విశ్వంభరలో కొత్త అద్భుతం.. జీనీగా టాలెంటెడ్ నటుడు!
ఇదిలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటుడు రావు రమేశ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.;
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న భారీ ఫాంటసీ ఎంటర్‌టైనర్ "విశ్వంభర" సినిమాపై కొన్ని అనుమానాలు ఉన్నా ఇది ఫాంటసీ యాంగిల్ లో ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ అవుతుందని ఎక్కడో ఒక చిన్న హోప్ అయితే ఉంది. యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సోషల్ మీడియా లో విడుదలైన ప్రతి అప్డేట్ తో ట్రెండ్ సృష్టిస్తోంది. హయ్యెస్ట్ వీఎఫ్‌ఎక్స్, ఓవర్ ది టాప్ విజువల్స్, మెగాస్టార్ కొత్త గెటప్ వంటి అంశాల వల్ల ఈ సినిమా విడుదల కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట, ఈ సినిమాలో పలు కొత్త లోకాలను సృష్టించినట్టు చెప్పారు. అవి పూర్తిగా పంచభూతాల బేస్ మీద ఉంటాయని, విశ్వాన్ని భరించే శక్తి ఉన్న ఓ లోకమే "విశ్వంభర" అని చెప్పారు. తండ్రీ కొడుకుల ఎమోషన్, విభిన్న పాత్రలు, కుటుంబం భావనల నేపథ్యంలో ఈ కథ నడవనుందని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి అందిస్తున్న నేపథ్య సంగీతం ఇప్పటికే అంచనాలు పెంచేస్తోంది.
ఇదిలా ఉండగా, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటుడు రావు రమేశ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాలో జీనీ తరహా పాత్రలో నటిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అరబియన్ నైట్స్ తరహా హాఫ్ బాడీ రూపంలో ఉండే ఈ పాత్ర, తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రాలేని కొత్త కోణాన్ని ప్రదర్శించనుందట. ‘మగధీర’లో అఘోర పాత్రతో భయపెట్టిన రావు రమేశ్.. ఇప్పుడు ఫాంటసీ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించనున్నారు.
రావు రమేశ్ పాత్ర విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. వాస్తవిక పాత్రలు చేయడంలో ప్రసిద్ధి గాంచిన ఆయన ఇలా జీనీ లాంటి ఫాంటసీ క్యారెక్టర్ చేయడం కొత్త ట్రై అని చెప్పాలి. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ పాత్రకు గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఎక్కువగా ఉండనుందని సమాచారం. రావు రమేశ్ ఈ పాత్రలో కామెడీ, మిస్టరీ, ఎమోషన్ మిక్స్ తో స్క్రీన్ మీద ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్ ని తయారుచేసే అవకాశం ఉంది.
చిరంజీవితో పాటు త్రిష, కునాల్ కపూర్, ఆశిక రంగనాథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే సీజీఐ పనులు తుదిదశకు చేరగా, ఒక్క పాట షూట్ మినహా మొత్తం సినిమా పూర్తయినట్లు సమాచారం. అక్టోబర్ లో ట్రైలర్ విడుదల చేసే అవకాశముంది. 2025 సంక్రాంతి రిలీజ్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విశ్వంభర సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ భారీగా విడుదల కానుంది.