మోదీకి డేంజర్ సిగ్నల్స్.. రాజ్యాంగ సవరణ బిల్లు చెబుతున్న నిజాలేంటి?
సుమారు 11 ఏళ్లకు పైగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సామర్థ్యానికి తొలిసారి విపక్షం గట్టి సవాల్ విసిరింది.;
రాజ్యాంగ సవరణ బిల్లు పేరుతో మహిళా రిజర్వేషన్ అమలు, లోక్ సభ నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన బెడిసి కొట్టడం ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి డేంజర్ సిగ్నల్ పంపుతోందా? బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు ఐక్యంగా నిలవడం గమనిస్తే భవిష్యత్తు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. అంతేకాకుండా తాజా రాజకీయాలు 2014 నుంచి కేంద్రంలో అప్రతిహత అధికారం చెలాయిస్తున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు రాజకీయంగా సవాల్ విసురుతున్నట్లు చెబుతున్నారు. మునుపెన్నడూ లేనట్లు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్షాల కూటమి ఏకతాటిపై నిలవడం అనేక ఆలోచనలకు గురిచేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
తొలిసారి ఎదురుదెబ్బ
సుమారు 11 ఏళ్లకు పైగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సామర్థ్యానికి తొలిసారి విపక్షం గట్టి సవాల్ విసిరింది. 230 మంది సభ్యుల బలంతో కేంద్రాన్ని నిలువరించింది. అయితే మహిళా బిల్లుపై అందరి ఆమోదం పొందుతామనే ధీమాతోనే ప్రధాని 2/3వ వంతు మెజార్టీ లేకపోయినా మొండిగా ముందుకు వెళ్లారని అంటున్నారు. ఇదే ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యేలా చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా విపక్షాల మధ్య చీలిక తేగలమనే అతి విశ్వాసంతో ప్రభుత్వం ఎదురుదెబ్బ తినాల్సివచ్చిందని అంటున్నారు. అయితే ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తగిలిన ఈ ఎదురుదెబ్బ జాతీయ స్థాయిలో విస్తృత చర్చకు దారితీసింది. దీనికి కారణం విపక్షాలు ఏకతాటిపై నిలవడమే కారణం అంటున్నారు.
కలిసికట్టుగా విపక్షం
ఇదే సందర్భంలో గతంలో చాలా సార్లు విపక్షంలో విభేదాలు పొడచూపేవని అంతా గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేయడమే కాకుండా, ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్షాలు రకరకాల విభేదాలతో కలహించుకునేవి. బీజేపీని వ్యతిరేకించే విషయంలో అన్ని పార్టీలు ఒకే ఆలోచనతో ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా కలవలేకపోయాయి. జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు నాయకత్వం అప్పగించే విషయంలో తృణమూల్ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు తీవ్ర వ్యతిరేకత చూపేవి. ఈ కారణంతోనే ఢిల్లీ, హరియాణా ఎన్నికల్లో ఆయా పార్టీలు ఓటమిని మూటగట్టుకునేవని అంటున్నారు.
కొత్త రాజకీయ సమీకరణాలు
కానీ, ఇప్పుడు అన్ని పక్షాలు ఏకమై గొంతు కలపడం చూస్తే కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసే పరిస్థితి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చిన మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో మెజార్టీకి 30 సీట్ల దూరంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నడిపేందుకు టీడీపీ, జేడీయూ వంటి కీలక మిత్ర పక్షాలపై బీజేపీ ఆధారపడుతోంది. అంటే పదేళ్ల అధికారం తర్వాత పరిస్థితులు క్రమంగా బీజేపీకి మారాయని గత ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.
భవిష్యత్తులోనూ కలిసి ప్రయాణం
వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ ప్రభుత్వం చేసిన ఆలోచనే పునర్విభజన అంటున్నారు. దీనిని అమలులోకి తేవడం ద్వారా గత ఎన్నికల్లో తమకు సీట్లు తగ్గిన తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను నిలువరించొచ్చని వ్యూహం రచించారని అంటున్నారు. దీనిని పసిగట్టే విపక్షాలు సమైక్యంగా నిలిచాయని, తమ అస్థిత్వం కాపాడుకోడానికి విభేదాలను పక్కన పెట్టి అన్ని విపక్షాలు పార్టీలు ఏకమైనట్లు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ వ్యూహం గమనించిన విపక్షాలు భవిష్యత్తులోనూ కలిసికట్టుగా నడిచే సంకేతాలిస్తున్నాయని అంటున్నారు. ఈ పరిణామం కచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఓ హెచ్చరికగా వ్యాఖ్యానిస్తున్నారు.