వైరల్ వీడియో: రోబోల ఫుట్ బాల్ మ్యాచ్... చూసి తీరాల్సిందే!
తాజాగా చైనాలో రోబోలు ఏకంగా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడాయి.. మైదానంలో అచ్చం మనుషుల్లానే ప్రవర్తించాయి..;

చైనా పురుషుల సాకర్ జట్టు ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో సందడి చేయకపోయినా, చరిత్ర సృష్టించకపోయినా.. హ్యూమనాయిడ్ రోబో జట్లు మాత్రం బీజింగ్ లోని అభిమానులను ఆకర్షించాయి. సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి. ఇందులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ఆధారంగా అథ్లెటిక్స్ ని మించి అన్నట్లుగా ఆశ్చర్యకరమైన పెర్ఫార్మెన్స్ చేశాయి!
అవును... రోబోలు హోటల్స్ లో వెయిటర్స్ గా పనిచేయడం, సర్వర్స్ గా సర్వీస్ చేయడం, ఈవెంట్లలో సందడి చేయడం వంటి పలు ప్రదర్శనలు చూశాం కానీ... తాజాగా చైనాలో రోబోలు ఏకంగా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడాయి.. మైదానంలో అచ్చం మనుషుల్లానే ప్రవర్తించాయి.. గోల్ చేసిన సమయంలో ఆనందంతో ఊగిపోయాయి.. కిందపడినప్పుడు వాటికవే లేచి నిలబడ్డాయి!
చైనా రాజధానిలో పూర్తిగా కృత్రిమ మేధస్సుతో నడిచే పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన 3-ఆన్-3 సాకర్ మ్యాచ్ లలో నాలుగు జట్ల హ్యూమనాయిడ్ రోబోలు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో చైనాలో మొదటిది, బీజింగ్ లో జరగనున్న రాబోయే ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ క్రీడలకు ఒక ప్రివ్యూగా ప్రచారం చేయబడింది. ఇది కాస్తా వైరల్ గా మారింది.
ఈ స్పెషల్ మ్యాచ్ లో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఇందులో పాల్గొన్న అన్ని రోబోలు ఎటువంటి మానవ జోక్యం లేదా పర్యవేక్షణ లేకుండా ఏఐ ఆధారిత వ్యూహాలను ఉపయోగించి పూర్తిగా స్వయంప్రతిపత్తితో పనిచేశాయి. అధునాతన దృశ్య సెన్సార్లతో అమర్చబడిన ఈ రోబోలు బంతిని గుర్తించి, చురుగ్గా మైదానంలో కదలగలిగాయి.
ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో పడిపోయిన తర్వాత కూడా వాటంతట అవే నిలబడేలా రూపొందించారు. అయితే.. మ్యాచ్ సమయంలో పలు రోబోలను సిబ్బంది స్ట్రెచర్లపై మైదానం వెలుపలకు తీసుకెళ్లాల్సి వచ్చింది. దీంతో... మరింత రియలిస్టిక్ గా ఈ మ్యాచ్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ సందర్భంగా స్పందించిన రోబో హార్డ్ వేర్ వెనుక ఉన్న కంపెనీ ‘బూస్టర్ రోబోటిక్స్’ సీఈఓ చెంగ్ హావో... ఇలాంటి సంఘటనలు రోబోటిక్స్ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని అన్నారు. భవిష్యత్తులో మానవులతో కలిసి రోబోలు సురక్షితంగా ఆడుకునేలా చేయడం వల్ల హ్యూమనాయిడ్ టెక్నాలజీపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించవచ్చని తెలిపారు.