బిజినెస్ సరే... రిలీజ్ ఎప్పుడు భయ్యా?
'దసరా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమాలో నాని జడల్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
'దసరా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ సినిమాలో నాని జడల్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు నానిని చూడని విభిన్నమైన గెటప్‌లో, పాత్రలో చూడబోతున్నామని ఇప్పటికే ప్రేక్షకులతో పాటు అందరికీ అర్థం అయింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఏం చేసినా చాలా స్పెషల్ గా ఉంటుందని అంటారు. ఆయనపై నాని పెట్టుకున్న నమ్మకం చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. బాబోయ్ ఒక్క సినిమా చేసిన దర్శకుడిని ఇంతగా నమ్ముతారా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. నాని చాలా నమ్మి గత ఏడాది కాలంగా జడల్ పాత్రలో నటిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి, కానీ సినిమా మాత్రం విడుదల కావడం లేదు.
ది ప్యారడైజ్ మూవీ రిలీజ్...
మొదట ది ప్యారడైజ్ సినిమాను ఆగస్టు 2026 అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్ ముగించలేక పోయారు. దాంతో ఆగస్టులో సినిమా లేనట్లే అని తేలిపోయింది. సెప్టెంబర్‌లో పండుగ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాని కాస్త సీరియస్‌గా తీసుకుని సినిమాను పూర్తి చేసేందుకు దర్శకుడిపై ఒత్తిడి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నాని సినిమా అనగానే అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనే అంచనాలు, ఆసక్తి ఎక్కువగా కనిపించడం కామన్ విషయం. ఈ సినిమా విషయంలో అది మరింత ఎక్కువగా ఉండటంతో అన్ని ఏరియాల్లోనూ రికార్డ్ స్థాయి బిజినెస్ జరిగింది. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి దాదాపుగా రూ.200 కోట్లు మార్కెట్ చేసిందట.
నాని, శ్రీకాంత్ ఓదెల మూవీ...
నాని మార్కెట్‌ను అమాంతం పెంచిన శ్రీకాంత్ ఓదెల విడుదల విషయంలో మాత్రం అభిమానుల సహనంను పరీక్షిస్తున్నాడనే విమర్శ ఎదుర్కొంటున్నాడు. బిజినెస్ అద్భుతంగా జరిగింది సరే, దానికి తగ్గట్లుగా మంచి డేట్‌కు సినిమాను విడుదల చేయాలి కదా అని చాలా మంది శ్రీకాంత్ ఓదెలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నాని నటించిన సినిమాలు మినిమం గ్యారెంటీ అన్నట్లు హిట్ కొడుతున్నాయి. అందుకే అన్ని ఏరియాల్లోనూ ది ప్యారడైజ్‌కు మంచి రేటు పలికింది, అంతే కాకుండా ఓటీటీ రికార్డ్ స్థాయిలో డీల్ కుదిరిందని అంటున్నారు. ఇవన్నీ లెక్కలు చూసి నాని ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. కానీ సినిమా విడుదల విషయంలో ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను దసరా కానుకగా అయినా విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరో నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసే విధంగా శ్రీకాంత్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
టాలీవుడ్‌లో ది ప్యారడైజ్ మూవీ క్రేజ్...
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా సినిమా తెలుగులో మాత్రమే హిట్ అయింది. ఇతర భాషల్లో విడుదల అయినా కూడా జనాలు అక్కడ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ది ప్యారడైజ్ విషయంలో మొత్తం మారబోతుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మొత్తం ఇండియా వ్యాప్తంగా సినిమాకు మంచి స్పందన వస్తుందని అంటున్నారు. ఆ నమ్మకంతోనే హిందీ రైట్స్ ను పెద్ద మొత్తానికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది. సినిమా బిజినెస్ అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ విడుదల విషయంలో ఎందుకు ముందుగా అనుకున్నట్లు జరగడం లేదని నాని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ విషయంలో రాజీ పడకుండా తీస్తున్న కారణంగానే ది ప్యారడైజ్ ఆలస్యం అవుతుందని, అంతకు మించి ఏమీ లేదని, వెయిట్ చేసినందుకు ఫ్యాన్స్‌కి మంచి సినిమా నాని నుంచి రాబోతుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్ సినిమాను మరీ లేట్ చేయకుండా, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ కొందరు ఉన్నారు.