సిగిరెట్ మాదిరే జిలేబీ.. సమోసాలు..అనారోగ్యానికి కేరాఫ్ అడ్రస్?
ఇంతకాలం చిరుతిళ్లుగా మాత్రమే తప్పించి.. ఆరోగ్యానికి హానికరమన్న విషయాన్ని పట్టించుకున్నది లేదు.;
చూసినంతనే నోరు జివ్వుమనిపిస్తూ.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గుటుక్కున తినేయాలనిపించే జిలేబీ.. సమోసాలు అంటే ఇష్టమా? వాటిని అదే పనిగా లాగిస్తుంటారా? ఏం తిన్నా.. తినకున్నా ఈ రెండింటిని తినేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారా? అయితే.. మీరు మిస్ కాకుండా చదవాల్సిందే. సమోసా.. జిలేబీ మాత్రమేకాదు పకోడి.. వడా పావ్.. చాయ్ బిస్కెట్ వరకు అన్ని రకాల చిరుతిళ్లు ఆరోగ్యానికి ఎంత హానికరమన్న విషయాన్ని కేంద్రం వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంతకాలం చిరుతిళ్లుగా మాత్రమే తప్పించి.. ఆరోగ్యానికి హానికరమన్న విషయాన్ని పట్టించుకున్నది లేదు. కొన్ని చిరుతిళ్లు అనారోగ్యానికి కేరాఫ్ అడ్రస్ అన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు వీలుగా కేంద్రం ఒక కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. సిగిరెట్ ప్యాకెట్ల మీద ఎలా అయితే ‘ఆరోగ్యానికి హానికరం’ అంటూ హెచ్చరిక కనిపిస్తుందో.. అదే విధంగా పలు చిరుతిళ్ల పాకెట్ల మీద కూడా ఈ తరహా హెచ్చరిక దర్శనం ఇవ్వనుంది.
ముఖ్యంగా చిరుతిళ్లలో ఆరోగ్యానికి హాని చేసే చక్కెర.. కొవ్వు తదితరాల శాతాన్ని ప్రముఖంగా ముద్రించనున్నారు. ఇలా చేయటం ద్వారా అంతకంతకూ పెరుగుతున్న జీవనశైలి వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచటంతో పాటు.. పలు వ్యాధులకు కారణమైన హెచ్చు మోతాదులోఉండే నూనెలు.. చక్కెరలపై ప్రజల్ని అలెర్టు చేయటమే ఉద్దేశంగా చెబుతున్నారు. దేశంలో తొలిసారి నాగపూర్ ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ తరహా ప్రచారాన్ని ప్రయోగాత్మకంగా మొదలు పెట్టనున్నారు.
ఇందులో భాగంగా పుడ్ కౌంటరలు.. కేప్ టేరియాల్లో తేలిగ్గా చదివేలా.. పెద్ద అక్షరాలతో కూడిన భారీ పోస్టర్లు.. వార్నింగ్ బోర్డుల్ని ఏర్పాటు చేయటం ద్వారా.. చిరుతిళ్లను తరచూ తింటే తలెత్తే ఆరోగ్య సమస్యల్ని వివరంగా ఏకరువు పెడతారు. ఈ విధానాన్ని కొద్ది నెలల్లోనే దేశం మొత్తమ్మీదా విస్తరించాలని భావిస్తున్నారు. సమోసా.. జిలేబీ.. వడా పావ్.. పకోడి లాంటి సంప్రదాయ చిరుతిళ్లతో పాటు పిజ్జాలు.. బర్గర్లు.. డోనట్లు లాంటి విదేశీ చిరుతిళ్లను కూడా హానికారక జాబితాలోచేర్చాలని సబార్డినేట్ లెజిస్లేషన్ పై పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్.. శివసేన ఎంపీ మిలింద్ దేవరా సూచన చేశారు.
అయితే.. ఈపాపులర్ చిరుతిళ్లపై నిషేధం లాంటివేమీ కేంద్రం విధించటం లేదని స్పష్టం చేస్తున్నారు. కేవలం ఈ చిరుతిళ్లను తినటం ద్వారా ప్రజల్లో ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించటం.. జీవనశైలి వ్యాధుల్ని తగ్గించటమే లక్ష్యమని చెప్పాలి. భారత్ లో ఆరోగ్య సంక్షోభం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. స్థూలకాయం.. మధుమేహం.. అధిక రక్తపోటు.. గుండె జబ్బుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీనికి కారణం అతిగ వేయించిన ఆహారంతో పాటు చక్కెర శాతం అధికంగా ఉండే చిరుతిళ్లే. ఇదే తీరు కొనసాగితే.. త్వరలో భారతదేశంలో 44 కోట్ల మంది స్థూలకాయులుగా మారుతారని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ హెచ్చరించింది. ఇదే అంశాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా వెల్లడించటం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు.. పెద్దలు స్థూలకాయ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఏమైనా కేంద్రం చేపట్టాలని భావిస్తున్న ఈ ప్రచారం మంచిదే.