యాపిల్ కు బిగ్ షాక్.. 2023 అస్సలు కలిసి రాలేదట
ఆయన గురించి.. ఆయన ప్రొఫైల్ గురించి.. తన సత్తా గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
పీటర్ రస్సెల్ క్లార్క్ అన్న పేరును ప్రస్తావిస్తే.. ఎవరూ పెద్దగా గుర్తించరు. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఫోన్ మొదలుకొని యాపిల్ ఉత్పత్తుల్ని వినియోగించే కోట్లాది మందిని ఈ పేరు గురించి అడిగితే.. సమాధానం వేళ్ల మీద లెక్కించే వారుతప్పించి.. మిగిలిన వారు చెప్పే పరిస్థితి ఉండదు. దీనికి కారణం యాపిల్ ఉత్పత్తులకు సంబంధించి అత్యుద్భుమైన హార్డ్ వేర్ డిజైన్ చేసే అతను కంపెనీలోకి కీలక విభాగాల వారికి తప్పించి..బయట ప్రపంచానికి పెద్దగా తెలీదు. ఆయన గురించి.. ఆయన ప్రొఫైల్ గురించి.. తన సత్తా గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
అలాంటి పెద్ద మనిషి తాజాగా యాపిల్ ను విడిచి పెట్టేసి బయటకు రావటం ఆ కంపెనీకి భారీ షాక్ గా చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు యాపిల్ కు చెందిన సీనియర్లు ఒకటి తర్వాత మరొకరు చొప్పున కంపెనీకి దూరమవుతున్నారు. ఇప్పటికే అరడజనుకు పైగా సీనియర్ ఉద్యోగులు (చాలా కీలక స్థానాల్లో ఉన్న వారు) గుడ్ బై చప్పేసి వెళ్లి పోయారు. తాజాగా యాపిల్ సీనియర్ డిజైనర్ పీటర్ రస్సెల్ క్లార్క్ యాపిల్ సంస్థ నుంచి బయటకు వచ్చేవారు. ఇంతకూ ఆయన ఎవరు? అతగాడి సత్తా ఎంతన్న విషయాన్ని వస్తే.. ఆయనకు సంబంధించిన ఒక్క విషయాన్ని చెబితే మిగిలిన విషయాలు ఇట్టే అర్థమవుతాయి.
యాపిల్ సంస్థలో సుమారు వెయ్యికి పైగా పెటెంట్ రైట్స్ క్లార్క్ పేరు మీద ఉండటం గమనార్హం. అలాంటి డిజైనర్ ను తాజాగా యాపిల్ చేజార్చుకుంది. బ్లూమ్ బెర్గ్ రిపోర్టు ప్రకారం.. క్లార్క్ యాపిల్ సంస్థలో అత్యంత ప్రముఖ డిజైనర్ గా పేరుంది. యాపిల్ ఉత్పత్తులైన ఐమాక్.. ఐపాడ్.. నానో.. మ్యాక్ బుక్ ఎయిర్ తో సహా సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తులకు సంబంధించి హార్డ్ వేర్ లకు సంబంధించిన డిజైన్ల విషయంలో ఇతను కీలక భూమిక పోషిస్తారని చెబుతారు. యాపిల్ ఉత్పత్తులు మాత్రమే కాదు.. సంస్థ హెడ్ క్వార్టర్.. ఇతర యాపిల్ రిటైల్ స్టోర్స్ డిజైన్లలోనూ పీటర్ పాత్ర ఉందన్నది మర్చిపోకూడదు.
ఇంతలా యాపిల్ సంస్థతో అనుబంధం ఉన్న ఆయన.. కంపెనీ నుంచి బయటకు వచ్చేశారు. ఇలాంటి కీలక డిజైనర్ నను కోల్పోవటం యాపిల్ కు పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు. యాపిల్ నుంచి బయటకు వచ్చేసిన ఆయన.. స్పేస్ టెక్నాలజీ అందించే కంపెనీగా పేరున్న వాస్ట్ లో చేరనున్నారు. ఆ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులపై సలహాలు ఇచ్చే సలహాదారుబాధ్యతల్ని చేపట్టారు. నిజానికి యాపిల్ ను ఇప్పటివరకుపలువురు డిజైనర్లు వదిలేయటం కనిపిస్తుంది. అయితే..వారికి క్లార్క్ కు మధ్య తేడా చాలా ఉందని చెబుతున్నారు. అతగాడు లేని యాపిల్.. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.