సంక్షోభంలో టాలీవుడ్: ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి అసలు కారణాలు ఇవేనా?
అదే సమయంలో తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది చిత్రసీమలోనూ ఈ థియేటర్ల మనుగడపై పెద్ద ఎత్తున డిబేట్ మొదలైంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఒక అసాధారణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జనం థియేటర్లకు రావడం లేదని, పరిశ్రమ తీవ్ర సంఘర్షణలో ఉందనే నిజాన్ని బహిరంగంగా ప్రకటించిన మొదటి హీరో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. ఓటీటీల రాకతో ప్రేక్షకుల అలవాట్లు పూర్తిగా మారిపోయాయని, థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే సాంప్రదాయం క్రమంగా తగ్గిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల అనంతరం డజనుకు పైగా బాలీవుడ్ సినీ ప్రముఖులు ఇదే అంశంపై సీరియస్ ప్రకటనలు చేస్తూ.. భవిష్యత్తులో ఓటీటీల ప్రభావం, థియేటర్ల క్రైసిస్ గురించి పెద్ద ఎత్తున చర్చలు నడిపించారు.
అదే సమయంలో తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది చిత్రసీమలోనూ ఈ థియేటర్ల మనుగడపై పెద్ద ఎత్తున డిబేట్ మొదలైంది. ఇటీవల తెలంగాణ ఎగ్జిబిటర్లు తమ కష్టాలను చెప్పుకుంటున్న తరుణంలోనే.. టాలీవుడ్ అగ్ర నిర్మాత కం ఎగ్జిబిటర్ దిల్ రాజు సైతం ఇండస్ట్రీ ఎన్నడూ లేనంత క్రైసిస్‌ను ఎదుర్కొంటోందని అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండస్ట్రీ తీవ్రమైన బ్యాడ్ ఫేజ్‌లో ఉందంటూ ఆయన కలత చెందారు. మరోవైపు దర్శకుడు సాయి రాజేష్ సైతం మార్కెటింగ్ జిమ్మిక్కులు ఇప్పుడు పని చేయడం లేదని... బలమైన కంటెంట్ ఉంటేనే జనాన్ని థియేటర్లకు రప్పించగలమని స్పష్టం చేశారు. ఓటీటీల కల్లోలం ఒకవైపు.. కంటెంట్ లేమి మరోవైపు పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో నాసిరకం, రొటీన్ లేదా యావరేజ్ కంటెంట్‌ను ఆదరించేందుకు ప్రేక్షకులు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఏదైనా అసాధారణమైన, అద్భుతమైన కంటెంట్‌ను వెండితెరపై చూపిస్తేనే జనం థియేటర్ల వరకు వచ్చే వాతావరణం నెలకొంది. కేవలం క్రేజీ కాంబినేషన్ల వేటలో పడి మంచి కథలను విస్మరించినా.. లేదా కేవలం బిజినెస్ సమీకరణాలు, ఓటీటీ డీల్స్ కుదుర్చుకోవడమే లక్ష్యంగా సినిమాలు తీసినా ఆడియెన్స్ వాటిని తిరస్కరిస్తున్నారు. హీరోల స్టార్ ఇమేజ్‌తో సంబంధం లేకుండా కథలో బలం ఉండాలని ప్రేక్షకులు బలంగా కోరుకుంటున్నారు.
గతంలో చిన్న సినిమాలలో కూడా మన మట్టి వాసన కలిగిన బలమైన కథలు ఉండేవి. కానీ ఇప్పుడు మెజారిటీ సినిమాలు కేవలం ఆన్‌లైన్ ట్రెండ్స్, సోషల్ మీడియా మీమ్స్ ఆధారంగా స్క్రిప్ట్‌లు రాసుకుని తెరకెక్కిస్తున్నారు. ఇవి బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం వర్కవుట్ కావడం లేదు. దీనికి తోడు విపరీతంగా పెరిగిపోయిన మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల టికెట్ ధరలు కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలను కొత్త సినిమాలకు దూరం చేస్తున్నాయి. ఒక సామాన్య ఫ్యామిలీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సి రావడం పెద్ద మైనస్‌గా మారింది.
ఈ పరిస్థితులు ఇంకా కొనసాగినా మునుముందు పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని అంచనా. నిజాయితీ లేని సినిమాలు తీస్తే, థియేట్రికల్ బిజినెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా ప్రేక్షకులు థియేటర్ల వైపు చూడటం పూర్తిగా మానేసి తమ ఇళ్లలోనే ఓటీటీల ద్వారా ప్రశాంతంగా సినిమాలను వీక్షించడానికి అలవాటు పడిపోతారు. ఇప్పటికైనా టాలీవుడ్ మేకర్స్ కంటి తుడుపు మార్కెటింగ్ గిమ్మిక్కులు ఆపి.. కేవలం కథా బలం ఉన్న వైవిధ్యమైన చిత్రాలపైనే పూర్తి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.