గ్రౌండ్ రియాల్టీ: బాబుకు పెద్ద కష్టం అవసరం లేదు బ్రో!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు గడిచిపోయాయి. ఈ 23 మాసాల కాలంలో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది.. అనే అంశంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవం;
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు గడిచిపోయాయి. ఈ 23 మాసాల కాలంలో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది.. అనే అంశంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవం. సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల కల్పన వంటి అంశాల్లో ప్రజల మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వచ్చాయి. అది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుతో మరింతగా పెరిగింది. దీంతో సహజంగా ఇటీవల కాలంలో ప్రత్యామ్నాయం దిశగా ప్రజలు ఆలోచన చేశారు అని వైసిపి నాయకులు చెప్పుకొచ్చారు.
కానీ, అనూహ్యంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంతోపాటు వైసీపీ వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పుడు ప్రజల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని తెలుస్తోంది. తాజాగా క్షేత్రస్థాయిలో ఆన్లైన్ ఛానళ్లు, స్వతంత్రం మీడియా సంస్థలు కొన్ని ప్రజలను కలిసినప్పుడు రాజధానిగా ఏది కోరుకుంటున్నారు? అని అడిగితే అమరావతి రాజధాని కోరుకుంటున్నామని 99 శాతం మంది చెప్పటం ఆశ్చర్యం కలిగించినప్పటికీ నిజం. ఇది కూటమి ప్రభుత్వానికి అత్యంత కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు క్షేత్రస్థాయిలో సర్వేలు చేసిన సంస్థలు అనేక అంశాలను ప్రజల ముందు పెట్టాయి.
కేంద్రంతో రాష్ట్రానికి ఉన్న సంబంధాలతో పాటు అప్పుల అంశాన్ని కూడా ప్రస్తావించటం విశేషం. జగన్ హయాంలో అప్పులు జరిగాయి.. ఇప్పుడు చేస్తున్నారు.. కదా అన్న ప్రశ్నకు ప్రజలు చాలా ఆసక్తి కర సమాధానం చెప్పారు. కుటుంబం అన్నాక అప్పులు చేసుకోవలసిన పరిస్థితి ఉందని.. ప్రభుత్వాలు చేయడం తప్పుకాదని వ్యాఖ్యానించారు. తాము ఆరోజు(వైసీపీ) తప్పు పట్టలేదని ఈరోజు కూడా తప్పు పట్టడం లేదని చెప్పటం కనిపించింది. ప్రధానంగా వైసీపీలో మార్పు వచ్చిందా అన్న ప్రశ్నకు మెజారిటీ ప్రజలు రాలేదని సమాధానం చెప్పారు.
అయితే జగన్ పాదయాత్ర తో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉందన్నది 50% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మెజారిటీ ప్రజల్లో జగన్ పై కొంత సానుకూలత కనిపించినప్పటికీ ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి సహా అనుభవం మీద కూడా పెద్ద ప్రభావం కనిపించింది. ముఖ్యంగా రాజధాని విషయంలో అదే విధంగా అభివృద్ధి , పెట్టుబడుల విషయంలో వైసీపీకి ఎక్కువ మంది ప్రజలు సానుకూలంగా స్పందించకపోవడం ఇక్కడ చర్చనీయాంశం. జగన్ హయాంలో ఏం చేశాడో తమకు తెలియదని ఎక్కువ మంది చెప్పారు.
అదే సమయంలో కూటమి ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం వస్తున్న పెట్టుబడులతో పాటు విశాఖ, అమరావతి, కర్నూలు, చిత్తూరు వంటి ప్రధాన జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రస్తావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని ఎక్కువమంది ప్రస్తావించారు. సో మొత్తంగా వచ్చే ఎన్నికల నాటికి భారీ స్థాయిలో మార్పు ఏమైనా ఉంటుందా.. అని అడిగితే పెద్దగా మార్పు ఏమి ఉండకపోవచ్చు అన్నది 60 నుంచి 70 శాతం మంది ప్రజలు చెప్పినట్టు ఆన్లైన్ ఛానళ్లు చెబుతున్నాయి.
ముఖ్యంగా చంద్రబాబు సమర్థత.. 75 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎక్కడా అలుపెరుగకుండా పనిచేయడం.. మంచి మార్కులు పడేలా చేస్తున్నాయి. ఇక తరచుగా మంత్రివర్గ సమావేశాలు నిర్వహించటం, మంత్రుల పనితీరును అంచనా వేయడం వంటివి కూడా ప్రజల మధ్య చర్చగా మారాయి. ఇవన్నీ కూటమి ప్రభుత్వానికి కలిసి వస్తున్న అంశాలుగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో బాబు పెద్దగా కష్టపడవలసిన అవసరం లేకుండానే విజయం సాధించుకోవచ్చు అన్నది తాజాగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టమైనది.