రాజ్యసభలో వైసీపీ వాకౌట్.. అమరావతిపై వైవీ కీలక వ్యాఖ్యలు

ప్రత్యర్థులు షేమ్ షేమ్ అంటున్నా వైవీ మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు. రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తారనే క్లారిటీ బిల్లులో లేదన్నారు.;

Update: 2026-04-02 11:41 GMT

దేశంలో అన్నిపార్టీలు మద్దతు తెలిపినా, విపక్ష వైసీపీ మాత్రం అమరావతి బిల్లును యథాతథంగా ఆమోదించలేమని తేల్చిచెప్పింది. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన వైసీపీ రాజ్యసభా పక్ష నేత వైవీ సుబ్బారెడ్డి తమ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ రాజధాని చట్టబద్దతకు సంబంధించి బిల్లులో కీలక అంశాలను విస్మరించారని వ్యాఖ్యానించారు. బిల్లును సమర్థించలేమని ప్రకటించడమే కాకుండా, బిల్లును నిరసిస్తూ తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

రాజ్యసభలో అమరావతిపై చర్చ సందర్భంగా తెలుగులో మాట్లాడిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తమ పార్టీ ఈ బిల్లును సమర్థించడం లేదని ప్రకటించారు. ఎలాంటి పరిహారం తీసుకోకుండా 34 వేల ఎకరాల వ్యవసాయ భూములు ఇచ్చిన 29 వేల రైతులకు ఈ బిల్లు ద్వారా న్యాయం జరగదని వైవీ వ్యాఖ్యానించారు. ఏడేళ్లుగా అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఎదురుచూశామని వైవీ అన్నారు. అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెబుతుండగా, అధికార పక్షానికి చెందిన టీడీపీ, బీజేపీ రాజ్యసభ సభ్యులు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు.

ప్రత్యర్థులు షేమ్ షేమ్ అంటున్నా వైవీ మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు. రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తారనే క్లారిటీ బిల్లులో లేదన్నారు. రాజ్యాంగంలో దేశ రాజధానిపై మాత్రమే ప్రస్తావన ఉందని, రాష్ట్రాలకు రాజధానిపై రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. గతంలో బిహార్, మధ్యప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే హామీ కూడా బిల్లులో లేదన్నారు. తాము ప్రత్యేక హోదాకు కట్టుబడినట్లు ప్రకటించారు.

తమ పార్టీ అధినేత జగన్ అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. రాజధాని కోసం 50 వేల ఎకరాలు తీసుకున్నారని, ఇంతవరకు ఒక్క ఎకరం కూడా అభివృద్ధి చేయలేదని, ఒక్క శాశ్వత నిర్మాణం కట్టలేదని సుబ్బారెడ్డి ఆరోపించారు. 50 వేల ఎకరాలను అభివృద్ధి చేయాలంటే రెండు లక్షల కోట్లు అవసరం ఉంటుందని, దీనిపై వడ్డీలకే ఏడాదికి రూ.20వేల కోట్ల భావితరాలు చెల్లించుకోవాల్సివుంటుందని తమ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుందన్నారు.

ఇక అమరావతి పేరుతో ప్రభుత్వం అప్పులు చేస్తోందని, భవిష్యత్తులో రాష్ట్రానికి చాలా భారం అవుతుందని సుబ్బారెడ్డి ఆరోపించారు. అందుకే తాము విశాఖపట్నంను రాజధాని చేయాలని అనుకున్నామని వ్యాఖ్యానించారు. కాగా, సుబ్బారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో అధికార పక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేకలు వేశారు. అయినప్పటికీ సుబ్బారెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాజధాని పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అమరావతి బిల్లు ఒక డ్రామాగా వ్యాఖ్యానిస్తూ తమ పార్టీ వాకౌట్ చేస్తోందని చెప్పి సభ నుంచి వెళ్లిపోయారు. వైవీతోపాటు వైసీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోతుండగా, టీడీపీ, బీజేపీ సభ్యులు షేమ్.. షేమ్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు.

Tags:    

Similar News