500 మంది చైనా సైనికులను తుదమొట్టించిన మన సైనికులు.. ఎందరంటే?
అది 1963, జనవరి 27 ఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో లతా మంగేష్కర్ కన్నీటిగా పాడిన ‘ఏ మేరీ వతన్ కే లోగో’ పాటను విన్నప్పుడు దేశం ఒక్కసారిగా 1962 యుద్ధ గాయాలను గుర్తు చేసుకుంది.;
అది 1963, జనవరి 27 ఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో లతా మంగేష్కర్ కన్నీటిగా పాడిన ‘ఏ మేరీ వతన్ కే లోగో’ పాటను విన్నప్పుడు దేశం ఒక్కసారిగా 1962 యుద్ధ గాయాలను గుర్తు చేసుకుంది. ఆమె స్వరం గుండెలోతుల్లోకి వెళ్లింది. కానీ ఆ స్వరంలో దాగి ఉన్న కొన్ని వీరగాథలు మాత్రం అప్పటికీ బయటకు రాలేదు. లతా గానం చేసే సమయానికి రజాంగ్ లా మంచు కింద 16 వేల అడుగుల ఎత్తులో నిశ్శబ్ధంగా సమాధి అయిన 118 భారత జవాన్ల వీరోచిత పోరాటం ఇంకా వెలుగులోకి రాలేదు. పర్వతాల నడుమ మంచులో గడ్డకట్టిన శరీరాలు.. కానీ చేతుల్లో తుపాకులు మాత్రం ఇంకా బిగుసుకున్నాయి. శరీరాల ముందు భాగంలో తూటాలు, వెన్నెముకపై ఒక్క గాయమూ లేదు. అంటే వారు చివరి శ్వాస వరకు శత్రువును ఎదుర్కొంటూ.. వెనక్కి ఒక్క అడుగు వేయకుండా నిలిచారన్న ధృవం. ఆ భీతావహ దృశ్యాలను ఒక గొర్రెల కాపరి చూసి సైన్యానికి తెలియజేయకపోయే వాడైతే, ఈ శౌర్యగాథ ఎప్పటికీ భారత చరిత్రలో కనిపించకుండా మంచు కిందే మర్చి పోతుండేది.
రజాంగ్ లాలో జరిగిన మహాయుద్ధం
1961 నుంచే చైనా లద్ధాఖ్‌లో చిన్న చిన్న చొరబాట్లు చేస్తోంది. సింకియాంగ్–టిబెట్ మధ్య భారత భూభాగంపై రహదారి వేస్తూ “హిందీ చీని భాయ్ భాయ్” అంటూ దౌత్య నటన చేస్తున్నా, అసలు లక్ష్యం మాత్రం భారత సరిహద్దు ఆక్రమణే. నెహ్రూ తీసుకొచ్చిన ఫార్వర్డ్ పాలసీకి ప్రతీకారంగా 1962 అక్టోబర్ 20న చైనా అకస్మాత్తుగా యుద్ధాన్ని మొదలుపెట్టింది. నవంబర్ నాటికి పరిస్థితి అత్యంత విషమమైంది. చుషుల్ లోయను కాపాడడం భారత రక్షణలో కీలకం. దానికే ముఖద్వారం — రజాంగ్ లా పాస్. అది పడితే లేహ్ ప్రమాదంలో పడుతుంది.
ఇలాంటి సమయంలో రంగంలోకి దిగింది 13 కుమావ్ రెజిమెంట్ — చార్లీ కంపెనీ. మేజర్ షైతాన్ సింగ్ నేతృత్వంలో ఉన్న వీరుల వద్ద పెద్ద ఆయుధాలు లేవు; మంచుతో నిండిన 17,000 అడుగుల ఎత్తులో యుద్ధ అనుభవం కూడా లేదు. కానీ ధైర్యం మాత్రం పర్వతాల్లా అజేయంగా ఉంది. చుట్టూ మంచు, ముందర శత్రువు, పైగా మైనస్ టెంపరేచర్… కానీ వెనుదిరగడం వారి రక్తంలో లేదు.
వెనక్కి తగ్గం
నవంబర్ 18 తెల్లవారుజామున వందల సంఖ్యలో చైనా సైనికులు ముందుకు కదులుతున్నారని సమాచారం రాగానే లిజనింగ్ పోస్టులో ఉన్న నలుగురు జవాన్లు చివరి యుద్ధానికి సిద్ధపడ్డారు. సిపాయ్ హుకుం సింగ్ విలక్షణ ధైర్యం చూపాడు. “ఎంత ఎక్కువసేపు వారిని అడ్డుకుంటే, అంత ఎక్కువ అవకాశాలు మన కంపెనీకి ఉంటాయి” అన్న అతని మాటలు ఆ నాలుగు మందిని సింహాల్లా మార్చాయి. చైనా సైనికులు రేంజ్‌లోకి రాగానే హఠాత్తుగా కాల్పులు ప్రారంభించడంతో శత్రువులు క్షణం హడలిపోయారు. కానీ అనంతరం ఎదురుదాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు; మరొకరు గాయపడి శత్రువులకు చిక్కిపోయారు.
అక్కడే పోరాటం ముగిసిన గంటలోపే అసలు తుఫాను రజాంగ్ లా శిఖరం వద్ద కురిసింది. 400 మంది చైనా సైనికులు సూరజ్ నేతృత్వంలోని 7వ ప్లాటూన్‌పై దాడి చేశారు. పెద్ద ఆయుధాలేమీ లేనప్పటికీ 3 అంగుళాల మోర్టార్లతో భారత జవాన్లు ధైర్యంగా ప్రతిదాడి చేసి 130 మందికి పైగా చైనా సైనికులను కూల్చారు. మందుగుండు అయిపోయిన తరువాత చేతితోనే పోరాడారు. చివరి శ్వాస వరకు “13 కుమావ్ కీర్తిని నిలబెట్టండి” అని సూరజ్ పిలుపునిచ్చి వీరమరణం పొందాడు.
దాడి తీవ్రత పెరుగుతున్నా, మేజర్ షైతాన్ సింగ్ మాత్రం ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. ఒక్కో ప్లాటూన్ వద్దకు చేరుకొని వారిలో ధైర్యం నింపుతూ, వ్యూహాలను మార్చిస్తూ యుద్ధాన్ని నిలబెట్టాడు. ఆయుధాలు కొరవడుతున్నాయనే సూచనలు వచ్చినా, “వెనక్కి తగ్గరు” అన్నది ఆయన చివరి నిర్ణయం.
మేలు కోసం ప్రాణాలర్పించిన 118 మంది
చైనా మీడియం మిషన్‌గన్‌ను నిలువరిస్తే యుద్ధ చిత్రం మారుతుందని గుర్తించిన గులాబ్ సింగ్, సింగ్‌రామ్ ఇద్దరూ బాంబుల వర్షంలో ముందుకు పరిగెత్తి త్యాగం చేసిన క్షణం రజాంగ్ లా పోరాటం మహోన్నత శిఖరం. చివరికి 118 మందిలో కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రతి జవాను ఒక మేరు పర్వతంలా శత్రువుకు అడ్డుగా నిలిచాడు.
మేజర్ షైతాన్ సింగ్ చివరి క్షణాల్లో కూడా లైట్ మిషన్‌గన్ ట్రిగ్గర్‌ను తన కాలుకు కట్టుకొని కాల్పులు చేస్తూ “నన్ను వదిలేసి ముందుకు సాగండి… ఒక్క చైనీయుడిని కూడా దాటనివ్వకండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన దృఢ సంకల్పం, చివరి శ్వాస వరకు యుద్ధం చేసిన ధైర్యం భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే ఆయనకు మరణానంతరం పరమవీర చక్రం అందింది.
ఈ యుద్ధంలో చైనా వైపు సుమారు 500 మంది వరకు మరణించారని అంచనా. ఉదయం 9 గంటలకు పోరాటం ముగియగానే, కొన్ని రోజుల్లో చైనా కాల్పుల విరమణ ప్రకటించింది. కానీ ప్రపంచానికి తెలియని రజాంగ్ లా వీరుల కథ మాత్రం ఎంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.