అజీర్తికి మామిడిపండుతో చెక్.. హెచ్ సీయూ పరిశోధన!

తిన్నది అరగని సమస్యకు చెక్ పెట్టే అంశాన్ని తన పరిశోధనతో గుర్తించారు తెలుగు ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ ఒకరు.

Update: 2024-05-04 04:28 GMT

తిన్నది అరగని సమస్యకు చెక్ పెట్టే అంశాన్ని తన పరిశోధనతో గుర్తించారు తెలుగు ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ ఒకరు. తాజాగా ఒక అంతర్జాతీయ జర్నల్ లో ఈ రీసెర్చ్ వివరాల్ని వెల్లడించిన వైనం ఆసక్తికరంగా మారింది. అజీర్తికి.. పోషకాలతో పాటు రుచికి పెట్టింది పేరున్న మామిడి పండుతో సాధ్యమన్న ఆసక్తికర విషయాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రెడ్డన్న గుర్తించారు.

ఈ పరిశోధనకు సంబంధించిన వివరాల్ని ‘అమెరికన్ కెమికల్ సొసైటీ ఫార్మాకాలజీ.. ట్రాన్స్ లేషన్’ పేరుతో పబ్లిష్ అయ్యే జర్నల్ లో ప్రచురించారు. మామిడిపండులో ఉండే ‘‘మాంగి ఫెరిన్’’ రసాయనం అజీర్తిని తగ్గించే గుణం ఉందని.. ఈ వాదనను బలోపేతం చేసేలా ఎలుకలపై చేసిన పరిశోధనలు సత్పలితాలు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. మామిడిపండ్లలో ఉండే మాంగిఫెరిన్ రసాయనం పెద్దపేగు.. చిన్నపేగులో జీర్ణ వ్యవస్థను చురుకుగా పని చేసేలా చేయటంతో పాటు.. పేగు క్యాన్సర్ కారక కణాల్ని నిర్వీర్యం చేస్తుందా? అన్న సందేహాలతో షురూ చేసిన పరిశోధన ఒక కొలిక్కి వచ్చింది.

హెచ్ సీయూ ప్రొఫెసర్ రెడ్డన్న.. పరిశోధకులు డాక్టర్ గంగాధర్.. కె. సురేష్.. కె. అనిల్ మూడేళ్లుగా చేస్తున్న పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చాయి. తాము గుర్తించిన అంశాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించేందుకు వీలుగా ఎలుకలపై పరిశోధనలు చేపట్టారు. ఎలుకలకు క్రత్రిమంగా అజర్తీని కల్పించారు. దానికి విరుగుడుగా మాంగిఫెరిన్ ఇవ్వటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వాటిల్లో అజీర్తి తగ్గటంతో పాటు.. జీర్ణవ్యవస్థ చురుకుగా పని చేయటం మొదలు పెట్టిన విషయాన్ని గుర్తించారు.

Read more!

అంతేకాదు.. కోలన్ క్యాన్సర్ సెల్ లైన్ నిర్వీర్యం కావటాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో మాంగిఫెరిన్ ను వైద్యపరంగా డెవలప్ చేసేందుకు ముందస్తుగా క్లినికల్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉండటం తెలిసిందే. మసాలాలతో కూడిన ఆహారం తీసుకోవటంతో జీర్ణాశయాంతర పేగు పని తీరు తగ్గే పరిస్థితి. దీంతో ఇన్ ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ తో బాధ పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. గడిచిన 30 ఏళ్లలో ఈ సమస్య భారీగా పెరుగుతోంది. దీనికి చెక్ చెప్పేందుకు తాజా పరిశోధన ఉపకరిస్తుందని చెప్పాలి. తమ పరిశోధనలో వేసవిలో లభించే మామిడి పండ్లతో ప్రయోజనం లభిస్తుందన్న విషయాన్ని గుర్తించినట్లుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News