7 ఏళ్లలో 141 ఉద్యోగాలు.. ఇండియాలో సంచలనం రేపుతున్న మూన్‌లైటింగ్ కేసు!

మూన్‌లైటింగ్ అంటే ఒక ఉద్యోగి తన ప్రధాన ఉద్యోగంతో పాటు, మరొక కంపెనీలో లేదా ఫ్రీలాన్సర్‌గా రెండో ఉద్యోగం చేయడం.;

Update: 2025-05-20 09:53 GMT

ప్రస్తుతం దేశంలో ఒక విచిత్రమైన, షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. కేవలం ఏడు సంవత్సరాల వ్యవధిలో ఒకే అభ్యర్థి ఏకంగా 141 కంపెనీల్లో ఉద్యోగాలు చేసినట్లు తేలింది. ఆన్‌గ్రిడ్ అనే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ సంస్థ, EPFO (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) డేటాను విశ్లేషించగా ఈ భారీ మూన్‌లైటింగ్ వ్యవహారం బట్టబయలైంది.

ఏంటి ఈ మూన్‌లైటింగ్?

మూన్‌లైటింగ్ అంటే ఒక ఉద్యోగి తన ప్రధాన ఉద్యోగంతో పాటు, మరొక కంపెనీలో లేదా ఫ్రీలాన్సర్‌గా రెండో ఉద్యోగం చేయడం. ఇది చాలాసార్లు కంపెనీల నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో రిమోట్ వర్క్ పెరగడంతో ఈ మూన్‌లైటింగ్ బాగా చర్చనీయాంశమైంది. అప్పట్లో ఇన్ఫోసిస్, విప్రో వంటి పెద్ద ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు "రెండు జీవితాలు ఉండకూడదు" (No Double Lives) అని హెచ్చరించాయి. ఎందుకంటే, ఇలా రెండు చోట్ల పనిచేయడం వల్ల ఉద్యోగి ప్రధాన ఉద్యోగంలో సరిగా పనిచేయలేకపోవడం, ప్రైవసీ సమస్యలు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటివి తలెత్తే అవకాశం ఉంటుంది.

ఆ షాకింగ్ వివరాలు ఇవే

ఈ కేసులో ఆన్‌గ్రిడ్ తమ జాబ్ హిస్టరీ తనిఖీ ద్వారా ఈ అభ్యర్థిని గుర్తించింది. అతని రికార్డుల్లో ఏకంగా 141 ఉద్యోగాలు చేస్తున్నట్లు గుర్తించారు. అంటే, ఒకేసారి అనేక కంపెనీల్లో పనిచేసినట్లు స్పష్టమవుతోంది. 2018 నుండి 2021 మధ్య, ఈ అభ్యర్థి ఒకేసారి 10 సంస్థల ద్వారా ఉద్యోగంలో రిక్రూట్ అయ్యాడు. ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారడానికి ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా చేరారు.

2020లో ప్రపంచం మొత్తం ఉద్యోగాల తొలగింపులు, ఆర్థిక అనిశ్చితితో పోరాడుతుండగా ఈ వ్యక్తి స్టార్టప్‌లు, పెద్ద సంస్థలు, మల్టి నేషనల్ కంపెనీలు ఇలా అన్నింటిలోనూ కలిపి 50 కొత్త ఉద్యోగాలు సాధించాడు. ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం.

ఎందుకు ఇలా జరుగుతోంది? సంస్థలకు ముప్పు ఏంటి?

ఆన్‌గ్రిడ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పియూష్ పేష్వానీ మాట్లాడుతూ.. "రిమోట్ వర్క్, ఫ్రీలాన్సింగ్, హైబ్రిడ్ మోడల్స్ కామన్ అవుతున్న ఈ రోజుల్లో, ఉద్యోగాల్లో ఉండే ప్రమాదాలు కూడా కొత్త రూపం సంతరించుకుంటున్నాయి. అందుకే సాంప్రదాయ బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్స్ ఇప్పుడు సరిపోవు" అని అన్నారు. ఇలాంటి మూన్‌లైటింగ్ కేసుల వల్ల కంపెనీలకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగికి నిబద్ధత లేకపోవడం, పనితీరు సరిగా లేకపోవడం, కంపెనీ సమాచారం బయటకు వెళ్ళే ప్రమాదం, అలాగే సంస్థ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం కూడా ఉంది. ఈ కేసు భారతదేశంలో ఉద్యోగ నియమాలు, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

Tags:    

Similar News