ఎవరేం అనుకున్నా.. కాబోయే అల్లుడితోనే లైఫ్ అంటున్న అత్త
కథలో కూడా ఊహించలేని ట్విస్టులు నిజ జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. గడిచిన పది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన అలీగఢ్ అత్త యవ్వారంలో సినిమాటిక్ ట్విస్టులు చోటు చేసుకున్నాయి.;
బంధాలు.. సంబంధాల విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకపట్టాన మింగుడుపడని విధంగా మారాయి. మిగిలిన అంశాల విషయంలో రియల్ జీవితానికి రీల్ కథలకు పొంతన ఉండదు. కానీ.. బంధాల విషయంలో రీల్ జీవితాలకు మించిపోయేలా రియల్ జీవితాలు ఉంటున్నాయి. వాస్తవ పరిస్థితుల్లో వెలుగు చూస్తున్న అంశాలు తరచూ విస్మయానికి గురి చేస్తున్నాయి.
కథలో కూడా ఊహించలేని ట్విస్టులు నిజ జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. గడిచిన పది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన అలీగఢ్ అత్త యవ్వారంలో సినిమాటిక్ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. పది రోజుల క్రితం భర్త.. పిల్లల్ని వదిలేసిన అత్త.. కాబోయే అల్లుడితో కలిసి వెళ్లిపోవటం తెలిసిందే. నేపాల్ సరిహద్దుల వరకు వెళ్లిన ఆమె.. తాజాగా వెనక్కి వచ్చేసింది.
ఎందుకిలా? అన్న ప్రశ్నకు దిమ్మ తిరిగిపోయే షాకింగ్ సమాధానం ఇస్తోంది సదరు అత్త. పోలీసులు తమ కోసం వెతుకుతున్న విషయం తెలుసుకొని భయంతోనే తాను వెనక్కి వచ్చేశానని చెబుతున్న ఆమె.. తన ఫ్యూచర్ జీవితం మొత్తం కాబోయే అల్లుడితోనే అని స్పష్టం చేస్తోంది. యూపీలోని అలీగఢ్ కు చెందిన 39 ఏళ్ల స్వప్న కుమార్తెతో పాతికేళ్ల రాహుల్ ను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు.
అయితే.. స్వప్నకుమార్తెతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లికొడుకు రాహుల్.. అత్తను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వైనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కుమార్తెతో ఫోన్ మాట్లాడే వేళలో తాను ఫోన్ మాట్లాడేదానిని.. అలా వారిమధ్య బంధం బలపడటమే కాదు.. తామిద్దరం ఒకటై ఇళ్లల్లో నుంచి వెళ్లి పోవాలని నిర్ణయించారు. అదే పని చేసినప్పటికి.. ఇరు కుటుంబాల్లోని వారు పోలీసుల్ని ఆశ్రయించటంతో వారు వెనక్కి వచ్చారు. కాబోయే అల్లుడితో వెళ్లిపోయిన స్వప్న.. ఇప్పటికి తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు.
తన తర్వాతి జీవితం అల్లుడితోనే అంటూ తెగేసి చెబుతున్న ఆమె.. తన భర్త తాగి వచ్చి కొడతాడని.. అందుకే తాను రాహుల్ తో ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా స్పష్టం చేస్తోంది. పోలీస్ స్టేషన్ కు వచ్చిన స్వప్నతో మాట్లాడిన పోలీసులు సైతం.. ఆమె కరాఖండిగా రాహుల్ తోనే తన తర్వాతి జీవితమని స్పష్టం చేయటంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు స్వప్న భర్త.. ఆమె ఇద్దరు పిల్లలు స్టేషన్ లో గంటల తరబడి బతిమిలాడినా.. వారితో కలిసి ఇంటికి వెళ్లేందుకు ససేమిరా అనటం ఇప్పుడు సంచలనంగా మారింది.