2025 టూ 2050 : మనిషిని మింగేసే యుగంలోకి

కాలం మారుతుంది అన్నది అందరికీ తెలిందే. కానీ మార్పు కూడా ఎవరూ ఊహించని వేగం అందుకోవడమే నవీన తరం మ్యాజిక్. 2000లోకి ప్రపంచం అడుగు పెట్టిన వేళ కొత్త సహస్రాబ్ది అని అంతా వేడుక చేసుకున్నారు.;

Update: 2025-12-02 01:30 GMT

కాలం మారుతుంది అన్నది అందరికీ తెలిందే. కానీ మార్పు కూడా ఎవరూ ఊహించని వేగం అందుకోవడమే నవీన తరం మ్యాజిక్. 2000లోకి ప్రపంచం అడుగు పెట్టిన వేళ కొత్త సహస్రాబ్ది అని అంతా వేడుక చేసుకున్నారు. కానీ 2000 నంబర్ చాలా బరువుగా ఉండడంతో పాటు భవిష్యత్తు ఇంకా దూకుడుగా ఉంటుందని అంచనా వరకూ అయితే వచ్చారు. కానీ అది ఎలా ఉంటుందో సరిగ్గా ఎవరికీ తెలిసింది కాదు. అప్పటికి అంతా నెమ్మదిగా ఉండేది. ట్రెడిషనల్ నీడను వీడని టెక్నాలజీతో మెల్లగా సావాసం చేస్తున్న సంధి కాలం అది.

పావు శతాబ్దం అలా :

ఇక చూస్తూండగానే పావు శతాబ్దం అలా గడిచిపోయింది. అప్పట్లో న్యూస్ పేపర్ ఇంటికి వస్తే చదివేవారు, సినిమా ధియేటర్లకు వెళ్ళి చూసేవారు. మార్కెట్ కి వెళ్ళి నిత్యావసరాలు తెచ్చుకునేవారు, జేబులో గాంధీ బొమ్మతో కరెన్సీ నోట్లు కరకరలాడేవి. టీవీలు ఇంకా పూర్తిగా మెదళ్ళను దొలిచేయని కాలం అది. కానీ చూస్తూండగానే పాతికేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. ఆనాటికీ నేటికీ ఎంతో తేడా. ఒక విధంగా ఈ పాతికేళ్ళూ మనిషి సాంకేతికను మోస్తూ తాను పరుగులు పెట్టాడు అని చెప్పాలి.

అనూహ్యంగా అంతా :

ఈ పాతికేళ్ళలో మార్పు ఏంటి అంటే సినిమా ఇంట్లో కాదు చేతిలో చూడడం, అలాగే చేతిలో డబ్బు ప్రమేయం లేకుండానే డిజిటల్ పేమెంట్స్ చేయడం, న్యూస్ పేపర్ లేనిదే కాలకృత్యాలు తీరని వారు ఇపుడు మొబైల్ ఫోన్లలో వార్తలు చదవడం అందులోనే చానళ్ళలో చూడడం అలవాటు చేసుకున్నారు. ఒకనాడు ఇంటర్నెట్ కేఫ్ లు ఉండేవి. వాటి నుంచే నెమ్మదిగా పనిచే దాంతో మెయిల్స్ పంపించుకుంటే టెక్నాలజీలో పదడుగులు వేసిన ఫీలింగ్. కానీ ఇపుడు మొత్తం ఇంటర్నెట్ అన్నీ శాసిస్తోంది. హాయిగా ఇంట్లో కూర్చోని జాబ్స్ చేస్తారు అని ఎవరనుకున్నారు. ప్రపంచం అంతా ఒక చిన్న స్మార్ట్ ఫోన్ లో బంధీ అవుతుందని కూడా ఎవరూ అసలు ఊహించలేదు. అలా 4జీ, 5జీ, కాదు 6జీ కూడా వచ్చేస్తోంది.

బూచాడమ్మా బూచాడు కాస్తా :

పాత సినిమాలో బూచాడు అంటే కదలక మెదలక ఉండే నల్లని కలర్ లోని ల్యాండ్ లైన్ ఫోన్. అదే 2000 దాకా అంతా చూశారు, వాడారు, అపుడే మొబైల్స్ టెక్నాలజీ మెల్లగా అడుగుపెట్టింది. మొదట్లో తీగలతో కాకుండా చేతిలో ఫోన్ పట్టుకుని ఎక్కడికి అయినా వెళ్ళి చేసుకునే వెసులుబాటు గ్రేట్ అని అనుకున్నారు. కానీ ఇపుడు స్మార్ట్ ఫోన్ చూస్తూండగానే విశ్వరూపం చూపించి ప్రతిదీ మింగే పరికరంగా మారిపోయింది. కెమెరా, వాచ్, రేడియో, నోట్‌బుక్, నిఘంటువు, మ్యాప్, కాలిక్యులేటర్, మ్యూజిక్ సిస్టమ్ ఇలా ఒకటి రెండూ కాదు సమస్తం స్మార్ట్ ఫోన్ మింగేసి అంతా తానై కూర్చుంది. అంతే కాదు ఫోటో తీసుకోవాలంటే ఎంతో ప్రయాస కానీ ఇపుడు చూస్తే ఫోన్ కెమెరాలు రోజువారీ జీవితాన్ని పూర్తి నిడివి డాక్యుమెంట్ చేయడం అలవాటుగా మార్చాయి. ఇక అన్నింటికీ మించి సోషల్ మీడియా ఆలోచనలను వ్యక్తీకరించడానికి బలమైన వేదికగా మారిపోయింది.

వాట్సప్ ఫ్యామిలీస్ :

ఎదురు బొదురూ లేని బతుకులు ఈ పాతికేళ్ళలో అయిపోయాయి. బంధాలు అన్నీ మటాష్ అయ్యాయి. ఒకే ఇంట్లో ఉన్నా అందరికీ ఫోన్లు ఎవరి వ్యాపకాలు వారికి ఉన్నాయి. అయితే ఇంత దాంట్లోనూ వాట్సాప్ కుటుంబ కనెక్షన్‌ల పేరుతో తిరిగి కలవడం ఒక ఊరట. అంతే కాదు, వీడియో కాల్స్ ఎంతెంతో దూరాలను తగ్గించేశాయి. అమెరికా టూ అనకాపల్లి హాయిగా చూస్తూ మాట్లాడుకునే రోజులు వచ్చాయి. ఈ రోజున స్మార్ట్‌ఫోన్ లేకుండా పని చేయడం చాలా కష్టంగా మారింది. అవతల వారితో కమ్యూనికేట్ చేయడం దాదాపు అసాధ్యంగా మారింది.

డిజిటల్ పేమెంట్స్ తో :

ఈ రోజున ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని కొనేయవచ్చు. ఒక అతి చిన్న ఆహార దుకాణాల నుండి మాల్స్ వరకూ ఫోనే డిజిటల్ పేమెంట్స్ చేస్తుంది. దాంతో బ్యాంకులకు వెళ్ళే శ్రమ తప్పింది. అదే సమయంలో ఆర్థిక పారదర్శకత పెరిగింది. ఇక సోషల్ మీడియా ద్వారా కంటెంట్ ఎవరి దగ్గర ఉంటే వారు పదిమందికీ తెలియచేసే చాన్స్ దొరికింది. అలా ఫోటోలు, వీడియోలు, కళ, సమీక్షలు సోషల్ మీడియా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రపంచాన్ని చేరుకోవడానికి ఒక వేదికను ఇచ్చింది అని చెప్పాలి. దీని వల్ల సరికొత్త రచయితలు పుట్టారు, అలాగే, నూతన చిత్ర నిర్మాతలు పుట్టుకొచ్చారు, చిన్న వ్యాపారాలు పెరిగాయి, అంతదాకా ఎందుకు ఆఖరుకు రాజకీయాలు కూడా సోషల్ మీడియా ట్రెండ్‌లను అనుసరించడం ప్రారంభించాయి అంటే ఈ పాతికేళ్ళ టెక్నాలజీని చెప్పతరమా.

వినోదం రూపు మారింది :

సినిమా అంటే ఒకనాడు థియేటర్లకు వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇపుడు స్మార్ట్ ఫోన్ లోనే ఉంది అది. అలాగే గత దశాబ్దంలో, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఇలా చెప్పుకుంటే ప్రతిదీ మారిపోయింది. అంతే కాదు

గ్లోబల్ కథలతో రచయితలు ఆకట్టుకుంటున్నారు ప్రపంచ సినిమా అయింది, వెబ్ సిరీస్ డాక్యుమెంటరీలకు వినోద రంగం ఎగబాకింది. టాలెంట్ కి కొత్త మార్గాలు దొరికాయి. ఇక 2000లో పుట్టిన పిల్లలు బాల్యం అంతా టెక్లాలజీతోనే గడించింది. వారికి బాల్యం పుస్తకాల కంటే మొబైల్ స్క్రీన్‌లతోనే అని చెప్పాల్సి.

తర్వాత పాతికేళ్ళూ ఎట్లా :

సహస్రాబ్దిలో తొలి వందలో పాతికేళ్ళు ఇట్టే ముగిసాయి. ఇక అంతా ఆలోచిస్తోంది ఏంటి అంటే తరువాత పాతికేళ్ళూ ఎట్లా ఉంటుంది అని. ఇపుడు కృత్రిమ మేధ ఏఐ రూపంలో ముంగిటకు వచ్చేసింది. ఒక విధంగా ఏఐ యుగం ప్రారంభమైనట్లే అని చెప్పాలి. దాంతో దాంతో రాబోయే పాతికేళ్ళూ కృత్రిమ మేధస్సుకు చెందినవి అని అర్ధం అయిపోతోంది. ఇప్పటిదాకా అంతా చూసింది కేవలం చిన్నపాటి కదలికలే. అసలైన కుదుపులూ టెక్నాలజీ పరంగా విప్లవాత్మకమైన మార్పులు అన్నీ ఈ పాతికేళ్ళలోనే ఉంటాయని మేధావులు అంటున్నారు. టోటల్ చేంజ్ అన్నది ఇపుడే స్టార్ట్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు.

జాబ్స్ ఉంటాయా లేదా :

ఏఐ ఆవిష్కరణ తరువాత అందరిలోనూ మెదిలే పెద్ద ప్రశ్న ఏమిటి అంటే జాబ్స్ ఉంటాయా లేదా అన్నది. దీనికి వెంటనే జవాబు ఉంది. ఉన్న జాబ్స్ ఊడతాయి. అంటే 2025 నాటికి ఉన్న ట్రెడిషనల్ జాబ్స్ ఇక కనిపించవు అన్న మాట. అలా ఉద్యోగాలు మారుతాయి, అలాగే నైపుణ్యాలు మారుతాయి. ఏఐ నిర్దాక్షిణ్యంగా పాత ఉద్యోగాలను తొలగిస్తుంది ఇది సత్యం. కానీ కొత్త వాటిని కూడా సృష్టిస్తుంది. ఇది నిజం. ఇక వచ్చే భారీ మార్పులు ఏంటి అని చూస్తే కనుక మనిషిలోని వ్యాధులను ముందుగానే గుర్తించే రోగనిర్ధారణ వ్యవస్థలు అద్భుతంగా వెలుగు చూస్తాయి అంతే కాదు వ్యక్తిగత వైద్య ప్రొఫైల్‌ల ఆధారంగా చికిత్సలు కూడా ఉంటాయి.

ఇంటి నుండి వర్చువల్ వైద్యులు రోగికి ట్రీట్మెంట్ ఇస్తారు.

అన్నీ ఊహించని మార్పులే :

అంతే కాదు ఏఐ సాధనాలతో తిరిగి రూపొందించబడిన విద్యా విధానం అమలులోకి వస్తుంది. అలాగే ఇంటి పనులు వంట పనులు ఆఫీసు పనులు ఇలా అన్నీ చక్కబెట్టే మానవ యంత్ర సహకారాలు అభివృద్ధి చెందుతాయి. అంతే కాదు, కళలు, సంగీతం, సినిమా, రచన - ప్రతిదీ ఏఐతోనే. అంతటి గొప్ప క్రియేటర్ గా ఏఐ ఉంటుంది అన్న మాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే గత 25 సంవత్సరాలు గొప్పగా ఉంటే రాబోయే సంవత్సరాలు విప్లవాత్మకంగా ఉంటాయి అంటున్నారు. 2000 నుండి 2025 వరకూ మార్పులు అన్నీ మనిషి తానుగా క్రియేట్ చేసి ఆవిష్కరించినవిగా ఉన్నాయి. కానీ ఇక మీదట మనిషి పాత్ర పరిమితం అయి ఏఐ వంటి టెక్నాలజీలు అన్నింటా అగ్రభాగాన నిలుస్తాయి అన్న మాట.

మనిషి ఎక్కడ ఉంటాడో :

ఇలా చెప్పుకుంటూ పోతే రానున్న పాతికేళ్ళలో మనిషి ఎక్కడ ఉంటాడు అన్నదే ధర్మ సందేహం. ఇక మీదట మానవులు సృష్టించిన యంత్రాలు అన్నీ మార్గనిర్దేశం చేస్తాయి. అయితే ఇది భయానకంగా ఉంటుందా లేక మంచి అవకాశాలకు వేదిక అన్నది ఇపుడే ఎవరూ చెప్పలేరు ఏఐని మనిషి ఉపయోగించే తీరుని బట్టే అది ఆధారపడి ఉంటుంది అని మాత్రం చెప్పగలరు. గత పాతికేళ్ళలో ఊస్తే మానవ జీవితం అంతా డిజిటల్ ప్రపంచంలోకి వెళ్ళింది. కానీ రానున్న పాతికేళ్ళలో మానవాళిని మెరుగైన మేధస్సు యుగంలోకి తోసివేసే టెక్నాలజీ వస్తుంది. అయితే మార్పులు అన్నవి అనివార్యం. వద్దన్నా వస్తాయి. కానీ వాటిని అర్థం చేసుకోవడం, మనిషికి తగినట్లుగా మానవ వికాసానికి అనుగుణంగా రూపించుకోవడంలోనే అందం ఉంది. పరమార్ధమూ ఉంది.

Tags:    

Similar News