టీడీపీలో షాడోల రాజ్యం ?

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం అంటే గుర్తుకు వచ్చేది పూసపాటి వారి కుటుంబమే. మూడు తరాలుగా వారు ఎమ్మెల్యేలుగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నారు.

Update: 2026-05-18 04:01 GMT

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం అంటే గుర్తుకు వచ్చేది పూసపాటి వారి కుటుంబమే. మూడు తరాలుగా వారు ఎమ్మెల్యేలుగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. పీవీజీ రాజుతో మొదలైన వారి ప్రజా ప్రాతినిధ్యం ఆయన మనవరాలు అదితి గజపతిరాజు దాకా కొనసాగుతోంది. మధ్యలో అశోక్ గజపతి రాజు ఏడు సార్లు గెలిచి అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఇపుడు ఆయన గోవా గవర్నర్ గా రాజ్యాంగ బద్ధ బాధ్యలతో బిజీగా ఉన్నారు. ఆయన కుమార్తెగా వారసురాలిగా 2019లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అదితి గజపతి రాజు ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయినా 2024 లో గెలిచి తన సత్తా చాటుకున్నారు.

అదే బలమైన విమర్శ :

ఇక గెలిచిన తరువాత ఎమ్మెల్యే పెద్దగా జనంలోకి రారు అన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. నిత్యం ప్రజలతో మమేకం కావాలని పార్టీ ఆదేశాలు ఒక వైపు ఉంటే ఎమ్మెల్యే మాత్రం తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. ఆమెకు పార్టీలో ఇద్దరు కీలక నేతలు షాడోలుగా మారారని అంటున్నారు. జనంలో ఏ మాత్రం పలుకుబడి లేని ఈ ఇద్దరు నాయకులలో ఒకరు వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన వారు అయితే మరొకరు సెటిల్మెంట్స్ చేస్తూ ఏకంగా ఎమ్మెల్యే దగ్గర తన పలుకుబడి పెంచుకుని అతి ముఖ్య సలహాదరుగా మారిపోయారని అంటున్నారు. ఇపుడు సీన్ ఎలా ఉంది అంటే ఈ ఇద్దరి సలహా సంప్రదింపులు లేకుండా ఎమ్మెల్యే కనీసం ఏదీ వినే పరిస్థితి లేదని సొంత పార్టీలోనే గుసగుసలు పోతున్నారు. ఇదే ఇపుడు ప్రచారంలో కూడా ఉంది.

అంతా వారే అంటూ :

పర్యవసానంగా అంతా వారే అన్నట్లుగా పరిస్థితి మారింది. వారు ఏమి చెబితే అదే జరుగుతోందని ఒక విధంగా షాడో ఎమ్మెల్యేలుగా వారు మారిపోయారని అంటున్నారు. ఇక ప్రతీ విషయం వారు కనుసన్నలలోనే సాగుతోందని వారికి తెలియకుండా ఎమ్మెల్యే కూడా ఏమీ చేయడం లేదని అంటున్నారు. దీతో ఉద్యోగుల బదిలీల నుంచి కాంట్రాక్టుల కేటాయింపులు అధికారిక వ్యవహారాలు అన్నీ కూడా ఈ ఇద్దరే చక్కదిద్దుతున్నారని అంటున్నారు. వీరి వల్ల మేలు జరగకపోగా పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉందని అంటున్నారు.

పెద్దాయనకు భిన్నం :

ఇక అశోక్ గజపతి రాజు అయితే అను నిత్యం కార్యకర్తలతో మమేకం అయ్యేవారు. ఆయనకు క్షేత్ర స్థాయిలో జరిగే ప్రతీ విషయం మీద అవగాహన ఉండేదని అంటున్నారు. అందుకే ఆయన సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా గెలిచి జనం గుండెలలో నిలిచారు అని అంటున్నారు. దానికి భిన్నంగా వారసురాలి పాలన సాగుతోంది అని అంటున్నారు. ఎంతసేపూ షాడోల మీద ఆధారపడడం వల్ల సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. తాజాగా చూస్తే విజయనగరం కార్పోరేషన్ లో ఏకంగా 28 మంది అధికారులను ఒక్కసారిగా బదిలీ చేయడం సంచలనం అయింది. దీని వెనక షాడోల ప్రమేయం ఉందని అంటున్నారు. ఈ తరహా పరిణామాలు పార్టీలో మొదటి నుంచి ఉంటూ వస్తున్న సీనియర్ నేతలకు ఏ మాత్రం జీర్ణించుకోలేనివి గా ఉన్నాయని చెబుతున్నారు. మరి ఎమ్మెల్యే తీరు మార్చుకుని షాడోల పాలనకు చెక్ పెట్టకపోతే రానున్న రోజులలో పర్యవసనాలు కూడా వేరేగా ఉండొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ ప్రచారంలో ఏ మేరకు నిజం ఉందో.

Tags:    

Similar News