శివాజీ ఇష్యూ సీరియస్.. 'మా' ప్రెసిడెంట్ కు లేఖ
టాలీవుడ్ లో పనిచేస్తున్న దాదాపు 100 మందికి పైగా మహిళా ప్రొఫెషనల్స్ తరపున 'వాయిస్ ఆఫ్ ఉమెన్' పేరుతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రెసిడెంట్ కు ఒక ఘాటు లేఖ రాశారు.;
'దండోరా' ఈవెంట్ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. సోషల్ మీడియా చర్చల నుంచి ఈ విషయం ఇప్పుడు సీరియస్ గా ఇండస్ట్రీ పెద్దల దృష్టికి వెళ్ళింది. టాలీవుడ్ లో పనిచేస్తున్న దాదాపు 100 మందికి పైగా మహిళా ప్రొఫెషనల్స్ తరపున 'వాయిస్ ఆఫ్ ఉమెన్' పేరుతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రెసిడెంట్ కు ఒక ఘాటు లేఖ రాశారు. ఇందులో నందిని రెడ్డి, సుప్రియ, స్వప్న దత్, మంచు లక్ష్మి, ఝాన్సీ లాంటి ప్రముఖులు సంతకాలు చేశారు.
శివాజీ వాడిన భాషపై వీరంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పబ్లిక్ ప్లాట్ ఫామ్ మీద ఉండి "సామాన్లు", "దరిద్రపు ము**" లాంటి పదాలు వాడటం చాలా తప్పు అని లెటర్ లో పేర్కొన్నారు. ఈ మాటలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, బిఎన్ఎస్ సెక్షన్ 509 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం అని గుర్తుచేశారు. ఇలాంటి రిగ్రెసివ్ మాటలు ఇండస్ట్రీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో శివాజీకి ఒక స్ట్రాంగ్ అల్టిమేటం ఇచ్చారు. ఆయన బహిరంగంగా, ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పర్సనల్ ఛాయిస్ మీద కామెంట్స్ చేయడం, వారిని అవమానించడం కరెక్ట్ కాదని అన్నారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే, లీగల్ గా ముందుకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
కేవలం డ్రెస్సింగ్ గురించే కాకుండా, ఇండస్ట్రీలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్ ని కూడా వారు ప్రశ్నించారు. ఈ మధ్య నిధి అగర్వాల్, సమంత లాంటి హీరోయిన్స్ పబ్లిక్ లో ఇబ్బంది పడినప్పుడు ఇండస్ట్రీ ఎందుకు సైలెంట్ గా ఉందని నిలదీశారు. మహిళల సేఫ్టీ, డిగ్నిటీ విషయంలో స్పందించని వాళ్ళు.. ఇప్పుడు మోరల్ పోలీసింగ్ చేయడానికి మాత్రం ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారని లెటర్ లో పాయింట్ అవుట్ చేశారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి కేవలం క్షమాపణలే కాకుండా, స్పష్టమైన యాక్షన్ ప్లాన్ కోరుతున్నారు. ఇండస్ట్రీలో మిసోజనిస్టిక్ కామెంట్స్ చేసేవారిపై చర్యలు తీసుకోవడానికి ఒక 'కోడ్ ఆఫ్ కండక్ట్' తేవాలని సూచించారు. అలాగే పబ్లిక్ ఈవెంట్స్ లో లేడీ ఆర్టిస్ట్ ల సేఫ్టీ కోసం పటిష్టమైన ప్రోటోకాల్స్ ఏర్పాటు చేయాలని, జెండర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మహిళలను కంట్రోల్ చేయడం, షేమ్ చేయడం ఇక సాగదని తేల్చి చెప్పారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూనే, అదే గ్లామర్ ని తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు. "మహిళలకు కావాల్సింది స్వేచ్ఛ, రక్షణ గౌరవం.. పోలీసింగ్ కాదు" అని లెటర్ ను ముగించారు. మరి ఈ లేఖపై మా అసోసియేషన్, శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి.