హిట్ ఫ్రాంచైజ్ నుంచి వ‌స్తున్న సినిమాపై ఎన్నో సందేహాలు!

బాలీవుడ్‌లో కామెడీ ఫ్రాంచైజీలకు ప్రత్యేక స్థాన‌ముంది. ముఖ్యంగా వెల్‌కమ్ సిరీస్‌కు ప్రేక్షకుల్లో ఇప్పటికీ మంచి గుర్తింపుంది.

Update: 2026-06-02 06:54 GMT

బాలీవుడ్‌లో కామెడీ ఫ్రాంచైజీలకు ప్రత్యేక స్థాన‌ముంది. ముఖ్యంగా వెల్‌కమ్ సిరీస్‌కు ప్రేక్షకుల్లో ఇప్పటికీ మంచి గుర్తింపుంది. 2007లో రిలీజైన వెల్‌కమ్ సినిమా, ఆ తర్వాత వచ్చిన వెల్‌కమ్ బ్యాక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లుగా మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కుతున్న వెల్‌కమ్ టు ది జంగిల్ పై మొదట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో దీనిపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్, 29 మంది నటీనటులతో రూపొందుతున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో బజ్‌ను సొంతం చేసుకోలేకపోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ ఆడియ‌న్స్ లో ఉత్సాహం కనిపించకపోవడం మేకర్స్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారిందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక సినిమా ప్రమోషన్ ప్లానింగ్ పై కూడా డిస్క‌ష‌న్ జరుగుతోంది. ప్రస్తుతం ప్ర‌మోష‌న్స్ లో ఎక్కువగా హీరో అక్షయ్ కుమార్ పేరు, ఆయ‌న ఇమేజ్‌పైనే ఆధారపడుతున్నట్లు కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ జ‌ర్నీ అంత గొప్ప‌గా లేదన్న విషయం తెలిసిందే. అత‌ను న‌టించిన కొన్ని సినిమాలు స‌క్సెస్ సాధించినప్పటికీ, మరికొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. రీసెంట్ గా రిలీజైన భూత్ బంగ్లా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ సినిమాకు డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్‌తో అక్షయ్ కుమార్ రీయూనియన్ అనే అంశం ప్రధాన ఆకర్షణగా నిలిచిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అదే స్థాయి ఎమోష‌న‌ల్ బాండింగ్ లేదా నోస్టాల్జియా వెల్‌కమ్ టు ది జంగిల్ విషయంలో కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కేవలం అక్షయ్ కుమార్ స్టార్ పవర్‌తోనే ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు నడపడం ఎంతవరకు ఫలిస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు ఆల్రెడీ రిలీజైన సాంగ్స్ కూడా మిక్డ్స్ రెస్పాన్సే అందుకుంటున్నాయి. మూడు పాటల్లో రెండింటిని చూసిన ప్రేక్షకులు, అవి 2007లో వచ్చిన అసలు వెల్‌కమ్ సినిమాలోని మ్యూజిక్ ను తిరిగి ఉపయోగించినట్లుగా అనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కొత్తదనం లేకపోవడం, పాత హిట్ ట్యూన్స్‌ను గుర్తు చేసే ప్రయత్నం ఎక్కువగా కనిపించడం వల్ల మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఫ్రాంచైజీ అభిమానులకు అత్యంత గుర్తుండిపోయే పాత్రలైన మజ్ను భాయ్, ఉదయ్ శెట్టి ఈ కొత్త భాగంలో కనిపించకపోవడం కూడా ఈ సినిమాకు పెద్ద లోటుగా అనిపిస్తోంది. ఈ రెండు పాత్రలు వెల్‌కమ్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అలాంటి పాత్ర‌లు ఇప్పుడు లేక‌పోవ‌డం వ‌ల్ల ఫ్రాంచైజీ అసలు ఆత్మ కొంత మేర కోల్పోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే సినిమా రిలీజైన తర్వాతే ఈ సందేహాలకు సమాధానం దొరుకుతుంది. భారీ తారాగణం, గ్రాండ్ స్కేల్‌తో రూపొందుతున్న వెల్‌కమ్ టు ది జంగిల్ ఆడియ‌న్స్ ను నిజంగా అలరిస్తుందా? లేక ప్రస్తుతం వినిపిస్తున్న అనుమానాలే నిజమవుతాయా? అనేది ఇప్పుడు బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చగా మారింది.

Tags:    

Similar News