షాకింగ్ న్యూస్...ఏపీని పీడిస్తున్న రెండు జబ్బులు
| ఏపీలో బీపీ, షుగర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. తాజా ఎన్సీడీ 4.0 నివేదిక ప్రకారం రాష్ట్రంలో 59.63 లక్షల మందికి బీపీ, 48.95 లక్షల మందికి షుగర్ ఉండగా.. 34 లక్షల మందికి రెండు వ్యాధులూ ఉన్నాయి. కొత్తగా 12.23 లక్షల బీపీ, 11.58 లక్షల షుగర్ కేసులను గుర్తించారు. మరోవైపు 12,768 క్యాన్సర్ కేసులు వెలుగుచూశాయి.
ఏపీని రెండు జబ్బులు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ప్రధానంగా బీపీ షుగర్ వంటి వ్యాధులు అత్యధికంగా ఉన్నాయి. ఇక ఏపీలో చూసుకుంటే ఉన్న పాత వాటికి తోడుగా కొత్తగా మరింత మందికి బీపీ షుగర్ వ్యాధులు సంభవించడం అంటే షాకింగ్ న్యూస్ గానే అంతా చూస్తున్నారు. తాజాగా నివేదిక ప్రకారం చూస్తే ఏపీలో కొత్తగా 12.23 లక్షల మందికి బీపీ ఉంది. అలాగే 11.58 లక్షల మందికి షుగర్ ఉంది అని తేలింది. ఈ కొత్త కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం 59.63 లక్షల మంది అధిక రక్తపోటు ఉంటే 48.95 లక్షల మంది మధుమేహంతో బాధపడుతున్నారు అన్నది స్పష్టం అవుతోంది. అంతే కాదు ఈ మొత్తం అంటే ఒక కోటీ ఎనిమిది లక్షల 58 వేల మందిలో కూడా బీపీ, మధుమేహం రెండు కలిపి ఉన్న వారు 34 లక్షలు ఉన్నారని నివేదికలు చెబుతూండడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
పెరుగుతున్న క్యాన్సర్ కేసులు :
ఇక ఏపీలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్ సీడీ 4.0 నివేదిక ప్రకారం చూస్తే కొత్తగా 12,768 క్యాన్సర్ కేసులను గుర్తించారు. ఇందులో నోటి క్యాన్సర్ కేసులతో 3,339 మంది రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులతో 9,171 మంది బాధపడుతున్నట్లుగా వెల్లడి అయింది. ఏపీ జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 2.85 కోట్ల మందికి బీపీ, మధుమేహం, నోటి క్యాన్సర్ పరీక్షలు చేశారు. అలాగే ఇక ఎన్ సీడీ 4.0 సర్వే రాష్త్రంలో 14 నెలల పాటు సాగింది. ఈ సర్వేను గత ఏడాది సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. నవంబర్ 10న సర్వే ముగిసింది. గ్రామ, వార్డు స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మధుమేహ పరీక్షలు నిర్వహించారు
జిల్లాల వారీగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు :
ఇక జిల్లాల వారీగా బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎంత మంది ఉన్నారు అన్నది లెక్క తీస్తే తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాలు బీపీ కేసుల్లో ముందున్నాయని నివేదిక తేల్చింది. అలాగే షుగర్ కేసులలో తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, వైఎస్సార్ కడప, ఏలూరు జిల్లాలు ఉన్నాయి. అదే విధంగా ఈసర్వే ద్వారా మాత్రమే కొత్తగా గుర్తించిన బీపీ కేసులు వివిధ జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నంలో 78 వేల 17 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 68 వేల 802 మంది, తిరుపతి లో 65 వేల 504 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 64 వేల 116 మంది, వైఎస్సార్ కడప జిల్లాలో 63 వేల 41 మంది ఉన్నరు. అలాగే షుగర్ కేసులలో విశాఖపట్నం జిల్లాలో 80 వేల 692 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 67,935 మంది, తిరుపతి జిల్లాలో 67,827 మంది, వైఎస్సార్ కడప జిల్లాలో 66 వేల 914 మంది, ప్రకాశం జిల్లాలో 61 వేల 415 మంది కొత్తగా జబ్బు పడిన వారుగా ఉన్నారు.
నియంత్రణకు ప్రాధాన్యం :
అయితే రాష్ట్ర ప్రభుత్వం జీవనశైలి వ్యాధుల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సత్య కుమార్ యాదవ్ చెబుతున్నారు. బీపీ, మధుమేహం వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి వాటి తీవ్రత పెరగకుండా అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. అలాగే క్యాన్సర్ కేసులను కూడా ప్రాథమిక దశలోనే గుర్తించేలా పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యాధులు గుర్తించిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని ప్రజల ఆరోగ్య పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.