గ్లిచ్‌తో ఖాతాలోకి 40 కోట్లు.. వాటితో ఎంత సంపాదించాడంటే?
డిజిటల్ యుగంలో డబ్బు ఇక చేతుల్లో తిరగదు. ఒక క్లిక్, ఒక సాంకేతిక లోపం.. అంతే, కోట్ల రూపాయలు ఖాతాల్లోకి వచ్చిపడతాయి.;
డిజిటల్ యుగంలో డబ్బు ఇక చేతుల్లో తిరగదు. ఒక క్లిక్, ఒక సాంకేతిక లోపం.. అంతే, కోట్ల రూపాయలు ఖాతాల్లోకి వచ్చిపడతాయి. అదే జరిగితే అది నేరమా? అవకాశమా? లేదా వ్యవస్థ బలహీనతకు అద్దం పట్టిన ఘటననా? కొటక్ సెక్యూరిటీస్ ఖాతాలో తలెత్తిన సాంకేతిక లోపం, ఒక ట్రేడర్‌కు 20 నిమిషాల్లో ₹1.75 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
సినిమా కథలా..
2022లో చోటుచేసుకున్న ఈ ఘటన బయటకు వస్తే చాలా మందికి ఇది సినిమా కథలా అనిపించింది. కానీ ఇది వాస్తవం. కొటక్ సెక్యూరిటీస్ వ్యవస్థలో జరిగిన ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల, ఆ సంస్థకు చెందిన ₹40 కోట్లు అనుకోకుండా ఒక ట్రేడర్ ఖాతాలో జమయ్యాయి. ఇది అతడు కోరిన రుణం కాదు, ఎటువంటి అక్రమ ట్రాన్స్‌ఫర్ కూడా కాదు. పూర్తిగా సిస్టమ్ లోపం. అయితే ఆ డబ్బు ఖాతాలోకి వచ్చిందని తెలుసుకున్న ట్రేడర్, దాన్ని అలాగే ఉంచలేదు. తన అనుభవం, మార్కెట్ అవగాహనతో స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాడు. ఫలితం కేవలం 20 నిమిషాల్లో ₹1.75 కోట్ల లాభం.
కొంత సేపటి తర్వాత తమ వ్యవస్థలో జరిగిన తప్పిదాన్ని గుర్తించిన కొటక్ సెక్యూరిటీస్, ట్రేడర్‌ను సంప్రదించింది. అసలు మొత్తమైన ₹40 కోట్లను తిరిగి ఇవ్వమని కోరింది. ట్రేడర్ కూడా ఆలస్యం చేయకుండా ఆ డబ్బును తిరిగి చెల్లించాడు. కానీ ఇక్కడే వివాదం మొదలైంది. ఆ ₹40 కోట్లతో సంపాదించిన లాభం ఎవరిది? సంస్థదా? ట్రేడర్‌దా? కొటక్ వాదన ప్రకారం.., అది తమ డబ్బుతో వచ్చిన లాభం కాబట్టి తమకే చెందాలి. ట్రేడర్ మాత్రం, అది తన ట్రేడింగ్ నిర్ణయం, తన రిస్క్, తన నైపుణ్యంతో వచ్చిన లాభమని స్పష్టం చేశాడు.
కోర్టుకు చేరిన వివాదం..
ఈ వివాదం చివరకు ముంబై హై కోర్టుకు చేరింది. కొటక్ సెక్యూరిటీస్ కోర్టును ఆశ్రయించి, లాభం కూడా తమకే చెందాలని వాదించింది. విచారణ సమయంలో సంస్థ ఒక మధ్యమార్గాన్ని కూడా సూచించింది. ‘లాభాన్ని మాకు ఇస్తే, ట్రేడర్‌కు ₹50 లక్షలు ఇస్తాం’ అని ఆఫర్ చేసింది. కానీ ట్రేడర్ దాన్ని తిరస్కరించాడు. ఇది కేవలం డబ్బు విషయం కాదు, విలువల ప్రశ్న అని అతడు భావించాడు.
ఖాతాదారుడి వైపే తీర్పు..
విచారణ అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. కోర్టు స్పష్టంగా చెప్పింది ట్రేడర్ సంపాదించిన ₹1.75 కోట్ల లాభం అతడికే చెందుతుంది. ఎందుకంటే ఆ పెట్టుబడి అతడి సొంత నిర్ణయంతో, సొంత రిస్క్‌పై ఉంది. లాభం వచ్చినట్లే నష్టం వచ్చినా అది అతడే భరించాల్సి ఉండేది. సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని, ఇది అన్యాయంగా సంపాదించిన డబ్బు కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వ్యవస్థ లోపం సంస్థదైతే, దాని పరిణామాలకు ట్రేడర్‌ను బాధ్యుడిని చేయలేమని స్పష్టం చేసింది. ఈ తీర్పు ఒక వ్యక్తికి లాభం చేకూర్చిన కేసు మాత్రమే కాదు. ఇది ఫైనాన్షియల్ సిస్టమ్స్ నమ్మకంపై, డిజిటల్ భద్రతపై, ట్రేడింగ్ నైతికతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవైపు ట్రేడర్లు ‘ఖాతాలో ఉన్న డబ్బుతో ట్రేడ్ చేయడం తప్పేంటి?’ అని ప్రశ్నిస్తుంటే, మరోవైపు సంస్థలు ‘సిస్టమ్ తప్పిదాన్ని ఉపయోగించుకోవడం నైతికం కాదని?’ వాదిస్తున్నాయి.
ఈ ఘటన మనకు ఒక పాఠం చెబుతోంది. టెక్నాలజీ ఎంత ఆధునికమైనా, అది తప్పులేనిదికాదు. ఫైనాన్షియల్ సంస్థలు తమ సిస్టమ్‌ల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, ట్రేడింగ్ అనేది కేవలం డబ్బుతో కాదు, నిర్ణయాలతో, రిస్క్‌తో ముడిపడి ఉంటుందన్న వాస్తవాన్ని కూడా ఈ కేసు గుర్తు చేస్తోంది. ఇక ఈ వ్యవహారం ఫిబ్రవరి 4న మరోసారి కోర్టు ముందుకు రానుంది. తుది తీర్పు ఏదైనా కావచ్చు. కానీ ₹40 కోట్ల గ్లిచ్ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పింది. డిజిటల్ మార్కెట్లలో అదృష్టం, నైపుణ్యం, వ్యవస్థ బలహీనత.. ఈ మూడు కలిసి ఒక క్షణంలోనే కోట్ల కథను రాసేస్తాయి.