'బలగం' వేణు 'ఎల్లమ్మ' కోసం వెన్నెలని దించేస్తున్నారా?
ఇంటిపెద్ద మరణం చుట్టూ అల్లుకున్నకథతో కమెడియన్ వేణు చేసిన మ్యాజిక్ ఇంతా అంతా కాదు.;
ఇంటిపెద్ద మరణం చుట్టూ అల్లుకున్నకథతో కమెడియన్ వేణు చేసిన మ్యాజిక్ ఇంతా అంతా కాదు. తొలి సారి దర్శకుడిగా మారి వేణు తెరకెక్కించి ప్రియదర్శ ప్రధాన పాత్రలో రూపొందించిన మూవీ `బలగం`. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడక్షన్‌లో చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా నిర్మించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా విమర్శకులని సైతం మెప్పించి అందరిచేత కంటనీరు పెట్టించింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఈ సినిమా దర్శకుడిగా వేణుకు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది.
`బలగం` లాంటి ఎమోషనల్ డ్రామా తరువాత వేణు ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తాడా? అని అంతా ఎదురు చూస్తున్న వేళ మళ్లీ ఓ మట్టికథతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడానికి రెడీ అవుతున్నాడు వేణు. తను డైరెక్ట్ చేస్తున్న తాజా మూవీ `ఎల్లమ్మ`. ముందు నానిని ఈ ప్రాజెక్ట్ కోసం అనుకున్నారు కానీ కుదరకపోవడంతో ఆ స్థానంలో నితిన్‌ని ఫైనల్ చేసుకున్నారు. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎమోషనల్ డ్రామాని నిర్మించబోతున్నారు.
హీరో నితిన్ మునుపెన్నడూ కనిపించని సరికొత్త పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో దర్శకుడు వేణు ఈ సినిమాని డిజైన్ చేస్తున్నాడు. ఇప్పటికే రంగస్థల కళాకారుల్ని ఎంపిక చేసుకున్న వేణు ఇందులో హీరోయిన్‌గా సాయి పల్లవిని అనుకున్నారట. అయితే ఫైనల్‌గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నటనకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్ కావడం, మహానటి, దసరా సినిమాల్లో కీర్తి సురేష్ నటించిన తీరుకు ముగ్ధుడైన వేణు తననే ఫైనల్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇటీవలే కీర్తిసురేష్‌కు వేణు కథ వినిపించాడట. తన పాత్ర, దానికున్న ప్రాధాన్యత నచ్చడంతో కీర్తి సురేష్ `ఎల్లమ్మ`లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు నితిన్, కీర్తి సురేష్ కలిసి `రంగ్ దే` మూవీలో తొలిసారి నటించారు. `ఎల్లమ్మ` వీరిద్దరి కలయికలో రెండవ సినిమా కాబోతోంది. వర్ఖ్ షాప్‌లు నిర్వహించి ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట.