అమరావతి ఓకే.. విశాఖ, కర్నూలు సంగతేంటి? మూడు రాజధానుల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?
ఇక ప్రభుత్వం మారడం, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి తీర్చిదిద్దుతుండటంతో కర్నూలు, విశాఖల్లో ప్రస్తుతం ఉన్న కార్యాలయాలు భవనాలను ఏం చేస్తారు? అనేది సందేహాస్పదంగా మారింది.;
ఏపీ కలల రాజధాని అమరావతికి అన్ని విధాలుగా లైన్ క్లియర్ అయింది. ఎన్నో చిక్కులు, అవాంతరాలు అనంతరం ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. అయితే అమరావతి రాజధానితోపాటు గత ప్రభుత్వం చెప్పిన పరిపాలన, న్యాయ రాజధానుల పరిస్థితి ఏంటన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో మూడు రాజధానులు అవసరం అంటూ గత ప్రభుత్వం ఐదేళ్లుగా హడావుడి చేసింది. అయితే ఎన్నికల్లో వైసీపీ ప్రతిపాదనలను ప్రజలు తిరస్కరించారు. ఏకైక రాజధాని అమరావతి అంటూ తీర్పు చెప్పారు. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం చెప్పిన మిగిలిన రెండు రాజధానులు ఏం ఏం ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
గత ప్రభుత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వంలో బిల్లు ప్రవేశపెట్టారు. అయితే శాసనమండలిలో బలం లేకపోవడం, కొన్ని న్యాయపరమైన అవాంతరాలు ఎదురుకావడంతో ఆ బిల్లును వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ మూడు రాజధానులే తమ విధానమంటూ ఎన్నికలకు వెళ్లింది. ఇక తన పాలన కాలంలో కర్నూలులో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. హైకోర్టును కర్నూలుకే తరలిస్తామని ప్రకటించింది. కానీ, కేంద్రం, సుప్రీం కోర్టు అనుమతుల ప్రక్రియ కూడా ప్రారంభించకపోవడంతో కర్నూలు హైకోర్టు ప్రతిపాదన బుట్టదాఖలైంది. మరోవైపు పరిపాలన రాజధానిగా చెప్పిన విశాఖలో ఏ కార్యాలయాన్ని ప్రారంభించలేకపోయింది. రుషికొండపై దాదాపు రూ.450 కోట్లతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించింది. అయితే ఇది క్యాంపు కార్యాలయం కాదంటూ అప్పట్లో చెప్పిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు, రుషికొండపై రహస్యంగా భవనాలను నిర్మించి విమర్శలకు గురయ్యారు.
ఇక ప్రభుత్వం మారడం, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి తీర్చిదిద్దుతుండటంతో కర్నూలు, విశాఖల్లో ప్రస్తుతం ఉన్న కార్యాలయాలు భవనాలను ఏం చేస్తారు? అనేది సందేహాస్పదంగా మారింది. వాస్తవానికి విశాఖలో ఎలాంటి రాష్ట్ర స్థాయి కార్యాలయం ఏర్పాటు చేయనప్పటికీ, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా నిర్మించిన రుషికొండ భవనాల భవిష్యత్ పైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలను ఏం చేయాలన్న విషయంపై కూటమి ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. 7 స్టార్ హోటల్ మాదిరిగా నిర్మించిన రుషికొండ భవనాలు కార్యాలయాలు నిర్వహించడానికి అనుగుణంగా లేవని చెబుతున్నారు. మరోవైపు విశాఖను పరిపాలన రాజధానిగా గత ప్రభుత్వం ప్రకటిస్తే.. కూటమి ప్రభుత్వం మాత్రం ఆర్థిక రాజధానిగా విశాఖను పరిగణిస్తోంది.
పరిపాలన వ్యవహారాలు మినహా విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని అంటున్నారు. ఐటీ హబ్ ఏర్పాటుతోపాటు విశాఖలో వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం అతిపెద్ద నగరంగా విశాఖను పరిగణిస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి విశాఖ కీలకంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో కర్నూలుకు హైకోర్టు తరలింపు ప్రక్రియను పుల్ స్టాప్ పెట్టిన కూటమి ప్రభుత్వం.. అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా ఇప్పటికే ఉన్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను యథావిధిగా కొనసాగించనుందని చెబుతున్నారు. దీంతో పేరు ఏదైనా ఇప్పటికీ మూడు రాజధానులు అన్న ప్రతిపాదనకు అనుగుణంగానే మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారని అంటున్నారు.