గంటకు 2.21 లక్షల కి.మీ. వేగంతో దూసుకొస్తోన్న తోకచుక్క.. వీడియో వైరల్!

అవును... గంటకు సుమారు 2.21 లక్షల కిలోమీటర్ల అసాధారణ వేగంతో మన సౌర వ్యవస్థ వైపు దూసుకొస్తోన్న ఓ తోక చుక్క వ్యవహారం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2025-10-05 21:30 GMT

సెకనుకు 61 కిలోమీటర్లు.. అంటే గంటకు సుమారు 2.21 లక్షల కిలోమీటర్ల అసాధారణ వేగంతో సౌరకుటుంబం ఆవల నుంచి ఓ తోక చుక్క ప్రయాణిస్తుంది. దీని పేరు 3ఐ/అట్లాస్. ఈ నేపథ్యంలో ఈ తోకచుక్క వల్ల భూమికి పొంచి ఉన్న ప్రమాదం ఎంత అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ తోకచుక్క కదలికలను నిత్యం గమనిస్తున్న నాసా.. దీనిపై క్లారిటీ ఇచ్చింది.

అవును... గంటకు సుమారు 2.21 లక్షల కిలోమీటర్ల అసాధారణ వేగంతో మన సౌర వ్యవస్థ వైపు దూసుకొస్తోన్న ఓ తోక చుక్క వ్యవహారం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా స్పందించిన నాసా... 3ఐ/అట్లాస్ అనే తోకచుక్కతో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. కారణం.. ఈ తోకచుక్క 270 మిలియన్‌ కి.మీ. దూరం నుంచి వెళుతుండటమే అని తెలిపింది.

వాస్తవానికి మన సౌర వ్యవస్థకు చెందని ఖగోళ వస్తువులను గుర్తించడం ఇది మూడోసారి. గతంలో 2017లో 'ఔమువామువా', 2019లో '2ఐ/బోరిసోవ్'ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా 3ఐ/అట్లాస్‌ తోకచుక్క సౌరకుటుంబం ఆవల నుంచి వస్తున్న మూడో అతిథిగా పేరుకుంటున్నారు. దాని పేరులో 'ఐ' అక్షరం 'ఇంటర్‌ స్టెల్లార్'ని సూచిస్తుంది.

ఇదే సమయంలో... ఈ తోకచుక్క సూర్యుడికి దగ్గరయ్యే కొద్దీ దీని వేగం మరింత పెరుగుతుందని చెప్పిన నాసా.. అక్టోబర్ 30 నాటికి ఇది సూర్యుడికి సమీపంగా.. అంటే సుమారు 21 కోట్ల కిలోమీటర్ల దూరానికి చేరుకుంటుందని అంచనా వేసింది. హబుల్, జేమ్స్ వెబ్ వంటి శక్తిమంతమైన టెలిస్కోపుల ద్వారా దీని గమనాన్ని శాస్త్రవేత్తలు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

కాగా... లద్ధాఖ్‌ ప్రాంతంలోని హన్లేలో ఉన్న భారతీయ ఆస్ట్రోనామికల్‌ అబ్జర్వేటరీలోని హిమాలయన్‌ చంద్ర టెలిస్కోప్‌ ను ఉపయోగించి ఈ ఏడాది జులై 3న రాత్రి పరిశోధకులు ఈ తోకచుక్కను పరిశీలించారని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ (ఐఐఏ)లో శాస్త్ర, సాంకేతిక, సమాచార, ప్రజాసంబంధాల విద్యా (స్కోప్‌) విభాగాధిపతి నిరుజ్‌ మోహన్‌ రామానుజం వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News