నాగార్జునపై మరోసారి తిట్లతో రెచ్చిపోయిన అన్వేష్
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అన్వేష్ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అన్వేష్ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ‘నా అన్వేషణ’, ‘ప్రపంచ యాత్రికుడు’ వంటి యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్లి అక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి, అలవాట్లను పరిచయం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజలకు ఉపయోగపడే పలు అంశాలపై ఆయన చేసిన వీడియోలు కూడా నెటిజన్ల నుంచి ఆదరణ పొందాయి.
ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలపై అన్వేష్ చేసిన విమర్శలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఆ తర్వాత హిందూ దేవుళ్లపై ఆయన చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ అన్వేష్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
తాజాగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘అగ్ని పరీక్ష 2’ కార్యక్రమానికి సంబంధించిన కొంతమంది కంటెస్టెంట్స్ స్కూల్స్, కాలేజీలకు వెళ్లి తమకు ఓట్లు వేయాలని ప్రచారం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విమర్శలు వచ్చాయి.
చదువుకునే విద్యార్థుల మధ్య రియాలిటీ షో కంటెస్టెంట్స్ ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉందని, స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలు ఇలాంటి ప్రచారాలకు ఎలా అనుమతి ఇచ్చాయంటూ పలువురు ప్రశ్నించారు.
ఈ అంశంపై స్పందించిన అన్వేష్.. ‘బిగ్ బాస్ 10’ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునను తీవ్రంగా విమర్శించారు. స్కూల్స్, కాలేజీలకు వెళ్లి కంటెస్టెంట్స్ ప్రచారం చేయడాన్ని తప్పుబట్టాలని, అయితే నాగార్జున మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
అన్వేష్ మాట్లాడుతూ.. కంటెస్టెంట్స్ తెలిసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చని, కానీ ఇలాంటి విషయాలను ఖండించాల్సిన బాధ్యత నాగార్జున వంటి సీనియర్ వ్యక్తులపై ఉందని అన్నారు. నాగార్జున వయసు, ఆయన కుటుంబ పరిస్థితులను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు 70 ఏళ్లు వచ్చాయి.. ఇద్దరు కొడుకులు ఉన్నారు.. త్వరలో తాత కూడా కాబోతున్నారు. ఇలాంటి స్థాయిలో ఉన్న మీరు తప్పును ఖండించాలి. సైలెంట్‌గా ఉండకూడదు’’ అంటూ మండిపడ్డారు.
అంతేకాకుండా జీవితంలో మిగిలిన సమయాన్ని నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. ఇలాంటి పనులు చేస్తే నరకానికి వెళ్తారంటూ కూడా అన్వేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అన్వేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ విమర్శిస్తున్నారు. దీంతో అన్వేష్ వ్యాఖ్యలపై నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ వివాదంపై నాగార్జున నుంచి ఏమైనా స్పందన వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.