'పైలెట్ కు సెల్యూట్'... విమాన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.. వీడియో వైరల్!
అవును... అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.;
జూన్ 12న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోగా... విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు మినహా మిగిలినవారంతా దుర్మరణం చెందారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు జరుగుతోంది.
ఈ సందర్భంగా.. ఇంజిన్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందనే ప్రచారం, అభిప్రాయాలు బలంగా వినిపించాయి. అయితే.. అందులో ఒక ఇంజిన్ కొత్తదని, మరో ఇంజిన్ ను ఇటీవలే సర్వీసింగ్ చేయించామని ఎయిరిండియా వెల్లడించింది! ఆ సంగతి అలా ఉంటే.. ఈ ప్రమాద సమయంలో పైలెట్ల కృషిని వివరిస్తూ ప్రత్యక్ష సాక్షి స్పందించారు!
అవును... అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటన ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది.. అగ్నిగోళంలా మారిపోయింది. అయితే విమానం టైర్ వేపచెట్టుకు తగలడంతోనే విమానం కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ప్రత్యక్ష సాక్షి ఒకరు... 'పైలట్ కు సెల్యూట్ చేస్తున్నాం.. మేఘాని నగరంలోనే కిందకి వచ్చిన ఫ్లైట్ మొదట బస్టాండ్ లో ల్యాండ్ అవుతుందనుకున్నాం.. కానీ, పైలట్ విమానాన్ని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఖాళీ స్థలంలో ల్యాండ్ చేయాలని చూశారు’ అని బీబీసీతో మాట్లాడుతూ తెలిపారు.
అయితే... "హాస్టల్ బిల్డింగ్ అడ్డంకిగా మారాయి.. కానీ వేప చెట్టు, ఆ హాస్టల్ భవనం విమాన ల్యాండింగ్ కు అడ్డం రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. చెట్టును తాకగానే ఆ విమానం క్రాష్ అయి బిజె మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడింది.." అని వివరించాడు.
కాగా... ఈ విమాన ప్రమాద ఘటన దర్యాప్తులో అత్యంత కీలకంగా చెబుతోన్న బ్లాక్ బాక్స్ గురించి మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బ్లాక్ బాక్స్ దెబ్బతిందని, దీనిలోని సమాచార విశ్లేషణ కోసం విదేశాలకు పంపనున్నారంటూ పలు కథనాలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇందులో భాగంగా... అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిరిండియా విమానం బ్లాక్ బాక్స్ లను సమాచార విశ్లేషణ కోసం ఎక్కడికి పంపాలనే దానిపై 'ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (ఏఏఐబీ)దే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది. జూన్ 12న కూలిన ఏఐ171 విమానంలో రెండు బ్లాక్ బాక్సులు ఉన్నాయని పౌర విమానయాన శాఖ తెలిపింది.