పొద్దున్నే టాయిలెట్ కోసం ఎంతసేపు? మిస్ కాకుండా చదవాల్సిందే
గతం ఒక లెక్క. వర్తమానం మరో లెక్క. అప్పట్లో వాష్ రూంకు వెళ్లామా? వచ్చేశామా? అన్నట్లు ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.;
గతం ఒక లెక్క. వర్తమానం మరో లెక్క. అప్పట్లో వాష్ రూంకు వెళ్లామా? వచ్చేశామా? అన్నట్లు ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అప్పట్లో ఇండియన్ స్టైల్ నుంచి చాలావరకు వెస్ట్రన్ కమోడ్ కు మారిపోయారు. అంతేనా.. గతంలో లేని సెల్ ఫోన్ ఇప్పుడు చేతిలోకి వచ్చేసింది. ఇలాంటివేళ.. వాష్ రూం అలవాట్లు మారిపోయాయి? ఇలాంటి వేళలోనే.. ఉదయాన్నే టాయిలెట్ కోసం వెళ్లినప్పుడు అక్కడ ఎంతసేపు ఉంటున్నారు? అన్న ప్రశ్నను సంధిస్తే.. ముఖంలో రంగులు మారొచ్చు. చిరాకుగా ముఖం పెట్టొచ్చు. కానీ.. ఆ లెక్క ఇప్పుడు చూసుకోవాల్సిందేనని చెబుతున్నారు నిఫుణులు.
దీనికి కారణం లేకపోలేదు. టాయిలెట్ కోసం వెళ్లి అక్కడే సెల్ ఫోన్ పట్టుకొని ఉదయాన్నే చాట్ మొదలు.. సోషల్ మీడియా ఆప్డేట్లు.. వార్తలు.. వార్తాపత్రికలు ఇలా టాయిలెట్ నుంచే తమను తాము ఎంగేజ్ చేసుకునేటోళ్లు సంఖ్య అంతకంతకూ ఎక్కువైపోతోంది. అసలు టాయిలెట్ లో ఎంతసేపు ఉండాలన్న దానికో లెక్క ఉందన్న మాట చెబుతున్న వైనం ఆసక్తికరంగానే కాదు ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
వాష్ రూంకు వెళ్లి కమోడ్ మీద కూర్చొని అక్కడి నుంచే ఫోన్లో ముచ్చట్ల పంచాయితీలు పెట్టుకునేటోళ్లు ఈ మధ్యన ఎక్కువ అయ్యారు. మరికొందరు ఏకంగా రీల్స్.. వీడియోలు చూస్తున్న పరిస్థితి. అలాంటి వారంతా తమ అలవాటును టక్కున మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. వాష్ రూంకు వెళ్లి కమోడ్ మీద ఎక్కువ సమయం గడిపే వారు.. తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొనే వీలుందన్న విషయాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కమోడ్ మీద కూర్చున్న తర్వాత ఏడు నిమిషాల్లో పని ముగించుకొని బయటకు వచ్చేయాలని చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ టైం కూర్చుంటే.. ఆరోగ్య సమస్యలు ఖాయమంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అండాకారంలో ఉండే వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చున్నప్పుడు పిరుదులు నొక్కుకుపోయి.. మలద్వారం మరింత కిందకు అవుతుందని.. దీని కారణంగా పురీష నాళం వద్ద ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగా జరగదని.. పురీష నాళం ఎక్కువ రక్తంతో ఉబ్బడం వల్ల ఫైల్స్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తుననారు. ఈ కారణంగానే టాయిలెట్ కు వెళితే 7 నిమిషాలకు మించి ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు.
టాయిలెట్ కమోడ్ మీద 10 నిమిషాల కంటే మించి కూర్చున్న వారికి ఆరోగ్య సమస్యలు ఖాయమంటున్నారు. ఫోన్ పట్టుకొని పది నిమిషాలకు పైనే కూర్చునే ప్రతి నిమిషానికి పైల్స్ వచ్చే అవకాశం 1.26 శాతం పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. పట్టణప్రాంతంలో సుమారు 80 శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు టాయిలెట్ లోకి ఫోన్లు తీసుకెళుతుంటారన్నది ఒక అంచనా. కమోడ్ మీద విశ్రాంతస్థితిలో ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఉండటం ద్వారా మలవిసర్జన చేయాలనే సహజ కోరిక బలహీనమవుతుందని చెబుతున్నారు. ఇదే తర్వాతి కాలంలో మల విసర్జన సైకిల్ లో తేడాలు వస్తాయని చెబుతున్నారు.
మోషన్ సరిగా కాలేదన్న కారణంగా అసంకల్పితంగానే ముక్కటం.. బలవంతంగా మలవిసర్జనకు ప్రయత్నించటం కారణంగా ఒత్తిడి పెరిగి పైల్స్ వస్తుంటాయని.. మలం బయటకు రాకుండా లోపలే ఉండటంతో దాన్ని బలవంతంగా బయటకు తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నాలతో పెద్దపేగు సమస్యలు తలెత్తే వీలుందంటున్నారు. ఫోన్ చూస్తూ కూర్చోవటం అలవాటు అయితే.. అది ఉంటే తప్పించి మోషన్ కాదన్న పరిస్థితి ఏర్పడుతుందని.. దాన్ని సైకలాజికల్ నెగెటివ్ ప్రభావంగా పిలుస్తారని చెబుతున్నారు.
భారతీయ శైలి ఇండియన్ టాయిలెట్స్ మీద కూర్చున్నప్పుడు సులువుగా మలవిసర్జనకు బాడీ నేచురల్ గా సిద్ధమవుతుందని.. అదే వెస్ట్రన్ కమోడ్ మీద రిలాక్స్ డ్ గా కూర్చోవటం కారణంగా ఫోన్ చూడటం.. పేపర్ చదవటం లాంటివి చేస్తారని.. ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టాయిలెట్ కు వెళ్లే వేళ.. చేతిలో ఫోన్.. పేపర్ లాంటివి తీసుకెళ్లకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు.