వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న బలమైన నేత ?

ఏపీలో పాలిటిక్స్ ఏమిటి అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ మూడవ ముచ్చట అయితే లేదు.;

Update: 2025-10-08 08:30 GMT

ఏపీలో పాలిటిక్స్ ఏమిటి అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ మూడవ ముచ్చట అయితే లేదు. ఉన్నవి రెండే పార్టీలు. ఒకటి టీడీపీ కూటమి. మరోటి వైసీపీ. ఇక వామపక్షాలు కాంగ్రెస్ అన్నవి ఉనికి పోరాటం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎవరైనా అసంతృప్తిగా ఉంటే అటు నుంచి ఈ వైపే రావాలి. హౌస్ ఫుల్ గా కూటమి ఉంది. వచ్చే ఎన్నికల నాటికి 225 సీట్లు పెరిగినా కూడా కూటమి నేతలకు అందులోని పార్టీలకు అసలు సరిపోవు. దాంతో కొత్తగా ఎవరైనా వెళ్ళి చేసేది ఏమీ ఉండదు అన్న క్లారిటీ వచ్చింది. దాంతో వైసీపీలో ఉన్న వారు అలా ఉండిపోతున్నారు. కూటమి వచ్చిన కొత్తలో పోలోమని చేరిన వారు అయితే అక్కడ ఏమే దక్కక దిగాలు పడుతున్నారు.

ఇదే అదనుగా చూసి :

ఇక రాజకీయ పార్టీలు ఎపుడూ అదను కోసమే చూస్తాయి. ఒకసారి నిండుగా అధికారం అనుభవించిన వైసీపీకి ఇవన్నీ తెలియనివి కావు. తమకంటూ మంచి రోజులు వస్తాయని అందుకే ధీమాగా ఉంది. ఇక ఏణ్ణర్ధానికి దగ్గర పడుతోంది కూటమి పాలన చివరి ఏడాది ఎన్నికల కోసం తీసేస్తే కూటమికి ఉన్నది రెండున్నరేళ్ళ అధికారం మాత్రమే. దాంతో కూటమి వైపు వెళ్ళడానికి ఆలోచిస్తున్న వారిని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది. ఉమ్మడి పదమూడు జిల్లాలలో ఈ రకమైన సెర్చింగ్ అయితే మొదలెట్టేసింది.

ఆమంచి వారి నుంచి :

ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ ఉన్నారు. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన కాంగ్రెస్ టీడీపీ నుంచి 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆయన ఓటమి పాలు అయ్యారు. పోనీ సర్దుకుందామని అనుకుంటే తన రాజకీయ ప్రత్యర్ధి కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలో చేరడం అది కూడా తనను ఓడించిన వారు తన పార్టీలోకి రావడం, తన సొంత సీటు ఆయనకు ఇచ్చి తనను వేరే చోటకు వైసీపీ అధినాయకత్వం వెళ్ళమనడంతో అలిగిన క్రిష్ణ మోహన్ 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఆ పార్టీ తరఫున డిపాజిట్ తెచ్చుకున్న ఏకైక లీడర్ గా నిలిచారు. అయితే ఇపుడు ఆయన మీద వైసీపీ చూపు పడింది అని అంటున్నారు. ఆయనను తెచ్చి పార్టీలో గట్టి నేతగా నిలబెడితే ప్రకాశం జిల్లాలో వైసీపీకి కొత్త వెలుగులు వస్తాయని ఆ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు.

బాబాయ్ రాయబారాలు :

ఇటీవల ఒంగోలులో వైసీపీ రీజనల్ స్థాయి పార్టీ మీటింగ్ ని వైసీపీ నిర్వహించింది. ఈ మీటింగులో అనేక మంది వైసీపీ నేతలు ఇంచార్జిలు పాల్గొన్నారు. ప్రధానంగా పార్టీ బలోపేతం మీదనే చర్చ సాగింది అని అంటున్నారు. ఈ క్రమంలో ఆమంచి మీద వైవీ సుబ్బారెడ్డి ఫోకస్ పడింది అని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్లిపోయారు. దాంతో ఆ లోటుని భర్తీ చేసుకోవడానికి వైసీపీ చూస్తోంది. ఈ నేపధ్యంలో ఆమంచి మీద చూపు పడింది అని అంటున్నారు. ఆమంచి కూడా సరైన ఆఫర్లు ఇస్తే వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అంటున్నారుట. అన్నీ కుదిరితే తొందరలోనే జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీలో ఆమంచి చేరడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి బాబాయ్ రాజకీయం ఏ విధంగా ఉండబోతోందో.

Tags:    

Similar News