ఆదిమూలం...ఎక్కడ సార్ ?

వైసీపీ ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు మంత్రిగా కొనసాగిన ఘనత కొద్ది మందికి మాత్రమే దక్కింది.;

Update: 2025-09-12 03:46 GMT

వైసీపీ ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు మంత్రిగా కొనసాగిన ఘనత కొద్ది మందికి మాత్రమే దక్కింది. అందులో ఆదిమూలపు సురేష్ ఒకరు. జగన్ ఆయన కోసం తన దగ్గర బంధువు అయిన బాలినేని శ్రీనివాస్ ని సైతం పక్కన పెట్టారు. తొలి మూడేళ్ళకే బాలినేనికి మంత్రి పదవి పోతే సురేష్ మాత్రం అయిదేళ్ళూ మినిస్టర్ గా హవా చాటారు. అంతే కాదు విద్యా శాఖ మున్సిపల్ వ్యవహారాల శాక వంటి కీలక మంత్రిత్వ శాఖలను చూశారు. జగన్ ఆయనకు ఎంతో చేసినా పార్టీ కష్ట కాలంలో మాత్రం ఆయన ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు.

కాంగ్రెస్ టూ వైసీపీ :

ఇక ఆదిమూలపు సురేష్ మాజీ ఉన్నతాధిగా ఉంటూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆయన 2009లో కాంగ్రెస్ నుంచి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 నాటికి వైసీపీలో చేరి సంతనూతలపాడు నుంచి పోటీ చేసి రెండవ మారు గెలిచారు. 2019లో తిరిగి ఎర్రగొండపాలెం ముంచి పోటీ చేసి గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. 2024లో మాత్రం ఆయనను కొండెపి నియోజకవర్గానికి జగన్ మార్చారు. దాంతో ఆయన ఓటమి చెందారు. అదే సమయంలో ఎర్రగొండపాలెం లో తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు. దాంతో ఆదిమూలపు సురేష్ తాను రెండు సార్లు గెలిచిన ఎర్రగొండపాలెం వైపు ఫోకస్ పెట్టారు అని అంటున్నారు.

పార్టీ యాక్టివిటీస్ సైతం :

అయితే తన నియోజకవర్గంలో సురేష్ అనుచరుల జోక్యం ఎక్కువ కావడంతో దీని మీద చంద్రశేఖర్ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారని భోగట్టా. కొండెపిలోనే పనిచేసుకోమని హై కమాండ్ సురేష్ కి సూచించింది అని అంటున్నారు. దాంతో తనకు కలసి వచ్చిన ఎర్రగొండపాలెం మీద మక్కువ చంపుకోలేక కొండెపి వెళ్ళలేక సురేష్ పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారని అంటున్నారు.

పనిచేస్తేనే టికెట్లు :

అయితే ప్రతిపక్షంలో ఉంటూ పనిచేస్తేనే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని వైసీపీ అధినాయకత్వం చెబుతోంది. తమకు అప్పగించిన సీటులో పార్టీని బలోపేతం చేయాలని కూడా సూచిస్తోంది. అలా కాకుండా సైలెంట్ గా ఉంటే కొత్త నాయకత్వాన్ని అక్కడ అభివృద్ధి చేయడం మినహా వేరే మార్గం లేదని స్పష్టంగా చెబుతోంది. మరి సురేష్ విషయం తీసుకుంటే కొండెపి ఆయన వద్దు అనుకుంటే అక్కడ జూపూడి ప్రభాకర్ కి ఇస్తారని ప్రచారంలో ఉంది. అలాగే తాటిపర్తి చంద్రశేఖర్ కే 2029లోనూ ఎర్రగొండపాలెం టికెట్ ఇస్తారని అంటున్నారు. దాంతో సురేష్ ఏమి చేస్తారు అన్నది చర్చగా ఉంది.

పార్టీ మారుతారు అని :

మరో వైపు చూస్తే ఆయన పార్టీ మారుతారు అని ఆ మధ్య అయితే ప్రచారం సాగింది. మరి ఎన్నికలకు చాలా దూరం ఉంది కాబట్టి కీలక సమయంలో నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చూస్తే జగన్ జాతకం ఏమిటో కానీ పెద్ద పీట వేసి అయిదేళ్ళు మంత్రిగా కొనసాగించినా సురేష్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తనకు పార్టీలో ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అని భావించి బాలినేని జనసేనలోకి వెళ్ళిపోయారు. దాంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ ఇబ్బందులు పడుతోంది అంటున్నారు.

Tags:    

Similar News