క్రేజీ సీక్వెల్ డిలే.. పహల్గామ్ అటాక్స్‌పైకి నెట్టారు!
ఇక ఈ సినిమాకి ఆర్థిక కష్టాలు ఉన్న మాట వాస్తవమేనని కూడా అతడు అంగీకరించాడు. అయితే సాజిద్ దీనిని పరిష్కరిస్తారని ధీమాను కనబరిచారు.;
స్టార్లతో పోస్టర్ వేసి, మంచి టైటిల్ పెట్టినంత వీజీ కాదు సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయడం. అలాంటి ఒక కష్టంలో ఉంది `వెల్ కం టు ది జంగిల్`. అహ్మద్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకుడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి సహా మొత్తం 36 మంది క్రేజీ స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ అంతకంతకు ఆలస్యమవుతుండడంతో అభిమానులు దీనిని చూడలేమనే ఆందోళనకు గురవుతున్నారు.
వెల్ కం ఫ్రాంఛైజీలో రెండు సినిమాలు పెద్ద హిట్టవ్వడంతో ఇప్పుడు క్రేజీగా మూడో సినిమాపైనా భారీ అంచనాలు పెరిగాయి. ఈ ఫ్రాంఛైజీ సినిమాకి దిశా పటానీ, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి అందాల భామల హంగులు అదనపు బలం అని చెప్పాలి. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేది ఎప్పటికి? అనే సందిగ్ధత నెలకొంది.
అయితే కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్న చందంగా అహ్మద్ ఖాన్ సినిమాకి అన్నీ అడ్డంకులే. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్నా కానీ, మూడో షెడ్యూల్ కి ముందడుగు పడటం లేదు. అంతా సవ్యంగా సాగితే కశ్మీర్ లో మూడో షెడ్యూల్ జరగాల్సి ఉంది. కానీ పహల్గామ్ లో తీవ్రవాదులు అటాక్ చేసి మారణహోమం సృష్టించడం అటుపై ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా అట్టుడికిపోయింది. ఇప్పట్లో జమ్మూ కాశ్మీర్ షెడ్యూల్ చేయడం అసాధ్యమని అహ్మద్ ఖాన్ చెబుతున్నారు. కశ్మీర్ షెడ్యూల్ ని పూర్తిగా కులు మనాలి, లేహ్ ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలనే ఆలోచన ఉన్నట్టు చెప్పారు.
ఇక ఈ సినిమాకి ఆర్థిక కష్టాలు ఉన్న మాట వాస్తవమేనని కూడా అతడు అంగీకరించాడు. అయితే సాజిద్ దీనిని పరిష్కరిస్తారని ధీమాను కనబరిచారు. ప్రస్తుతానికి కాశ్మీర్ షెడ్యూల్ ని ఎక్కడ షూట్ చేయాలి? అనేదానిపై కసరత్తులు చేస్తున్నారు. ఇక 36 మంది నటీనటులతో తెరకెక్కించాల్సి ఉండటంతో వారి కాల్షీట్లను సమన్వయం చేయడం సవాళ్లతో కూడుకున్నది. ప్రస్తుతం దానిపై వర్క్ చేస్తున్నట్టు అహ్మద్ ఖాన్ తెలిపారు. ఇక ఈ సినిమా ఆగిపోయిందని వచ్చిన పుకార్లను ఆయన ఖండించారు. మీడియాలో జరిగే ప్రచారం గురించి తనకు తెలియదని అన్నారు. అయితే ఆలస్యం అమృతం విషం. ఏదైనా సకాలంలో పూర్తి చేసి రిలీజ్ చేస్తేనే క్రేజ్ ఉంటుంది. లాంగ్ డిలే ప్రాజెక్టుపై ఎవరికీ అంత ఆసక్తి ఉండదు. ప్రేక్షకుల్లో ఆసక్తి చావక ముందే వారు సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది.