ఈ ఊళ్లో అన్నదానం చేయాలంటే మూడేళ్లు ఆగాల్సిందే

కొన్ని అంశాలు పెద్దగా వెలుగులోకి రావు. ఎంతో ఆసక్తికర ఉండే అంశాలు మీడియా పుణ్యమా అని అందరికి తెలుస్తుంటాయి.;

Update: 2025-09-07 05:10 GMT

కొన్ని అంశాలు పెద్దగా వెలుగులోకి రావు. ఎంతో ఆసక్తికర ఉండే అంశాలు మీడియా పుణ్యమా అని అందరికి తెలుస్తుంటాయి. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవకు చెందిందే. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలు.. ఆ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల జోరు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువ అయ్యింది. అయితే.. ఇప్పుడు మేం చెప్పే చిన్న గ్రామంలో నిర్వహించే వినాయకచవితి మండపం వ్యవహారమే వేరు. ఇక్కడ అన్నదానం చేయాలంటే మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే. అంతలా భారీ క్యూ ఉంది. ఇంతా చేస్తే ఈ ఊళ్లో ఉండేది 2500 మాత్రమే.

అంతేనా.. ఈ ఊళ్లో ఒకే ఒక్క వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంతకూ ఆ ఊరు ఎక్కడ? వారు నిర్వహించే వినాయక మండపానికి అంత క్రేజ్ ఏమిటి? లాంటి వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసే వినాయక మండపం ఎంతో స్పెషల్. ఈ మండపానికి ఊరి వారే కాదు.. చుట్టుపక్క ఊళ్లవారు.. ఆ మాటకు వస్తే ఈ ఊరికి దగ్గరగా ఉండే మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావటం విశేషంగా చెప్పాలి.

పదకొండు రోజుల పాటు నిర్వహించే వినాయక చవితికి ఏర్పాటు చేసే మండపంలో ప్రత్యేకంగా అన్నదానాలు నిర్వహిస్తారు. అది కూడా ఏదో ఒక రోజు కాదు. పదకొండు రోజుల పాటు ఉదయం టిఫిన్ మొదలు మధ్యాహ్నం లంచ్.. రాత్రికి డిన్నర్ ఇక్కడే. ఈ కారణంగా ఈ ఊళ్లో వినాయకచవితి సందర్భంగా పదకొండు రోజుల పాటు ఊళ్లోని ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఊళ్లో ఉన్న నాలుగు ముస్లిం కుటుంబాలు కూడా ఈ వినాయకచవితి కార్యక్రమంలోనూ మమేకం అవుతారు.

ఈ గ్రామంలో నిర్వహించే అన్నదానానికి రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని చెబుతారు. ఇలా పదకొండు రోజుల పాటు నిర్వహించే అన్నదానికి మూడేళ్ల వరకు బుకింగ్స్ పూర్తి అయ్యాయి. ఈ పదకొండు రోజులు గ్రామస్తులు తమకున్న పనులన్ని పక్కన పెట్టేసి.. వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు.. అన్నదానాలు చేస్తూ.. తమ ఊరికి వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.

అంతేకాదు.. ఇక్కడ వినాయకచవితికి మిగిలిన చోట్ల మాదిరి చివర్లో నిమజ్జన కార్యక్రమంలో భాగంగా విగ్రహాన్ని నీట ముంచేయటం ఉండదు. గతంలో ఇలా చేసినా.. రెండేళ్ల క్రితం నుంచి పద్దతి మార్చేశారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఒక గ్రామంలో ప్రత్యేకంగా కర్ర గణపతిని తయారు చేయించి తీసుకొచ్చారు. దాన్ని పదకొండు రోజులు పూజిస్తారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా పదకొండో రోజున ఊరి చివరి గోదావరి నది వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లి.. అక్కడ విగ్రహంపై నీళ్లు చల్లి.. తిరిగి ఊరికి తీసుకొచ్చి జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఇలాంటి వినాయక ఉత్సవాన్ని మీరెప్పుడైనా విన్నారా?

Tags:    

Similar News