గుజరాత్ లో మోడీకి షాక్ ఇస్తామంటున్న కేజ్రీవాల్
ఈ ఏడాది మొదట్లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఆప్ పార్టీ ఓటమి పాలు అయింది.;
ఈ ఏడాది మొదట్లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఆప్ పార్టీ ఓటమి పాలు అయింది. అప్పటికే పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న ఆప్ ఓటమి చెందడం ఆశ్చర్యం కాదు కానీ ఎందుకో అది పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ అధికారి నుంచి పొలిటీషియన్ గా మారిన వారు. దేశాన్ని సమాజాన్ని మార్చాలని సంకల్పం ఉన్న వారు.
ఆయన స్వయంగా తాను పోటీ చేసిన సీటులో ఓడారు. దాంతో లీడర్ ఆఫ్ అపొజిషన్ కూడా కాలేకపోయారు. ఆ తరువాత ఆయన పెద్దగా ప్రకటనకు చేయలేదు, మీడియా ముందుకు రాలేదు. అయితే ఇన్ని నెలల తరువాత మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ కళ్ళలో ఆనందం కనిపిస్తోంది. ఆప్ లో కొత్త ధీమా కూడా వస్తోంది.
దానికి కారణం తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో గుజరాత్ లో ఒక సీటు నుంచి ఆప్ విజయం సాధించడం. గుజరాత్ అంటే అది బీజేపీకి కంచుకోట. మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ అక్కడ పాతుకుపోయి ఉంది. అలాంటి చోట రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే ఒక దానిని అధికార బీజేపీ గెలుచుకుంది. విశావదర్ అసెంబ్లీ సీటుని ఆప్ గెలిచింది. ఇక్కడ పోటీ పడిన కాంగ్రెస్ కి ఏమీ లాభం దక్కలేదు.
అంతే కాదు పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ అక్కడ ఉప ఎన్నిక జరిగిన అసెంబ్లీ సీటుని దక్కించుకుంది. ఇలా విజయాలతో కేజ్రీవాల్ కు కొత్త ఆనందం కనిపిస్తోంది. దాంతో ఆయన గుజరాత్ లో అధికారంలోకి వచ్చేది ఆప్ మాత్రమే అని అంటున్నారు. గుజరాత్ లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
అక్కడ ప్రధానమైన పోటీ అధికార బీజేపీకి ఆప్ కి మధ్యనే ఉందని కేజ్రీవాల్ చెప్పారు. అంతే కాదు గుజరాత్ లో కాంగ్రెస్ బీజేపీ ఆప్ ని ఓడించడానికి ఒక్కటి అవుతున్నాయని కూడా అతి పెద్ద ఆరోపణ చేశారు. ఢిల్లీ ఎన్నికల ముందే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ గుజరాత్ లో మొత్తం అసెంబ్లీ సీట్లకు పోటీ పడతామని అంటున్నారు.
ఇప్పటికే పంజాబ్ ని గెలుచుకున్న ఆప్ గుజరాత్ కోట మీద జెండా ఎగురవేస్తుందా అన్న చర్చ మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బాగానే రాజకీయ ప్రదర్శన చేసింది. చాలా చోట్ల బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ కూడా రంగంలో ఉండడంతో త్రిముఖ పోటీ బీజేపీకి బాగా లాభించింది.
మరి ఈసారి కూడా ముక్కోణం పోటీ జరుగుతుంది. దానిని దృష్టిలో ఉంచుకునే కేజ్రీవాల్ ఇప్పటి నుంచే గుజరాత్ ప్రజలలో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు అయితే జనాలకు బీజేపీ పాలన మీద విసుగు వస్తే మాత్రం బలమైన ఆల్టర్నేషన్ ఎవరు ఉంటారో వారికే ఓటు వేసి గెలిపిస్తారు అని అంటున్నారు మరి ఆ విధంగా ఆప్ కి గుజరాత్ లో చాన్స్ ఉందా అన్నదే చర్చగా ఉంది. అదే జరిగి ఆప్ గుజరాత్ లో తిష్ట వేస్తే మాత్రం మోడీకి అది భారీ షాక్ గా పరిణమిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.