భార్యాభర్తల మధ్య తరచూ గొడవలా? B12 లోపం ప్రభావం కూడా ఉండొచ్చు!
| చిన్న విషయాలకే కోపం, చిరాకు, మూడ్ మార్పులు రావడానికి విటమిన్ B12, ఐరన్, విటమిన్ D లోపాలు కూడా కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ లోపాలే దంపతుల గొడవలకు కారణమని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు. తరచూ ఇలాంటి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, చిరాకు పడటం, ప్రశాంతంగా ఉండలేకపోవడం.. ఇలాంటి పరిస్థితులు కొందరి దైనందిన జీవితంలో భాగమైపోతాయి. అయితే వీటి వెనుక కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే కాకుండా, శరీరంలో కొన్ని పోషకాల లోపాలు కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా విటమిన్ B12 లోపం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కొందరిలో ఆందోళన, మూడ్లో మార్పులు, ఏకాగ్రత తగ్గడం, అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు నీరసం, బలహీనత, తలనొప్పి రావచ్చు. విటమిన్ D లోపం కండరాల నొప్పులు, ఎముకల బలహీనతకు కారణమవుతుంది.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టర్లో న్యూట్రిషనిస్ట్ గౌతమ్ కూడా ఈ మూడు పోషకాల లోపాల గురించి ప్రస్తావించారు. వీటిని సరిచేసుకుంటే దంపతుల మధ్య వచ్చే సమస్యలు తగ్గవచ్చన్నది ఆయన అభిప్రాయంగా అందులో పేర్కొన్నారు.
అయితే పోషకాల లోపాలే భార్యాభర్తల గొడవలకు కారణమని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రతి సమస్యను విటమిన్ లోపంతో ముడిపెట్టడం కూడా సరికాదు.
తరచూ అలసట, చిరాకు, మూడ్ మార్పులు ఉంటే వైద్యుడిని సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షల్లో లోపం బయటపడితే వైద్యుల సూచనతోనే సప్లిమెంట్లు తీసుకోవాలి.