ఆమె చెప్పిన పాఠాల్ని ఏ విద్యా నేర్పలేదు
డైరెక్టర్ గా ఎన్నోఅద్భుతమైన సినిమాలను తీసిన వైవీఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వైవీఎస్ తల్లి రత్నకుమారి సెప్టెంబర్ 25 రాత్రి 8:31 గంటలకు తన తుదిశ్వాసను విడిచారు.;
చదువుకుంటేనే దేనికైనా పనికొస్తారు, లేకపోతే గిన్నెలు కడుక్కోవడానికి తప్ప దేనికీ పనికిరారని ఇంట్లోని పిల్లలు సరిగా చదవకపోతే పెద్దవాళ్లు అంటుంటారు. కానీ ఎలాంటి చదువూ సంధ్యలు లేకపోయినా తన తల్లి ఆర్థికరంగ నిపుణురాలిగా కుటుంబంలో ఎంతో పెద్ద పాత్ర పోషించిందని చెప్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత వైవీఎస్ చౌదరి.
అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న రత్నకుమారి
డైరెక్టర్ గా ఎన్నోఅద్భుతమైన సినిమాలను తీసిన వైవీఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వైవీఎస్ తల్లి రత్నకుమారి సెప్టెంబర్ 25 రాత్రి 8:31 గంటలకు తన తుదిశ్వాసను విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, ట్రీట్‌మెంట్ తీసుకుంటూ కన్నుమూశారు. తల్లి మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు చౌదరి.
చదువుకోకపోయినా నోటి లెక్కలతోనే బడ్జెట్ కేటాయింపు
విషయం తెలుసుకున్న ఎంతో మంది సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ పోస్టులు పెడుతుండగా, తల్లిని గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు చౌదరి. తన తల్లి ఏమీ చదువుకోకపోయినా లారీ డ్రైవర్ గా పని చేసే తన తండ్రి నెల జీతంతో ముగ్గురు బిడ్డల్నీ ఎలాంటి లోటు లేకుండా చాలా బాగా పెంచడంతో పాటూ, అన్ని అవసరాలకు ఎలాంటి లోటు రాకుండా నోటి లెక్కలతో బడ్జెట్ ను కేటాయించేవారని రాసుకొచ్చారు.
తన తల్లి నిత్యం తెల్లవారుజామునే నిద్ర లేస్తూ పనిమనిషితో పని లేకుండా బిడ్డలకు అన్నీ తానై పెంచి, తన జీవితాన్ని కూడా అంకితం చేసిన ఆదర్శమూర్తి అని, ఆమెకు తెలిసిన లెక్కలు, ఆమె తమను పెంచిన విధానం ఏ చదువూ, విద్యా నేర్పించలేనిదని, ఆమె విధానాలు తమలో కూడా స్పూర్తిని నింపాయని చెప్తూ వైవీఎస్ రాసిన లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ ను పరిచయం చేస్తూ సినిమా
ఇక వైవీఎస్ చౌదరి విషయానికొస్తే మూవీ ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన తర్వాత నిర్మాతగా, డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి మూవీతో డైరెక్టర్ గా మారిన ఆయన తర్వాత ఎన్నో మంచి సినిమాలతో ఆడియన్స్ ను అలరించారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ ముని మనవడు, జానకిరామ్ కొడుకైన నందమూరి తారక రామారావుని పరిచయం చేస్తూ ఓ సినిమాను చేస్తున్నారు.