వెటరన్ స్టార్లతో జెన్ Zని పోల్చి చూడటం సరికాదేమో!
ఈ వింటేజ్ ఫోటో ఎక్కడ తీశారో తనకు గుర్తులేదని జీనత్ పేర్కొన్నా.. అభిమానులు మాత్రం వెంటనే ఆ గుట్టు విప్పేశారు.;
సినీ పరిశ్రమలో స్నేహబంధాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా వెటరన్ నటి జీనత్ అమన్.. తన ఆప్తమిత్రురాలు రేఖతో కలిసి ఉన్న ఒక పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లలో పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా మెరిశాయి. దశాబ్దాల కాలం గడిచినా... తరచుగా మాట్లాడుకోకపోయినా.. కలిసినప్పుడు మాత్రం ఎంతో ఆత్మీయంగా గడిపే తమ అరుదైన స్నేహం గురించి జీనత్ రాసుకొచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటోలో రేఖ తనదైన శైలిలో చీరకట్టులో మెరిసిపోతుండగా.. జీనత్ తెలుపు రంగు దుస్తుల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు.
ఈ వింటేజ్ ఫోటో ఎక్కడ తీశారో తనకు గుర్తులేదని జీనత్ పేర్కొన్నా.. అభిమానులు మాత్రం వెంటనే ఆ గుట్టు విప్పేశారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన `రామ్ బలరామ్` చిత్ర ముహూర్తం సమయంలో తీసిన ఫోటో ఇదని నెటిజన్లు గుర్తించారు. విజయ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఈ ఇద్దరు అందాల భామల కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. కాలం మారుతున్నా వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏమాత్రం తగ్గలేదని ఈ ఫోటో నిరూపిస్తోంది.
అయితే ఈ ఫోటోపై ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. జీనత్, రేఖల మధ్య ఉన్న ఆత్మీయతను చూపిస్తూ.. నేటి తరం తారలైన దీపికా పదుకోన్, ఆలియా భట్ ఇలాంటి అనుబంధాన్ని ప్రదర్శించగలరా? అని సదరు జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఒకరి చేతులు మరొకరు పెనవేసుకుని ఉన్న ఆ పాత తరం తారల సాన్నిహిత్యం నేటి కాలంలో కనిపిస్తుందా? అన్నట్లుగా ఆ వ్యాఖ్య సాగింది. దీంతో ఒక్కసారిగా పాత తరం వర్సెస్ కొత్త తరం నటీమణుల మధ్య పోలిక మొదలైంది.
ఈ పోలికపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక తరం నటీమణులను ప్రశంసించడానికి మరో తరం వారిని తక్కువ చేయాల్సిన అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. నేటి తరం నటీమణులపై ఇలాంటి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం నిరాశ కలిగిస్తోంది! అంటూ చాలా మంది దీపికా, ఆలియాలకు మద్దతుగా నిలిచారు. సినీ పరిశ్రమలో పోటీ ఉన్నా.. సమకాలీన నటీమణుల మధ్య కూడా మంచి స్నేహబంధాలు ఉంటాయని.. వాటిని పాత తరంతో పోల్చడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి జీనత్ అమన్ షేర్ చేసిన ఒక చిన్న ఫోటో బాలీవుడ్ స్నేహాలలోని విరుద్ధ భావజాలాన్ని.. తరాల మధ్య మారుతున్న దృక్పథాల గురించి చర్చకు దారి తీసింది. 1980ల నాటి తారల మధ్య ఉన్న సహజమైన సాన్నిహిత్యం ఒక అద్భుతమైన జ్ఞాపకం అయితే.. నేటి తరం నటీమణులు తమదైన రీతిలో వృత్తిపరమైన గౌరవాన్ని, స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ చర్చలు ఎలా ఉన్నా... ఆనాటి తారల అందం, అనుబంధం మాత్రం నేటికీ వెండితెర ప్రేమికులకు ఒక తీపి గుర్తుగా మిగిలిపోయాయి.