వందేళ్ళ ఏయూ...లోకేష్ దిశా నిర్దేశం !

విశాఖలో ఘనత వహించిన విద్యా సంస్థగా విఖ్యాతి కాంచింది ఏయూ. 1926 ఏప్రిల్ 26న ప్రారంభమైన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చే ఏడాదితో వందేళ్ళు నిండుతున్నాయి.;

Update: 2025-04-09 03:49 GMT

విశాఖలో ఘనత వహించిన విద్యా సంస్థగా విఖ్యాతి కాంచింది ఏయూ. 1926 ఏప్రిల్ 26న ప్రారంభమైన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చే ఏడాదితో వందేళ్ళు నిండుతున్నాయి. డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి నాయకత్వంలో మొదలైన ఏయూ డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ మార్గదర్శకంలో ఎదిగింది. ఎంతో మంది ఉప కులపతులుగా పనిచేసిన ఏయూ ఈ దేశ స్వాతంత్ర్యానికి ముందే తెలుగు జాతి బావుటాను గర్వంగా ఎగురవేసింది.

ఏయూకి గత కీర్తిని నిలబెడుతూ భావి తరాలకు దీప్తిని స్పూర్తిని ఇచ్చేలా ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఏయూ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆయన ఏయూకి క్యూఎస్ ర్యాంకింగ్స్ లోటాప్-100లో స్థానం పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పాలక మండలికి సూచిస్తున్నారు.

ఏయూ వందేళ్ళ పండుగని ఈ నెల 26 నుంచి ప్రారంభిస్తున్నారు. ఏడాది పాటు సాగే శతజయంతి ఉత్సవాలు ఒక వేడుకగా సాగనున్నాయి. ఈ ఉత్సవాల గురించి ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేష్ ఏయూ వీసీ జీపీ రాజశేఖర్ తో పాటు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తదితరులతో సుదీర్ఘంగా చర్చించారు.

ఏయూ ఉత్సవాలని వైభవంగా నిర్వహించాలని ఆయన కోరారు దానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఏయూకి పూర్వ వైభవం తీసుకుని రావాలని ఆయన కోరారు. ఏయూలో ఉన్న ఖాళీలను కూడా తొందరలోనే భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఏయూకి ఇటీవలనే వీసీని నియమించారు. పాలన సజావుగా సమర్ధంగా సాగాలన్నది ప్రభుత్వం ఉద్దేశ్యంగా ఉంది. ఏయూ అన్నది ఉన్నత లక్ష్యాలతో ఏర్పాటు అయిన విద్యా సంస్థగా ఉండాలని నారా లోకేష్ పదే పదే సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే వందేళ్ళ ఏయూ వేడుకల కోసం పాలక మండలి పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది.

ఏడాది పాటు సాగే ఈ ఉత్సవాలు ఏయూ ఘనతను ఈ తరానికి తెలియచేయాలని చూస్తున్నారు ఏయూని మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖపట్నానికి ఉన్న ఆభరణాలలో కలికి తురాయి లాంటిది ఏయూ అని అంతా గర్వంగా చెబుతారు. అంతా అక్కడ విద్యాబుద్ధులు నేర్చిన వారే. అలాంటి ఏయూ శతాబ్ది అంటే అందరికీ పండుగే అని అంటున్నారు.

Tags:    

Similar News