వైసీపీకి ఆదాల టాటా బైబై ?

అవునా ఇది నిజమేనా అంటే నెల్లూరు జిల్లాలో ప్రచారం అయితే ఇదే విషయం మీద పెద్ద ఎత్తున సాగుతోంది.;

Update: 2025-07-17 17:30 GMT

అవునా ఇది నిజమేనా అంటే నెల్లూరు జిల్లాలో ప్రచారం అయితే ఇదే విషయం మీద పెద్ద ఎత్తున సాగుతోంది. బిగ్ షాట్ గా జిల్లాలో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ మీద విసుగెత్తి ఉన్నారని అంటున్నారు. జిల్లా వైసీపీలో ఏమి జరుగుతుందో కూడా ఆయనకు తెలియజేయడం లేదని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

ఇక ఆదాల ప్రభాకరరెడ్డి చూస్తే 2004, 2009లో కాంగ్రెస్ టికెట్ మీద సర్వేపల్లి నుంచి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ తరువాత ఆయన 2014లో టీడీపీలో చేరారు. ఇక 2019 నాటికి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీ అయ్యారు. తిరిగి 2024 నాటికి ఆయన నెల్లూరు రూరల్ అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. అయితే వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ధాటికి కూటమి ప్రభంజనానికి తట్టుకోలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిని చవి చూసారు.

నాటి నుంచి ఆయన జిల్లాకు తక్కువగానే వస్తున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే ఆయనను పక్కన పెట్టి నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఇంచార్జిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డిని తెచ్చి బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధినాయకత్వం అని అంటున్నారు. దాంతో పాటు ఆనం కి వైసీపీ పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడిగా నియమించింది.

దాంతోనే ఆయన ఎందుకొచ్చిన ఈ పదవి అని వైరాగ్యంతో హైదరాబాద్ ని దాటి రావడం లేదని అంటున్నారు. ఇక తాజగా చూస్తే జిల్లాలో అహోబిలం మఠం భూముల వివాదం ఒకటి ఆదాలను ఇబ్బంది పెడుతోంది అని అంటున్నారు. ఈ భూముల వ్యవహారంలో ఆదాల మీద విమర్శలు రావడంతో పార్టీ తరఫున అయితే ఎవరూ ఆయనకు మద్దతుగా మాట్లాడడం లేదని పెద్దాయన తెగ నొచ్చుకుంటున్నారుట. తమ మఠం భూములను మాజీ ఎంపీ ఆదాల ఆక్రమించారు అని మఠం నిరాహకులు ఒక వైపు గట్టిగానే ఆరోపణలు చేస్తున్నారుట.

దీంతో ఆదాల ఎట్టకేలకు తానే దిగి వచ్చి నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు ప్రమేయం లేదని ఆ భూముల వ్యవహారంలో తనను లాగొద్దని వివరణ ఇచ్చుకున్నారుట. అయితే తన వెనక పార్టీ లేకపోవడం అండగా ఏ ఒక్కరూ మాట్లాడకపోవడంతో ఆయన నాటి నుంచే మరింతగా ఫీల్ అవుతున్నారని టాక్ నడుస్తోంది.

ఎన్నికలు అయిపోయిన తరువాత నుంచి అధినాయకత్వం ఆయనను పిలవలేదని ఆయన కూడా కలిసే ప్రయత్నం చేయలేదని అంటున్నారు. ఇపుడు తాజా ఎపిసోడ్ తో ఆయన వైసీపీతో తన బంధం కట్ అయింది అన్న ఒక అభిప్రాయానికి వచ్చారని అంటున్నారు. దాంతో ఆయన వైసీపీని వీడుతారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నిజానికి చూస్తే ఆదాల కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇలా మారుతూనే ఉన్నారు.

ఆయన 2024 ఎన్నికల్లో ఓటమి చెందగానే కూడా టీడీపీలోకి వెళ్తారు అని పుకార్లు వినిపించాయి. అవి కాస్తా ఆగాయి కానీ ఆదాల మాత్రం రాజకీయంగా వైసీపీ వైపు లేరనే అంటున్నారు. ఇపుడు ఆయన కచ్చితంగా పార్టీ మారే సమయం వచ్చింది అని అంటున్నారుట.

ఆయన టీడీపీలో చేరాలని అనుకున్నా అక్కడ నుంచి అనుకూలత రాకపోవడంతో ఆయన చూపు బీజేపీ మీద పడింది అంటున్నారు. ఏపీలో కేంద్రంలో బీజేపీ ఉండడంతో కాషాయం కప్పుకుంటే బెటర్ అన్న నిర్ణయానికి ఆదాల వచ్చారని అంటున్నారు. తొందరలోనే ఆదాల వైసీపీ నుంచి వేరు పడి కమలం పువ్వు పట్టుకుంటారని నెల్లూరులో ఒక్కటే ప్రచారం సాగుతోంది. అయితే షరా మామూలుగానే ఆదాల తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలు తప్పు అని ఖండిస్తున్నారు కానీ ఆయన మనసు మాత్రం వైసీపీలో లేదని వైసీపీ పెద్దలకూ ఈ విషయం తెలుసు అని అంటున్నారు.

Tags:    

Similar News