బీజేపీలో పెద్ద పదవి..విచారణ సంగతేంటి ?

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆడారి కుటుంబానికి రాజకీయంగా మంచి పేరు ఉంది. ఆడారి తులసీరావు ఏపీలో అతి పెద్ద డెయిరీని నడిపి పాల పారిశ్రామికవేత్తగా నిలిచారు.;

Update: 2025-09-01 04:04 GMT

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆడారి కుటుంబానికి రాజకీయంగా మంచి పేరు ఉంది. ఆడారి తులసీరావు ఏపీలో అతి పెద్ద డెయిరీని నడిపి పాల పారిశ్రామికవేత్తగా నిలిచారు. ఆయన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ఆయన కోరుకుంటే పదవులు దక్కేవి కానీ టీడీపీకి మద్దతుదారుగా ఉంటూ విశాఖ రూరల్ జిల్లా రాజకీయాలలో కీలకంగా ఉంటూ వచ్చారు.

వారసుడి తడబాట్లు :

ఇక ఆయన మరణానంతరం కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల పట్ల మక్కువ చూపించారు. అలా ఆయన 2019లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి వైసీపీ ప్రభంజనంలో ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరి 2024 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

కూటమి టార్గెట్ :

అయితే ఆయన కుటుంబం అంతా మొదటి నుంచి టీడీపీలో ఉంటూ సడెన్ గా కండువా మార్చేసి వైసీపీలో చేరారు అన్న కారణంతో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ డెయిరీ మీద విచారణకు సిద్ధపడింది. అలా విశాఖ డెయిరీ మీద అసెంబ్లీలో కూడా చర్చ సాగింది. అక్కడ అంతా అవకతవకలు జరిగాయని విచారణ చేపట్టాలని కూడా స్థానిక ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దీంతో సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో సభా సంఘాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియమించారు. ఈ సభా సంఘం డెయిరీ వచ్చి మరీ విచారణ చేపట్టింది.

ఇంతలోనే కాషాయం చెంతకు :

ఇదిలా ఉండగా ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరిపోయారు. అలా ఆయన కూటమిలోకి వచ్చేసినట్లు అయింది ఇక విశాఖ జిల్లా నుంచి కొత్తగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయిన పీవీఎన్ మాధవ్ తాజాగా రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించారు. అందులో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కీలకమైన పదవిని ఆడారి ఆనంద్ కుమార్ కి ఇచ్చారు. దాంతో ఆయనకు పెద్ద పదవి దక్కినట్లు అయింది.

విచారణ ఉంటుందా :

ఇక ఆడారికి ఇపుడు ఏపీ బీజేపీలోనే కీలక స్థానం దక్కడంతో ఆ పార్టీ కూటమిలో ఉండడంతో ఆయన నాయకత్వంలోని విశాఖ డెయిరీ మీద వేసిన విచారణ సంఘం దర్యాప్తు ముందుకు వెళ్తుందా అన్నది చర్చగా ఉంది. కూటమిలో బీజేపీ మిత్ర పక్షగా ఉంది ఆనంద్ కూడా రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. మరి ఆయన మీద దూకుడుగా వెళ్ళగలరా అని సందేహాలు అయితే ఉన్నాయి. మరి మొదట్లో అంతా కలసి డెయిరీలో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు కాబట్టి దానిని బట్టి ముందుకు వెళ్తేనే నిజాయతీ నిగ్గు తేలినట్లు అని అంటున్నారు.

అయితే అలా జరిగేది ఉండదని రాజకీయంగా చూస్తే కనుక ఆడారి సేఫ్ జోన్ లో ఉన్నట్లే అని అంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. సో సభా సంఘం విచారణ ఏ రూపు తీసుకుంటుంది అన్నదే ఆలోచించాలని అంటున్నారు. మొత్తానికి కమలం కండువా కప్పుకుని ఆడారి కుటుంబం తమ ప్రత్యర్ధులకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందని అంటున్నారు.

Tags:    

Similar News