క్యాన్సర్ టెస్ట్ తో గుండె జబ్బును కనుక్కునే వీలు.. ఈ ఏఐ టూల్ తో మహిళలకు లాభాలెన్నో..!
వైద్య శాస్త్రంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటి వరకు మామోగ్రామ్ అంటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకే ఉపయోగించేవారు.;
వైద్య శాస్త్రంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటి వరకు మామోగ్రామ్ అంటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అదే మామోగ్రామ్ ను ఉపయోగించి మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేసే కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి చేయడం వైద్యరంగానికి ఒక విప్లవాత్మక ముందడుగనే చెప్పాలి.
ఒకే పరీక్ష రెండు లాభాలు..
మామోగ్రామ్ అనేది రొమ్ములోని క్యాన్సర్ కణతులను తెలుసుకునేందుకు ఉపయోగించే పరీక్ష. అయితే ఆస్ట్రేలియాలో 49 వేల మందికి పైగా మహిళల మామోగ్రామ్ రికార్డులను ఏఐ పరీశీలకు ఇచ్చారు శాస్త్రవేత్తలు. దీని ఫలితంగా మామోగ్రామ్ చిత్రాల్లో కనిపించే కణజాల లక్షణాలు గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి సూచనలను కూడా వెల్లడిస్తాయని తేలింది. అంటే ఒకే పరీక్షతో రొమ్ము క్యాన్సర్‌తో పాటు గుండెజబ్బుల ముప్పు కూడా అంచనా వేసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది వైద్యరంగంలో సమయం, ఖర్చు, వనరులు మూడు ఆదా అవుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలకు గుండెజబ్బులు అంతగా రావు. సాధారణ అలసట, ఒత్తిడిగా మాత్రమే వారిలో లక్షణాలు కనిపిస్తాయి. దీంతో చాలా మంది ఆలస్యంగానే వైద్యుడిని సంప్రదిస్తారు. కాని మామోగ్రామ్ లాంటి రొటీన్ పరీక్షే గుండెజబ్బుపై ముందస్తు హెచ్చరిక ఇస్తే.. వైద్యులు కూడా మహిళల ఆరోగ్యంపై మరింత సమగ్ర దృష్టి పెట్టవచ్చు కదా..
వైద్య విధానంలో విప్లవం
కృత్రిమ మేధస్సు వినియోగం వల్ల పెద్ద మొత్తంలో డేటా వేగంగా, కచ్చితంగా విశ్లేషించే అవకాశం ఉంది. మానవ కళ్లకు కనిపించని సున్నితమైన మార్పులు కూడా ఏఐ గుర్తించగలవు. అంటే భవిష్యత్తులో ఒక మహిళ సాధారణ మామోగ్రామ్ కోసం వెళ్లినా.. గుండె ఆరోగ్యంపై కూడా ముందస్తు సమాచారం తెలుసుకోగలదు. ప్రివెంటివ్ హెల్త్‌కేర్ వైపు వైద్య రంగాన్ని నడిపించేందుకు ఉపయోగపడుతుంది. ‘మామోగ్రామ్ కేవలం క్యాన్సర్ కోసమే’ అన్న అపోహలు ఇక ఉండవు. ఒకే పరీక్షతో రెండు ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
దేశాల దేశాల మహిళలకు తేడా ఉంటుందా..?
ఏఐ టూల్స్ ప్రతి ఒక్కరికీ చేరాలంటే సాంకేతిక సదుపాయాలు, డేటా భద్రత, వైద్యుల శిక్షణ, ఖర్చు వంటి అంశాలు సవాళ్లుగా ఉంటాయి. పైగా ఈ పరిశోధన ప్రధానంగా ఆస్ట్రేలియా మహిళల డేటా ఆధారంగా జరిగింది. భారతదేశం వంటి విస్తార జనాభా, భిన్నమైన జీవనశైలి ఉన్న దేశాల్లో కూడా ఇది పనిచేస్తుందా..? అన్నది భవిష్యత్తు పరిశోధనలతో తేలాలి.