బెంగాల్ మరో కశ్మీర్... డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
వివాదాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వరుసగా వివాదాస్పద సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.;
వివాదాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వరుసగా వివాదాస్పద సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఈయన దర్శకత్వంలో వచ్చి ది కశ్మీర్ ఫైల్స్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ కశ్మీర్ ఫైల్స్ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టింది. కశ్మీర్ లో అప్పుడు ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు అని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆయన దర్శకత్వంలో ప్రస్తుతం 'ది బెంగాల్ ఫైల్స్' సినిమా రూపొందుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా ఆయన బాహాటంగానే చెబుతున్నాడు. ఈ సినిమా రాజకీయ వివాదంను రగిల్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం ద్వారా సినిమా గురించి చర్చ మొదలైంది.
1946 అల్లర్ల నేపథ్యంలో నేపథ్యంలో మూవీ
ఇటీవల వివేక్ అగ్నిహోత్రి సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. దేశ సమగ్రత దెబ్బ తీసే విధంగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా పశ్చిమ బెంగాల్‌లో పెరిగి పోతున్న జనాభ విషయంలోనూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ స్వదేశీయుల కంటే విదేశీయులు ఎక్కువగా ఉన్నారు. వారికి ఫేక్ ఐడీ లను క్రియేట్ చేసి ఇవ్వడం ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లిందని అంటున్నారు. 1946 అల్లర్ల సమయంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు చెప్పుకొచ్చాడు. పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుత పరిస్థితులు తనకు ఆందోళన కలిగిస్తున్నాయి అంటూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రద్దు
ది బెంగాల్ ఫైల్స్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను పోలీసులు అడ్డు కోవడంపైనా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. రెండు సార్లు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను అడ్డుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది వ్యక్తిగత స్వేచ్చ హరించడం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఉన్న వాక్ స్వాతంత్య్రాన్ని బెంగాల్ ప్రభుత్వం హరించిందని ఆయన అన్నాడు. అంతే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఫేక్ ఐడీలతో గుర్తింపును ఇవ్వడంతో పాటు, దేశంలో ఉన్న అధికారాలను వారికి ఇవ్వడం జరిగింది. అక్రమ వలసదారులను దేశంలోకి రానివ్వడం, వారికి గుర్తింపును ఇవ్వడం అనేది ఖచ్చితంగా దేశ భద్రతకు పెను ప్రమాదం అన్నాడు. దేశ వ్యాప్తంగా వారి వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
గ్రేట్ కలకత్తా హత్యలపై మూవీ
1946 ఆగస్టు 16న డైరెక్ట్ యాక్షన్ డే చుట్టూ జరిగిన విషాద సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. దీనిని 1946 గ్రేట్ కలకత్తా హత్యలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ హింస చాలా స్పీడ్‌గా వ్యాప్తి చెందింది. బెంగాల్‌లో మత హింస యొక్క నిజ సంఘటనల ఆధారంగా ఇప్పటి వరకు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే వివేక్ ఆత్రేయ గతంలో చేసిన సినిమాల నేపథ్యంలో ఈ సినిమాకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి , అనుపమ్ ఖేర్ , దర్శన్ కుమార్ , పల్లవి జోషి , సిమ్రత్ కౌర్ , శాశ్వత ఛటర్జీ , నమాషి చక్రవర్తి, రాజేష్ ఖేరా , పునీత్ ఇస్సార్ , ప్రియాంషు ఛటర్జీ , దిబ్యేందు భట్టాచార్య , సౌరవ్ కపూర్, మోహన్ దాస్ నటించారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. రోహిత్ శర్మ సంగీతాన్ని అందించారు.