అమరావతి సంరంభం.. 10 విశేషాలు ఇవే!
ఈ క్రమంలో అమరావతి శోభను మరింత పెంచే పది విశేషాలు.. ఆసక్తిగా మారాయి.;
ఏపీ రాజధాని అమరావతి పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్న నేపథ్యంలో రాజ ధాని ప్రాంతంలో ప్రత్యేక పండుగ కళ సంతరించుకుంది. భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలు.. పార్టీల అభి మానులు.. అమరావతి పునః ప్రారంభ పనులను తమ సొంత ఇంటి ప్రారంభ పనులుగా భావించడం గమనార్హం. ఈ క్రమంలో అమరావతి శోభను మరింత పెంచే పది విశేషాలు.. ఆసక్తిగా మారాయి.
1) రాజధాని అమరావతికి అటు ఇటు.. నలుదిక్కులగా 20 నుంచి 30 కిలో మీటర్ల పరిధిలో రహదారులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పార్టీల జెండాలతో పాటు.. అమరావతి రైతులతో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.
2) ఒక్క రాజధాని ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7-8 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. కొందరు సొంత వాహనాలపై రాగా.. మెజారిటీ ప్రజలు ప్రభుత్వం, పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన వాహనాలపై రాజధానికి చేరుకున్నారు.
3) ప్రధాన మంత్రి వస్తున్న నేపథ్యంలో ఆయన వేషధారణలో పలువురు కళాకారులు సందడి చేశారు. అదేవిధంగా కొందరు ఎన్టీఆర్ వేష ధారణలో కనిపించారు.
4) టీడీపీ నాయకుడు, కళాకారుడు గుమ్మడి గోపాల కృష్ణ వేదికపై చేసిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించింది. అదేవిధంగా పలువురు యువతులు చేసిన ఏకపాత్రాభినయం, డ్యాన్స్ వంటివి ఆకట్టుకున్నాయి.
5) అమరావతి రైతులు.. భూములు ఇచ్చిన అన్నదాతలు.. మెడలో ఆకుపచ్చ కండువాలతో సభా వేదికకు ముందు భాగంలో కూర్చున్నారు. వారిని ప్రధాని మోడీ స్వయంగా పలకరించి.. అభినందించనున్నారని కలెక్టర్ మీడియాకు తెలిపారు.
6) రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రజలకు ఎక్కడికక్కడ ఆహారం, తాగునీరు అందించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా.. పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా రంగంలోకి దింపారు.
7) మహిళా రైతులు.. సభా వేదికపై ప్రత్యేక నృత్యాలు.. పాటలతో అలరించారు. రైతుల ఉద్యమ పాటలు ఆకట్టుకున్నాయి.
8) వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్స్ ద్వారా.. అమరావతి వైభవం షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శిం చారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో అమరావతి రైతులు పడిన ఇబ్బందులను కళ్లకు కట్టినట్టు చూపించా రు. నాయకులు చేసే ప్రసంగాలను కూడా.. ఈ తెరలపై స్పష్టంగా వీక్షించే అవకాశం కల్పించారు.
9) సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అన్ని గ్యాలరీలు.. సభ ప్రారంభానికి రెండు గంటల ముందుగానే నిండిపోయాయి. అయితే.. ఎక్కడా ఎలాంటి తొక్కిసలాట లేకుండా.. రాకుండా.. ఏర్పాట్లు చేయడం గమనార్హం.
10) సభా వేదిక చుట్టూ.. ఇనుము స్క్రాప్‌తో రూపొందించిన చంద్రబాబు, ప్రధాని మోడీ, అమరావతి చిత్రాలు.. ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాజధాని చరిత్రను తెలిపే.. మరో ప్రదర్శన కూడా అందరినీ అలరించింది.