ట్రెండింగ్: ట్యాలెంటెడ్ డైరెక్టర్ లోపం ఎక్కడుంది?
సినీపరిశ్రమలో ప్రవేశించే ఔత్సాహిక యువదర్శకులు నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఇక్కడ ఉన్నాయి.;
సినీపరిశ్రమలో ప్రవేశించే ఔత్సాహిక యువదర్శకులు నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఇక్కడ ఉన్నాయి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ లో ప్రవేశించే ముందు అక్కడ వివాదాలకు ఉన్న ఆస్కారం, వివాదాస్పద వైఖరి గురించి మొదటగా తెలుసుకోవాలి. ముఖ్యంగా దర్శకుడు కలిసి పని చేసేది ముగ్గురు కీలక వ్యక్తులతో. వారిలో ఒకరు నిర్మాత, రెండో వ్యక్తి హీరో, మూడో వ్యక్తి సినిమాటోగ్రాఫర్. ఈ ముగ్గురితో ఎక్కడ చెడినా ఆ ప్రాజెక్ట్ ఎటో వెళుతుంది.
ఇటీవల అలాంటి చిక్కులు ఎదుర్కొన్న ఒక ప్రముఖ తెలుగు దర్శకుడి కెరీర్ జర్నీ టాలీవుడ్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అతడు మొదట బాలీవుడ్ లో ఉన్న అత్యంత వివాదాస్పద కథానాయికతో భారీ వారియర్ చిత్రానికి కలిసి పని చేసాడు. స్వతహాగానే ఫెమినిజాన్ని బహిరంగంగా ప్రదర్శించే సదరు నటీమణి, అప్పటికే తన మునుపటి హీరోలు, నిర్మాతలు, లిరిసిస్టులతో కూడా తీవ్రంగా ఘర్షణ పడింది. వారితో కోర్టుల్లో యుద్ధాలే చేసింది. అలాంటి ఒక నటి కం నిర్మాతతో ఈ తెలుగు దర్శకుడు ఒక సినిమా చేయబోయి భంగపడ్డాడు. అనూహ్యంగా వారియర్ కథతో రూపొందించిన ఆ ప్రాజెక్ట్ ను సగభాగం పైగా పూర్తి చేసాక వైదొలగాల్సి వచ్చింది.
అయితే ఆ తర్వాత కూడా అతడి స్టెప్ సరిగా పడలేదు. ఈసారి రాజకీయాలు, సినిమాలు అంటూ రెండు పడవలపై పయనిస్తున్న స్టార్ హీరోని ఎంపిక చేసుకుని జర్నీ ప్రారంభించాడు. ఇది కూడా భారీ వారియర్ సినిమా. ఇప్పుడు కూడా సేమ్ రిజల్ట్. ఈ ప్రాజెక్టును కూడా కొంత భాగం పూర్తి చేసి వేరొకరికి అప్పజెప్పాడు. చివరికి ఈ ప్రాజెక్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా సదరు దర్శకుడు కనిపించడం లేదు. అసలు ఈ సినిమాలో తాను ఎంత భాగం షూట్ చేసాడు? ఆ తర్వాత తన స్థానంలోకి వచ్చిన వ్యక్తుల పాత్ర ఎలాంటిది? వగైరా విషయాల్ని అధికారికంగా అతడు ప్రకటించలేదు. కన్ క్లూజన్ కి వస్తే, ఈ రెండు సందర్భాల్లో హీరోలు బాగానే ఉన్నారు. కానీ తాను మాత్రం నాశనమయ్యాడు. సగం వండిన ప్రాజెక్టులతో తనకు ఏమాత్రం క్రెడిట్ దక్కదు. పైగా ఇతరుల డామినేషనే తనపై ఎక్కువ. అన్నిటినీ భరించాల్సి వచ్చింది. అయితే ఈ రెండు అనుభవాలతో రాటుదేలిన అతడు తదుపరి లేడీ ఓరియెంటెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇది తెలివైన ఆలోచన. ఇప్పుడు దీంతో నిరూపించుకుని, భవిష్యత్ లో ఎలాంటి భంగపాటు లేని సినిమాలు తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతిభ ఉన్నా, అసలు సమస్య ఎక్కడ ఉందో కనుగొని భవిష్యత్ కోసం అతడు తెలివైన పరిష్కారం వెతకాలని ఆకాంక్షిస్తున్నారు. ఒక సినిమా కోసం దర్శకుడు ఐదేళ్లు కేటాయించడం అంటే మాటలు కాదు. కానీ ఇకపై అలా జరగకూడదని ఆశిస్తున్నారు.