రాజా సాబ్ కు ఆర్థిక సమస్యలా?.. విశ్వప్రసాద్ ఏమన్నారంటే?
"విడుదలకు ముందే సినిమాలు ఆగిపోవడం, అది పరిశ్రమలోని వివిధ రంగాలపై చూపే ప్రభావం దురదృష్టకరం.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ది రాజా సాబ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాను ప్రముఖ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
జనవరి 9వ తేదీన మూవీ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుండగా.. కొన్ని గంటలుగా సినిమా రిలీజ్ పై ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా బాలయ్య అఖండ 2 తాండవం మూవీ పోస్ట్ పోన్ అవ్వడంతో రాజా సాబ్ కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అంతే కాదు.. ఆ సినిమా మేకర్స్ కు కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కూడా బాలీవుడ్ నిర్మాణ సంస్థకు డబ్బులు పెండింగ్ ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో నిర్మాత విశ్వప్రసాద్.. ఇప్పుడు స్పందించారు. రూమర్స్ పై రెస్పాండ్ అవుతూ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
"విడుదలకు ముందే సినిమాలు ఆగిపోవడం, అది పరిశ్రమలోని వివిధ రంగాలపై చూపే ప్రభావం దురదృష్టకరం. చిన్న చిత్రాల నిర్మాతలు తమ మూవీలను పెద్ద సినిమాల ప్రకారం ప్లాన్ చేసుకుని.. ఇప్పుడు వేచి ఉండటం నన్ను తీవ్రంగా కలవరపెట్టింది" అంటూ విశ్వప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
"చివరి నిమిషంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. అంతరాయాలు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సహా వేలాది మంది జీవనోపాధిని ప్రభావితం చేస్తాయి. అందుకే దాన్ని ఖండించాల్సిందే" అని చెప్పారు.
"చివరి నిమిషంలో అంతరాయాలను నివారించడానికి థర్డ్ పార్టీ వ్యక్తులు విషయంలో స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించడం చాలా ముఖ్యం. బాధ్యతారహిత ప్రయత్నాలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అని తెలిపారు. ప్రస్తుతం రాజా సాబ్ మూవీ చుట్టూ.. దాన్ని రిలీజ్ చుట్టూ అనేక ఊహాగానాలు ఉన్నాయని అన్నారు.
అయితే రాజాసాబ్ మేకింగ్ కు తీసుకున్న ఫైనాన్స్ పూర్తిగా క్లియర్ అయిందని, వడ్డీలు కూడా అనుకున్నదాని కంటే ముందుగానే క్లియర్ చేస్తామని చెప్పారు. రాజా సాబ్ తో పాటు వస్తున్న అన్ని సంక్రాంతి రిలీజ్ చిత్రాలు ఇబ్బందులు లేకుండా విడుదల కావాలని ఆకాంక్షించారు. అన్ని సినిమాలు కూడా ఘన విజయం సాధించాలని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు.