కోరుకోవటం అవసరమా? అన్నప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.

ఇలాంటి వేళ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటల్ని విన్నప్పుడు.. భారీ ఎయిర్ పోర్టు అవసరం ఎంతన్న విషయం అర్థమవుతుంది. రాజధాని మీద జరుగుతున్నతప్పుడు ప్రచారాలకు చెక్ పడేలా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హైదరాబాద్ లాంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ కు వద్దా? ఆ అవసరం లేదా? తెలంగాణ ఆదాయంలో 75 శాతం హైదరాబాద్ నుంచే వసతోంది. ఇవన్నీ మర్చిపోయి మూర్ఖంగా మాట్లాడే వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతిలో బెంగళూరుకు మించిన ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. దీనికి సంబంధించిన విజన్ ప్లాన్ ఆయన మాటల్లో వినాల్సిందే. ‘‘అమరావతి ఎయిర్ పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టదు. ఇన్వెస్టర్లే కడతారు. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అమరావతికి అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వస్తేనే మరింత డెవలప్ అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. నిజమే.. ఒక అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఒక నగర రూపురేఖల్ని ఎంతలా మారుస్తుందనటానికి నిదర్శనంగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఒక ఎగ్జాంఫుల్ గా చెప్పొచ్చు.

ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ‘ఇరవై ఏళ్ల క్రితం మన ఎయిర్ పోర్టులు ఎలా ఉండేవో తెలుసు కదా. వాటికి భిన్నంగా మేం హైదరాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. దాని గురించి ప్రతిపాదించినప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అని నాటి ప్రధానమంత్రి వాజ్ పేయి అడిగారు. అప్పుడు నేను డబ్బు అవసరం లేదు. అడిగిన పాలసీ ఇవ్వాలని కోరాం. మీకు ఆసక్తి ఉంటే అందులో కేంద్రం తరఫున వాటా పెట్టుకోండి. లేదంటే అది కూడా వద్దని చెప్పాం. ప్రభుత్వ వాటా ఉంటే అక్కడ జరిగే వాణిజ్యంలో ఆదాయం వస్తుందని చెప్పాం. శంషాబాద్ ఎయిర్ పోర్టు సాకారం చేయటానికి 32 సమావేశాల్ని కేంద్రంతో నిర్వహించాం. అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రి కూడా మేం చెప్పిన విధానానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు. అయినా.. పోరాడాటంతో చివరకు నాటి ప్రధాని వాజ్ పేయి ఓకే చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్ పోర్టు తెలంగాణ వ్రద్ధి రేటులో 17 శాతం వాటాను సమకూరుస్తోంది’’ అని వెల్లడించారు.

ప్రస్తుతం బెంగళూరు ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రపంచంలోనే అత్యుత్తమైనదని.. అందులో ప్రభుత్వమేమీ డబ్బులు పెట్టలేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని.. బెంగళూరుఎయిర్ పోర్టు టెర్మినల్ 2 అనుభవం ఇప్పుడు అందరికి ఒక పాఠంగా మారిందన్నారు. సంపద స్రష్టికి ప్రభుత్వ విధానాలే అత్యంత ముఖ్యమన్న చంద్రబాబు మాటలు అక్షర సత్యాలుగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News