టాలీవుడ్ స్టార్స్ నెంబర్ ఆఫ్ మూవీస్.. ఆఫ్ సెంచరీ కూడా కష్టమేనా?
తెలుగు సినిమా చరిత్రను తిరగేస్తే ఒకప్పుడు హీరోలు ఏడాదికి అరడజను సినిమాలు ఈజీగా రిలీజ్ చేసేవారు.;
తెలుగు సినిమా చరిత్రను తిరగేస్తే ఒకప్పుడు హీరోలు ఏడాదికి అరడజను సినిమాలు ఈజీగా రిలీజ్ చేసేవారు. మన సీనియర్ హీరోల ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాల మార్క్ ని దాటేయగా, నందమూరి బాలకృష్ణ 100 సినిమాల క్లబ్‌లో చేరి అదే స్పీడ్ లో వెళుతున్నారు. అక్కినేని నాగార్జున కూడా సెంచరికి దగ్గరగా ఉన్నారు, వెంకటేష్ 75 కి పైగా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ లెక్కలు కూడా పూర్తిగా మారిపోయాయి.
నేటి తరం టాప్ హీరోల కెరీర్ గ్రాఫ్ గమనిస్తే, భవిష్యత్తులో కొందరు 50 సినిమాల మార్కును చేరుకోవడం కష్టమనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. సినిమా మేకింగ్ స్టైల్ మారడం, ఒక్కో ప్రాజెక్ట్ కోసం ఏళ్ల తరబడి సమయం కేటాయించాల్సి రావడం దీనికి ప్రధాన కారణాలు. ఒకప్పుడు సినిమా షూటింగ్ అంటే మూడు నెలల్లో పూర్తయ్యేది, కానీ ఇప్పుడు ఒక్కో భారీ బడ్జెట్ సినిమాకు రెండు నుండి మూడు ఏళ్ల సమయం పడుతోంది. కేవలం మేకింగ్ మాత్రమే కాదు, ప్రేక్షకుల అభిరుచి కూడా ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలు తమ కెరీర్ ముగిసే సమయానికి 50 సినిమాలు కూడా పూర్తి చేస్తారా లేదా అనే డౌట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ గమనిస్తే, ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు, ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టుల వేగాన్ని బట్టి చూస్తే 50 సినిమాల మార్కును దాటడం కూడా డౌటే అనిపిస్తోంది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాల మధ్య గ్యాప్ పెరగడం, షూటింగ్ షెడ్యూల్స్ క్లిష్టంగా మారడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోంది.
ఇక్కడ కేవలం హీరోల స్పీడ్ మాత్రమే కాదు, ఆడియన్స్ టేస్ట్ కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమాకు మినిమం టాక్ వచ్చినా స్టార్ పవర్ వల్ల కనీసం 25 రోజులు థియేటర్లలో నష్టాలు రాకుండా ఆడేవి. కానీ ఇప్పుడు కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా మొదటి రోజే బోర్డులు తిప్పేయాల్సి వస్తోంది. ప్రేక్షకులు మునుపటిలా కేవలం హీరోని చూడటానికే థియేటర్లకు రావడం లేదు, కథలో దమ్ముంటేనే టికెట్ కొంటున్నారు. అందుకే ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో మేకర్స్ కూడా ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారు.
మరోవైపు సినిమా బడ్జెట్లు కోట్లలో ఉండటంతో రిస్క్ తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీ కోసం, రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం ఏళ్ల సమయం కేటాయించాల్సి వస్తోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా, ప్రాక్టికల్ గా అది సాధ్యపడటం లేదు. ఒక్క ప్లాప్ పడితే కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోతుందనే భయం కూడా హీరోలను ఆచి తూచి అడుగులు వేసేలా చేస్తోంది. ఒకరకంగా స్టార్స్ ని నిందించడానికి లేదు, ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ పరిస్థితి అలా ఉంది.
గతంలో కృష్ణ గారు లేదా చిరంజీవి గారి కాలంలో ఏడాదికి 13 సినిమాలు చేయడం సాధ్యమైంది, కానీ ఇప్పుడు సినిమా క్వాలిటీ మేకింగ్ విధానం పూర్తిగా మారిపోయింది. అప్పట్లో కథలు సింపుల్ గా ఉండేవి, ఇప్పుడు ప్రతి సినిమాను ఒక 'పాన్ ఇండియా' విజువల్ వండర్ లా తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల నటులు తమ కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారు. ఫలితంగా మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ లాంటి స్టార్ హీరోలందరూ 50 మార్కును చేరుకోవడం ఒక పెద్ద సవాల్ గానే కనిపిస్తోంది.
ఇక సినిమాలు తగ్గినా క్వాలిటీ పెరుగుతోందని కొందరు సరిపెట్టుకుంటుంటే, తమ హీరోలను తరచుగా స్క్రీన్ పై చూడలేకపోతున్నామనే బాధ ఫ్యాన్స్ లో ఉంది. ప్రభాస్ లాంటి హీరోలు తమ ప్లానింగ్ తో ఏడాదికి ఒకట్రెండు సినిమాలు రిలీజ్ చేయగలిగితేనే ఆ 40, 50 మార్కును చేరుకోవడం సాధ్యమవుతుంది. మరి రాబోయే రోజుల్లో మన టైర్ 1 హీరోలు ఈ అంచనాలను తలకిందులు చేసి స్పీడ్ పెంచుతారో లేదో చూడాలి.