వెజ్ ఫుడ్ ..బాబోయ్ అనొద్దు బ్రో !
చాలా మందికి ఒక అపోహ ఉంది. శాకాహారం తినడం వల్ల సరిగ్గా ప్రోటీన్లు శరీరంలోకి చేరవు అని. అది తప్పు అని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు.
చాలా మంది బయటకు వెళ్ళి హొటల్స్ లో ఆర్డర్ చేసేటపుడు నాన్ వెజ్ నే ఎక్కువగా చూస్తారు. వెజ్ ఫుడ్ వద్దు అంటారు. బోబోయ్ బోర్ అని కూడా అంటూంటారు. అయితే వెజ్ ఫుడ్ ది బెస్ట్ అంటున్నాయి పరిశోధనలు. సో వద్దు అనొద్దు బ్రో అని సూచిస్తున్నారు. శాకాహారం అన్నది సమగ్రమైన ఆహారంగా నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వర్తమాన జీవితానికి సరితూగేది శాకాహారమే అని స్పష్టం చేస్తున్నారు. గతంతో పోలిస్తే శారీరక శ్రమ బాగా తగ్గింది. యంత్రాలతోనే పని జరుగుతోంది. ఈ క్రమంలో జీర్ణానికి ఎంత కష్టంగా ఉండే మాంసాహారం తీసుకోవడం వల్ల అది అరగక ఇబ్బందులు వస్తాయని గుర్తు చేస్తున్నారు. అదే శాకాహారం అయితే అన్ని రకాలైన పోషకాలు అందులో ఉంటాయని పైగా జీర్ణానికి ఎంతో వీలుగా ఉంటుందని చెబుతున్నారు. ఈ రోజు శాకాహార దినోత్సవం. ప్రతీ ఏటా అక్టోబర్ 1న దీనిని జరుపుకుంటున్నారు. 1977లో వెజిటేరియన్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా మొదటిసారిగా శాకాహార దినోత్సవాన్ని జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను శాకాహారం వైపుగా నడిపించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం.
సుదీర్ఘమైన ఆయుష్షు :
ఏ మనిషి అయినా ఈ భూమి మీద సుదీర్ఘమైన ఆయుష్షుతో జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యానికి అసలైన మూలం శాకాహారంలోనే ఉన్నాయని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్ లో ప్రచురించిన ఒక కధనం ప్రకారం చూస్తే శాకాహారుల కంటే మాంసాహారులలోనే వృద్ధాప్య చాయలు తొందరగా వస్తాయని స్పష్టం చేశారు. అదే విధంగా జబ్బుల తీవ్రత వీరికే ఎక్కువగా ఉంటుందని కూడా పేర్కొన్నారు. శాకాహారంలోనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కూడా నిగ్గు తేల్చారు. శాకాహారం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా చెబుతున్నారు.
అనేక సమస్యలకు చెక్ :
శాకాహారం తీసుకుంటే అనేక రకాలుగా వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని అంటున్నారు. బరువు తగ్గడం కూడా శాకాహారం వల్లనే సాధ్యమని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని, గ్యాస్ వంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. అంతే కాదు శాకాహారం తినే వారిలో గుండె జబ్బులు కూడా తక్కువగా ఉంటాయని తెలియచేస్తున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దరి చేరకుండా చూస్తుందని లివర్ చెడిపోకుండా కాపాడుతుందని చెబుతున్నారు.
అది అపోహ మాత్రమే :
చాలా మందికి ఒక అపోహ ఉంది. శాకాహారం తినడం వల్ల సరిగ్గా ప్రోటీన్లు శరీరంలోకి చేరవు అని. అది తప్పు అని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. మొక్కల నుంచి లభించే ఆహారం తినడం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది. అలాగే అన్ని రకాలైన ప్రోటీన్లు పప్పు ధాన్యాలలో సమకూరుతాయని అంటున్నారు. ఇక విటమిన్ బీ 12 వంటివి పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి అందించవచ్చు అని సూచిస్తున్నారు. ఆకుకూరలు, పండ్లు గింజలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వివరిస్తున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే వెజిటేరియన్ ఫుడ్ లోనే ఎక్కువ పోషకాలు వుంటాయన్నది. అలాగే బోలెడు లాభాలు కూడా వెజ్ ఫుడ్ లోనే ఉన్నాయని అంటున్నారు. రోజూ వెజ్ తోనేనా అని ఆలోచించే వారు అందులోనే ఎన్నో రకాలుగా వంట చేసుకుని తింటే రుచితో పాటు హెల్త్ కూడా తమతోనే ఉంటాయని న్యూట్రీషియన్స్ సూచిస్తున్నారు.
పెరుగుతున్న సంఖ్య :
గతంతో పోలిస్తే ఇపుడు ఆరోగ్యం పట్ల ప్రతీ వారిలో అవగాహన చాలా ఎక్కువగా ఉంది. దాంతో పాటు శాకాహారం మీద కూడా మోజు అధికం అవుతోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా వెజిటేరియన్లు ఎక్కువ అవుతున్నారని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తమ జీవన శైలిని మార్చుకుంటూ వెజ్ ఫుడ్ తో మంచి జీవితాన్ని కోరుకుంటున్నారు. వైద్యులు కూడా వెజ్ ఫుడ్ తీసుకోవాలనే సలహా సూచనలు ఇవ్వడం వల్ల కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధుల బారిన రక్షించుకునేందుకు కూడా ఇపుడు శాకాహారం బాట పడుతున్నారు. బీపీ సుగర్ వంటివి పూర్తిగా నియంత్రణలో ఉండాలన్న దీర్ఘ కాలిక వ్యాధులకు చెక్ పెట్టాలన్న ది బెస్ట్ ఫుడ్ వెజ్ అని అంతా సూచిస్తున్నారు. అనేక పరిశోధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో వెజిటేరియన్ డే రోజున అంతా మరోసారి ఆలోచన చేయాలని న్యూట్రిషియన్స్ కోరుతున్నారు.