మరోసారి పుతిన్ డూప్టాపిక్... అధికారిక కార్యక్రమాల్లో ఉన్నది ఎవరు?

గతకొన్ని రోజులుగా రష్యా అధ్యక్షుడి బాడీ డబుల్స్ వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే

Update: 2023-11-07 03:00 GMT

గతకొన్ని రోజులుగా రష్యా అధ్యక్షుడి బాడీ డబుల్స్ వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 71 ఏళ్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అక్టోబర్ 22 ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చిందని.. దీంతో మంచం మీద నుండి పడిపోయారని.. అలా పడిపోయే క్రమంలో టేబుల్ అతని ముఖానికి తగిలి ముక్కుకు తీవ్ర గాయం అయ్యి రక్తస్రావం జరిగిందని వార్తలు అంతర్జాతీయ మీడియాలో హల్ చల్ చేశాయి! ఇదే సమయంలో పుతిన్ ప్లేస్ లో ఉన్నది అతని డూప్ అనే చర్చ కూడా మొదలైంది.

అవును... పుతిన్ కు గుండెపోటు వచ్చిందని, దీంతో ఆయన కిందపడిపోయారని, అది గమనించిన భద్రతా సిబ్బంది.. వైద్యుడికి సమాచారం అందించినట్టు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే! దీంతో... పుతిన్ ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. ఇప్పుడు పుతిన్ స్థానంలో ఉన్నది ఆయన డూప్ అని అటు సోషల్ మీడియాలోనూ తీవ్రస్థాయిలో చర్చ నడుస్తుంది. ఈ సమయంలో మరోసారి ఈ విషయంపై తీవ్ర చర్చ తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం రష్యా పలు అధికారిక కార్యక్రమాల కోసం అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ డూప్‌ ను వినియోగిస్తున్నదంటూ సోషల్‌ మీడియాలో ఊహాగానాలు మరింత షికారు చేస్తున్నాయి. ఇప్పుడు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటుంది పుతిన్ కాదని, ఆయన రహస్యంగా చికిత్స తీసుకుంటున్నారని, ఇప్పుడు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటుంది అతడి డూప్ అని మరోసారి మొదలైంది. దీంతో... అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ మరోసారి స్పందించింది.

ఇందులో భాగంగా... క్రెమ్లిన్‌ అధ్యక్ష ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ స్పందించారు. ఇలా జరుగుతున్న చర్చను ఖండించారు. ఇటువంటి వాదనలను వినోదం కోసమే చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తాజాగా మాస్కోలో ప్రారంభమైన రష్యా ఎగ్జిబిషన్‌ లో మాట్లాడిన డిమిత్రి పెస్కోవ్... తమకు ఉన్నది ఒక్కరే పుతిన్ అని అన్నారు.

రష్యా అధ్యక్షుని "బాడీ డబుల్స్‌" అంటూ వస్తున్న ఊహాగానాలు హాస్యాస్పదమైనవని తెలిపాడు. ఈ సందర్భంగా తమకు ఉన్నది ఒకరే పుతిన్ అయినప్పటికీ... కొందరు నిపుణులు మాత్రం ఇంటర్నెట్‌ లో లెక్కకుమించి పుతిన్ రూపాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఇటువంటివి విరివిగా కనిపిస్తున్నాయని అన్నారు.

కాగా... పలు విదేశీ పర్యటనలతో సహా కొన్ని బహిరంగ కార్యక్రమాలకు కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ బాడీ డబుల్స్‌ ను ఉపయోగించారని ఒక వార్తాపత్రిక ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఇటీవల జపనీస్ టీవీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిల్ బుడనోవ్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు.

దీంతో రోజు రోజుకీ ఎక్కువగా వినిపిస్తున్న పుతిన్ "లుక్ అలైక్" నివేదికలు అసంబద్ధమైనవంటూ తాజాగా మరోమారు డిమిత్రి పెస్కోవ్‌ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మంచి ఫిట్‌ నెస్ కలిగి ఉన్నారని , నాన్‌ స్టాప్‌ గా కూడా పని చేయగలరని ఆయన పేర్కొన్నారు. అయితే... డూప్‌ ను ఉపయోగిస్తారంటూ సుదీర్ఘకాలంగా వస్తోన్న కథనాలపై 2020లోనే పుతిన్ స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆ ఊహాగానాలను తోసిపుచ్చారు. అయితే ఈ సమయంలో ఈ చర్చ మరింత గట్టిగా సాగుతుంది.

Tags:    

Similar News